కళలతో చిన్నారుల్లో చైతన్యం
close
Published : 01/11/2021 21:30 IST

కళలతో చిన్నారుల్లో చైతన్యం

మంగళ తన ఇద్దరు పిల్లలకు క్రీడలు, కళల్లో ప్రవేశం కల్పించడానికి కృషి చేస్తుంటుంది. ఆమెను చూసి ఇరుగుపొరుగంతా విమర్శిస్తుంటారు. ఏదో ఒకటి నేర్పిస్తే చాలదా అంటారు. చిన్నారుల్లో ఇవన్నీ సృజనాత్మకతను పెంచి, చైతన్యవంతంగా తీర్చిదిద్దుతాయంటున్నారు మానసిక నిపుణులు.  

* నైపుణ్యాలు... చిన్నారులకు ఏ రంగంలో ఆసక్తి ఉందో తేలిగ్గా గుర్తించొచ్చు. చదువే కాకుండా, సంగీతం, నృత్యం, చిత్రకళ.. ఇలా అభిరుచికి ఏదో ఒక దాంట్లో ప్రవేశం కల్పించాలి. దాంతో పిల్లల్లోని సృజన బయటకు వస్తుంది. అది వారికి మానసికారోగ్యాన్నీ అందిస్తుంది. ఒత్తిడి లేకుండా చేసి, చదువులో రాణించేలా ప్రోత్సహిస్తుంది.

* సంగీతం... పిల్లల మెదడులోని పలు ప్రాంతాలు సంగీతంతో ప్రేరేపణకు గురి అవుతాయి. మెదడు ఉత్సాహంగా మారుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. లెక్కలు వేగంగా చేయగలిగేలా మెదడు చురుకుగా మారుతుంది. కొత్త పాఠాలపై ఆసక్తి పెరుగుతుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలుగుతారు. స్నేహం, బృందస్ఫూర్తి వంటివి అలవడతాయి. నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి. క్రమశిక్షణగా మెలగుతారు. ఎంతటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించగలిగేలా ఎదుగుతారు.

* చిత్రకళ, నృత్యం... చదువుతో సంబంధం లేని చిత్రకళను పిల్లలకు అవసరం అంటున్నారు నిపుణులు. దీనివల్ల చాలా ప్రయోజనాలున్నాయి. భావ వ్యక్తీకరణ కచ్చితంగా ఉండేలా చిత్రకళ మలుస్తుంది. సృజనాత్మకతను పెంచుతుంది. దీంతో చదువులోనే కాదు, ఉద్యోగంలో నైపుణ్యాలను ప్రదర్శించే సామర్థ్యాన్ని పొందడానికి దోహదపడుతుంది. నృత్యం శారీరకారోగ్యమే కాకుండా మానసికంగానూ పరిపక్వతను అందిస్తుంది.

* క్రీడలు... వేరే పిల్లలతో ఆడుతున్నప్పుడు స్నేహభావం చిగురిస్తుంది. గెలుపోటములపై అవగాహన తెచ్చుకుంటారు. ఆటలతో శారీరక, మానసికారోగ్యాన్ని పొందుతారు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటారు. ఓర్పు, సహనం, వ్యక్తిగత నియంత్రణ, ఆత్మవిశ్వాసం వంటివన్నీ క్రీడలద్వారా చిన్నారులకు అలవడతాయి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని