జీవితం ప్రేమయాత్ర కావాలి

రాజూ శ్వేత ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు ఒకరంటే ఒకరికి వల్ల మాలిన అభిమానం. పరస్పరం విడిచి ఉండలేమనుకున్నారు. కానీ ఇప్పుడా ప్రేమంతా ఎలా ఆవిరైందో కానీ ఏడాదైనా కాకుండానే, తొలి పెళ్లిరోజు వేడుకైనా..

Updated : 24 Oct 2021 06:27 IST

రాజూ శ్వేత ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు ఒకరంటే ఒకరికి వల్ల మాలిన అభిమానం. పరస్పరం విడిచి ఉండలేమనుకున్నారు. కానీ ఇప్పుడా ప్రేమంతా ఎలా ఆవిరైందో కానీ ఏడాదైనా కాకుండానే, తొలి పెళ్లిరోజు వేడుకైనా జరుపు కోకుండానే ఒకరి పొడ ఒకరికి గిట్టడం లేదు. కదిల్తే గొడవ, మెదిల్తే ఘర్షణ. ఇద్దరి మధ్యా సఖ్యత కలిగించి, రాజీ కుదర్చడానికి పెద్దలు నడుం బిగించారు....

తనెప్పుడూ వాళ్ల అమ్మానాన్నల గురించే ఆలోచిస్తాడు. ఇక తన నుంచి నేను ఆశించడానికి ఏముంది?! ఇంటి పనులతో ఊపిరే సలపడంలేదు, జిమ్‌కి ఎక్కడ వెళ్లగలను? వాళ్లమ్మతో కలిసి కాలక్షేపం చేయడం లేదని అదేదో నేరంలా ఆరోపిస్తాడు, ఆవిడతో నాకేం కబుర్లుంటాయి?’ అంటూ ఆమె... ‘నేను కూర్చున్నా, నిలబడినా తప్పే అంటుంది. ప్రతిదానికీ అప్‌సెట్‌ అయిపోతుంది. బయట ఎండెక్కువైనా, ఇంట్లోకి పిల్లి దూరినా నేనే కారణం అంటుంది. పుట్టింటికైతే ఎగురుకుంటూ వెళ్తుంది, కాసేపైనా మా అమ్మతో ప్రేమగా కలిసుండదు’ అంటూ అతను ఫిర్యాదుల ఫిరంగులు మోగించారు.

విన్న పెద్దలు.. అవెంత పనికిమాలిన కారణాలో, అంత చిన్న విషయాలను భూతద్దంలో చూసి యుద్ధాలు సృష్టించుకుంటే ఆనక వాతావరణం కలుషితమై ప్రేమకు చిరునామాలా ఉండాల్సిన ఇల్లు కాస్తా రణరంగానికి చిహ్నంలా మారుతుందని.. అప్పటికీ తెలివి లేక సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకుంటే ఆపైన జీవితాంతం ఒంటరిగా బతకాల్సి వస్తుందని చెప్పారు. ‘అప్పుడిక పశ్చాత్తాప్పడినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమవుతుంది’ అంటూ ఉదాహరణలు చూపించారు. ఏ సైకియాట్రిస్టులకూ తీసిపోనంత గొప్పగా కౌన్సిలింగులు ఇచ్చారు. ఫలితంగా ఆ సంసారం కోర్టు మెట్లు ఎక్కకుండానే చక్కబడిపోయింది. ఇళ్లల్లో ఇలా విడమర్చి చెప్పే పెద్దలుండాలే కానీ ఎన్నో జంటలు విడాకుల బాట పట్టకుండా ప్రేమయాత్రలు సాగిస్తారనడంలో అతిశయం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని