Published : 20/03/2023 00:23 IST

దుస్తులతో మాయ చేయొచ్చు

కొంత మంది ఎత్తు తక్కువగా ఉన్నామని ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. ఎత్తు చెప్పులను ఆశ్రయిస్తుంటారు. వీటితో దీర్ఘకాలంలో అనారోగ్యం. బదులుగా ఆహార్యంలో కొన్ని మార్పులు చేసుకోమంటున్నారు నిపుణులు..

చీరలో.. అంచులు పెద్దగా ఉండే చీరలు.. ఎత్తు తక్కువగా కనిపించేలా చేస్తాయి. కాబట్టి డిజైన్లు, అంచులు, ప్రింట్‌లు ఏవైనా చిన్నగా ఉండేలా చూసుకోండి. కొంచెం పొడవుగా కనిపించేలా చేస్తాయివి. ఒకటే రంగు ఉన్నవైతే ఇంకా మంచిది. మూడు నాలుగు రంగులతో ఉన్న చీరలు శరీరాన్ని భాగాల కింద విడగొట్టినట్టు చేసి, పొట్టిగా కనపడేలా చేస్తాయి. కాబట్టి రంగులనూ జాగ్రత్తగా ఎంచుకోవాలి.

కుర్తీల్లో.. డ్రెస్సుల విషయంలోనూ పై భాగం కంటే నడుము కింది భాగం పొడవుగా ఉండేవి ఎంచుకోవాలి. అంటే 40:60 నిష్పత్తిలో ఉండాలి. ముఖ్యంగా లాంగ్‌ ఫ్రాక్‌లు, అనార్కలీలు ఈ పద్ధతిలో ఉండేలా చూసుకోవాలి. పలాజో, పటియాలా అయితే మరీ ఎక్కువ లూజుగా ఉన్నవి వద్దు. అవి ఎత్తు తక్కువే కాదు లావుగా కనిపించేలానూ చేస్తాయి. డ్రెస్‌ సైడ్‌ కటింగ్‌లు మరీ కిందకి కాకుండా నడుము పైకి ఉండేలా చూసుకోవాలి. టాప్‌ బిగుతుగా ఉంటే పైజామా కొంచెం లూజు ఉండాలి.

పొడవుగా వద్దు.. జీన్స్‌ కూడా మరీ పొడవుగా ఉన్నవి ఎంచుకోవద్దు. మడమ వరకూ ఉన్నవి తీసుకోండి. టీషర్ట్స్‌, జీన్స్‌ టాప్స్‌ లాంటివి టక్‌ చేసుకుంటే నడుము దగ్గరినుంచి కింది భాగం పొడవుగా కనిపిస్తుంది. కాబట్టి టక్‌ చేసుకునే వీలున్న టాప్‌లు ఎంచుకోండి. మోకాలి వరకూ ఉండే కుర్తీల కంటే కొంచెం కింది వరకూ ఉండేవి ఇలాంటివారికి బాగా నప్పుతాయి.

నెక్‌ డిజైన్లు.. బ్లౌజులైనా, డ్రెస్సులైనా వీ నెక్‌ మెడకు ప్రాధాన్యమివ్వండి. కొంచెం పొడవుగా అనిపిస్తాం. చేతులు మరీ పొడవుగా ఉండే వాటికంటే మోచేయి, హాఫ్‌స్లీవ్స్‌ వంటివి కుట్టించుకోవడమే మేలు. పొడవుగా కనిపించాలంటే హీల్స్‌ ఒక్కటే కాదు. ఇలా చిన్న చిన్న చిట్కాలతోనూ మాయ చేయొచ్చు. ఇంకేం.. ప్రయత్నించి చూడండి మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని