Updated : 14/01/2022 04:53 IST

సంక్రాంతి.. మీ పిల్లలతో చేయించండిలా..!

సంక్రాంతి మనకి పెద్ద పండగ. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఆనందోత్సాహాలతో ఈ పండగను చేసుకొంటా. కానీ, నేటి తరాల్లో చాలా మందికి సంక్రాంతి సంబరం అంటే పెద్దగా తెలియదు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అంటూ నాలుగు రోజుల ఈ పండగ ప్రాశస్త్యం ఏంటో వివరిస్తూ... పిల్లలనే భాగస్వాములను చేస్తూ వారితోనే సంబరాలు చేయించండిలా...!

ముగ్గుల్లో సాయం... సంక్రాంతి అంటే ముగ్గుల పండగ. ఇంటి ముందు మీరు ముగ్గులు వేసేటప్పుడు పిల్లలను కూడా పిలవండి. మీరు చుక్కలు కలుపుతూ వేస్తుంటే వాటిలో ఏయే రంగులు నింపాలో చెప్పి, వాళ్లతో చేయించండి. బియ్యప్పిండితో ముగ్గులు ఎందుకు వేసే వారో చెప్పండి. ముగ్గు వేయడమంటే ఓపికతో కూడిన వ్యవహారం...  అది కూడా అలవాటు చేసుకోవాలని చెప్పండి.

‘భోగి’ మంటలు వేయించండి.. ఇప్పుడు పిల్లలు స్కూల్‌కు బయలుదేరే గంట ముందు కానీ నిద్ర లేవటం లేదు. అలాకాకుండా భోగి మంట గురించి చెప్పి, ఇంట్లో ఉన్న పాత సామాన్లను ముందురోజే సేకరించి పెట్టమని చెప్పండి. భోగి రోజున సూర్యోదయానికి ముందే మీ పిల్లలను లేపండి. ఆ పాత సామానులను ఇంటి ముందు వేసి మంట పెట్టించండి. పాత ఆలోచనలను, పాతదనాన్ని మంటలలో వేసి తగల బెట్టడమే భోగి మంటల ఉద్దేశమని వివరించండి.

పిల్లలతోనే ఇప్పించండి.. సంక్రాంతి  అంటే హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నలతో గంగిరెద్దులు ఇంటి ముందుకు వస్తాయి. హరిదాసులు, గంగిరెద్దులు వచ్చినప్పుడు పిల్లలతోనే వారికి బియ్యం, పిండివంటలు, పాత బట్టలు ఇప్పించండి. దీని వల్ల ఇతరులకు దానం, సాయం చేయాలన్న ఆలోచన చిన్నారుల్లో పెంపొందించినట్లు అవుతుంది.

భోగిపళ్లు ఎందుకు? మీ ఇంట్లో భోగిపళ్లు పోస్తుంటే మీ పిల్లల స్నేహితులను, పక్కింట్లో ఉండే పిల్లలను కూడా పిలవండి. భోగిపళ్లు (రేగుపండ్లు) పోసే ముందు అవి ఎందుకు పోస్తారో వివరించండి. రేగు పండ్లు తింటే కలిగే ప్రయోజనాలు తెలియజేయండి.

జనవరిలోనే వస్తుందేం? సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతుంటాడు. ఆయన ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించడమే ఉత్తరాయణ పుణ్యకాలం. అందుకే ఈ సంక్రాంతి శ్రేష్ఠమైంది. సంక్రాంతిని పెద్ద పండగ అనటానికి మరో కారణం... తొలి పంట ఇంటికి వచ్చే సమయంలో అన్నదాతలు ఆనందంగా ఉంటారు. కళకళలాడుతున్న పొలాలను, వచ్చే దిగుబడిని తలుచుకుని సంతోష పడుతుంటారు.

కనుమ రోజున పశువుల పూజ.. సంక్రాంతి మరునాడు జరిపే కనుమకు రైతుల పండగ అని పేరు. తమకు అండగా నిలిచిన ఆవులు, ఎడ్లకు కృతజ్ఞతగా కనుమ రోజున వాటిని పూజిస్తారు. గిట్టలు, కొమ్ములకు పసుపు రాసి పూలతో అలంకరిస్తారు. వ్యవసాయ పనిముట్లను పూజలో ఉంచుతారు. ట్రాక్టర్లు రాకముందు వ్యవసాయం చేయడంలో పశువుల ఎలాంటి పాత్ర పోషించేవో పిల్లలకు వివరించండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని