క్యాన్సర్‌ బాధితులకు ఉపశమన చికిత్స!

ఉన్నత విద్య అభ్యసించాలన్నది ఆమె కోరిక. మూడు పదుల వయసులో బాబుని తీసుకుని పీహెచ్‌డీ కోసం కెనడా వెళ్లారామె. అక్కడకి వెళ్లాక ఊహించని కుదుపు.. ఆమెకు బ్లడ్‌ క్యాన్సర్‌ నిర్ధరణ అయ్యింది. నాణ్యమైన చికిత్స అందడంతో దాన్నుంచి కోలుకున్నారు. ఆ సమయంలో ఎదురైన అనుభవాలే ఇండియాలో క్యాన్సర్‌ బాధితుల గురించి ఆలోచింపజేశాయామెను. ఇంతకీ ఆమె ఎవరు.. ఏం చేస్తున్నారంటే..

Published : 08 Sep 2022 00:52 IST

ఉన్నత విద్య అభ్యసించాలన్నది ఆమె కోరిక. మూడు పదుల వయసులో బాబుని తీసుకుని పీహెచ్‌డీ కోసం కెనడా వెళ్లారామె. అక్కడకి వెళ్లాక ఊహించని కుదుపు.. ఆమెకు బ్లడ్‌ క్యాన్సర్‌ నిర్ధరణ అయ్యింది. నాణ్యమైన చికిత్స అందడంతో దాన్నుంచి కోలుకున్నారు. ఆ సమయంలో ఎదురైన అనుభవాలే ఇండియాలో క్యాన్సర్‌ బాధితుల గురించి ఆలోచింపజేశాయామెను. ఇంతకీ ఆమె ఎవరు.. ఏం చేస్తున్నారంటే..

ర్మల గుప్తాకు అప్పటికి 33 ఏళ్లు. కెనడాలోని మెక్‌గిల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. తరచూ అనారోగ్యానికి గురవుతుంటే చికిత్స కోసం హాస్పిటల్‌కి వెళ్లేవారు. అప్పుడే బ్లడ్‌ క్యాన్సర్‌ ఉన్నట్టు తెలిసింది. ‘నేను ఎవరి సిఫార్సులూ తేకుండానే నాకు అత్యుత్తమ చికిత్స అందింది. అదే సమయంలో వాలంటీర్లు తరచూ వచ్చి మాట కలిపే వారు. నా ఇబ్బందులను ఓపిగ్గా వింటూ ధైర్యం చెప్పేవారు. మానసిక ప్రశాంతత కోసం కొన్ని క్లాసులకూ హాజరయ్యా. ఇవన్నీ ఆత్మస్థైర్యం నింపి కోలుకుంటాననే ధైర్యాన్ని కలిగించాయి. అప్పట్లో మన దేశంలో క్యాన్సర్‌ రోగుల పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. అదొస్తే చనిపోవడమే అన్నట్టుండేది. ఇక్కడ మానసిక ధైర్యం ఇచ్చేవారే లేరనిపించింది. అందుకే నాకు నయమయ్యాక తిరిగొచ్చి దిల్లీ కేంద్రంగా 1991లో ‘క్యాన్‌సపోర్ట్‌’ను ప్రారంభించా’ అని గుర్తుచేసుకున్నారు హర్మల. ఈ సంస్థ వాలంటీర్లు క్యాన్సర్‌ బాధితులూ, వారి కుటుంబాలకు మద్దతుగా నిలుస్తారు. మందులు అందించడంతోపాటు మానసిక ధైర్యాన్నీ నింపి ఆందోళనలకు దూరంగా ఉంచుతారు.

నాలుగు రాష్ట్రాల్లో...

దిల్లీ, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌లలో క్యాన్‌సపోర్ట్‌కు చెందిన 30 వాలంటీర్ల బృందాలు సేవలందిస్తున్నాయి. వీళ్లు ప్రస్తుతం మూడువేల మంది క్యాన్సర్‌ బాధితులకు మద్దతుగా నిలుస్తున్నారు. చికిత్సకు నయం కాని దశకు వచ్చాక సొంత గూటికి వెళ్లిన వారికి పాలియేటివ్‌ కేర్‌ను అందిస్తారు. డాక్టర్‌, నర్స్‌, కౌన్సెలర్‌, సోషల్‌ వర్కర్‌లతో కూడిన వాలంటీర్ల బృందం వీరి దగ్గరకు నెలలో రెండు, మూడు సార్లు వెళ్తుంది. రోగుల అవసరాలు తెలుసుకుని వీలైన సాయం చేస్తారు. ‘వీరిలో ఎక్కువగా పేద గ్రామీణులూ, వలస కూలీలూ ఉంటారు. మరణాన్ని అంగీకరించడం ఈ దశలో అతి పెద్ద సవాలు. మా వాలంటీర్ల బృందం చికిత్సకంటే కూడా రోగి మానసిక పరిస్థితి మీద దృష్టి పెడుతుంది. గాయాలకు డ్రెసింగ్‌ చేయడంతోపాటు వారిని సంతోషంగా ఉంచడంలో కుటుంబీకులకు కౌన్సెలింగ్‌ ఇస్తారు. రోగులకు అవసరమైన మందులు, పరికరాలు ఇస్తారు. పేద కుటుంబాలకు రేషన్‌ సరుకులు, కుటుంబ సభ్యులకు కుట్టు మిషన్లూ ఇస్తారు. కొందరైతే కుటుంబీకుల నుంచి తగినంత ప్రేమ, ఆదరణ లభించక తమతో తీసుకువెళ్లమని అడుగుతుంటారు. అలాంటి వారికి వీలున్న చోట ఆశ్రయం కల్పిస్తాం’ అని చెప్పే హర్మల ఈ సేవలన్నింటినీ ఉచితంగానే అందిస్తున్నారు. భారత్‌లో ఏటా 10 లక్షల క్యాన్సర్‌ కేసుల్ని గుర్తిస్తున్నారనీ, చికిత్సతోపాటు వారి మానసిక ఆరోగ్యం చూసుకోవడంలో, జీవిత చరమాంకంలో బాధల నుంచి ఉపశమనం కలిగేలా పరిస్థితులు మారాలంటారీమె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్