Published : 06/09/2021 01:24 IST

అడిగిన వెంటనే ఇవ్వొద్దు

కొందరు పిల్లలు కోరింది ఇవ్వకపోతే...మొండిగా ప్రవర్తిస్తారు.  మాట వినకుండా కోపం ప్రదర్శిస్తుంటారు. అలాగని వారి డిమాండ్‌లకు ఒప్పుకుని చేస్తే...దాన్నే అలవాటుగా మార్చుకుంటారు. అందుకే  వారికి అందించే ప్రతి వస్తువు విలువ తెలిసేలా చేయడం పెద్దవాళ్ల బాధ్యత అని సూచిస్తున్నారు నిపుణులు.

విడదీయాలి... పిల్లలు తమకేదైనా కావాలని మారాం చేస్తుంటే... వాటిల్లో వారికి అత్యవసరమైనవి, కానివి అంటూ తల్లిదండ్రులు విడదీయగలగాలి. చదువుకు సంబంధించినవాటిని తక్షణం కొనివ్వాల్సి ఉంటుంది. అలాగని ఆడుకునేవాటిపై అశ్రద్ధ ప్రదర్శించకూడదు. అయితే అడిగిన వెంటనే అందించకుండా, వాటిని ఎందుకు కోరుతున్నారో వారినే అడిగి తెలుసుకున్న తర్వాత ఆలోచించాలి. ఇలా ఏది అవసరం, ఏది కాదు...అనేదానిపై వారికి అవగాహన కలిగించాలి.

అదుపులో... చిన్నారులు కోరేవి కొన్నిసార్లు ఎక్కువ ఖరీదు ఉంటాయి. అది వారికి తెలియకపోవచ్చు. అంతేకాదు, ఇతరుల వద్ద చూసినవి కూడా తమకు కావాలనుకునే పసితనం వారిలో ఉంటుంది. వాటిని కొనగలిగే స్థాయి ఉన్నా లేదా లేకపోయినా వెంటనే మాత్రం ముందడుగు వేయకూడదు. వాటి విలువ, దానికోసం కావాల్సిన నగదు, అదెలా వస్తుందో అనే విషయాలను మృదువుగా పిల్లలకు వివరించాలి. కొనివ్వను అని ఒకేసారి వారిపై కోప్పడకుండా,  దాని వెనుక ఉన్న కారణాలను వారికి చెప్పాలి. ఆ తర్వాత వారి కోరికలు కొన్ని అదుపులో ఉంటాయి.

పొదుపు ... చిన్నప్పటి నుంచి కిడ్డీ బ్యాంకును అలవాటు చేయాలి. ప్రతిరోజు, వారానికొకసారి లేదా నెలకొకసారి ఎంతోకొంత నగదు వారికిచ్చి పొదుపు చేయడం నేర్పాలి. అలా దాచినదాంతో వారు కోరే బొమ్మలను కొనుక్కోవచ్చని చెప్పాలి. ఇంట్లో నిత్యావసరాలకు ఎంతెంత అవుతోందో, స్కూల్‌ఫీజు నుంచి పుస్తకాల వరకు నగదు ఎంత కావాల్సి వస్తుందో వారికి అప్పుడప్పుడు చెబుతూ ఉండాలి. అప్పుడే చిన్నారులకు నగదు విలువతోపాటు పొదుపు చేయడం కూడా తెలుస్తుంది. దేనికెంత ఖర్చు పెట్టాలో కూడా క్రమేపీ వారిలో అవగాహన మొదలవుతుంది. అది వారికి  భవిష్యత్తులో మనీ మేనేజ్‌మెంట్‌ అంటే ఏంటో నేర్పుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని