Published : 17/05/2022 02:33 IST

పిల్లల గది అందుకు మినహాయింపు...

మనమంతా తీరిక, ఓపిక ఉన్నప్పుడు ఇల్లు సర్దుకున్నా కొందరిళ్లలో సర్దిన తీరు చూస్తే భలే ప్రేరణ కలుగుతుంది. కానీ ఎక్కువ సమయం వెచ్చించకుండా ఎలా పొందిగ్గా అమర్చుకోవాలో అంతుపట్టదు. అది తెలుసుకోవాలన్న కుతూహలం ఉండాలే కానీ ఆ కళలో నిష్ణాతుల సలహాలు సిద్ధంగానే ఉన్నాయి. చదివేయండి, మీకెంతో ఉపయోగపడతాయి...

ఎడిటింగ్‌ అనే పదం పుస్తకాలు, సినిమాలకే కాదు ఇంటికీ వర్తిస్తుందండోయ్‌. వస్తువుల మీద భ్రాంతి పెంచుకుని ప్రతిదీ అట్టి పెట్టేస్తున్నారనుకోండి... లేనిపోని సంత పెరిగిపోతుంది. అందుకే ఎప్పటికప్పుడు అవసరం లేవనుకున్న వస్తువులన్నీ తొలగించేస్తుండండి. ఈ ఎడిటింగ్‌తో బోల్డంత అందం వస్తుందంటే అతిశయం కాదు. ఒక శిల్పిని బొమ్మ గొప్పగా చెక్కావని మెచ్చుకుంటే ‘వృథా భాగాన్ని తీసేశానంతే’ అన్నాడట. ఎంత బాగుంది కదూ! మనం చేయాల్సిందీ అదే!

పుస్తకాల షెల్ఫులకు ఒక్కోసారి ఏ పెయింటు వేస్తే బాగుంటుందో అర్థం కాదు. అలాంటప్పుడు తెలుపు ఎంచుకుంటే సరి. సోఫా కవర్లు, కర్టెన్లు ఏ రంగుల్లో ఉన్నా ఇబ్బంది ఉండదు. దేని పక్కనైనా ఇమిడిపోవడమే తెలుపు ప్రత్యేకత.

డిజైనర్‌ సోఫా పేరుతో ఎక్కువ సొమ్ము ఖర్చు పెట్టే బదులు మెత్తటి కుషన్లు ఉన్న మామూలు సోఫా కొని దాని పక్కన సహజత్వాన్ని నింపుకున్న పులి సింహం లాంటి బొమ్మలనో, మొక్కలనో అమర్చండి. ఎంత ముచ్చట గొల్పుతాయో! సోఫాలో చిన్న దిళ్లతో మనకు అంతగా అవసరం ఉండదు. నిజానికవి ఆనుకోవడానికంటే అందాన్నివ్వడంలో ముందుంటాయి. సోఫాలో అడ్డు అనుకోకుండా ఐదారు పిల్లోలు ఉంచండి. వారానికోసారి కవర్లు మార్చేయండి. వాటితో అందం ఇనుమడిస్తుంది.

వంటగదిలో గోడలకు ముదురు రంగు టైల్స్‌ ఉపయోగించడమే ఉత్తమం. ఎంత శుభ్రం చేసినా చమురు చేరుతుంది కనుక మురికి పేరుకుంటుంది. అందువల్ల లేత రంగుల జోలికి వెళ్లొద్దు.

మీకు ఎంత ఇష్టమైన పెయింటింగులు లేదా ఇతర అలంకార సామగ్రిని (డెకొరేటివ్‌ పీస్‌) తగిలించినా ఎక్కువ కాలం పాటు వాటినే ఉంచకండి. ఆరు నెలలకోసారి వాటిని మార్చడం వల్ల గదులు లేదా హాలు ఎప్పటికప్పుడు కొత్తదనాలు చిందిస్తాయి.

ఇతర గదులన్నీ మీ అభిరుచికి తగ్గట్టుగా తీర్చిదిద్దుకున్నా పిల్లల గది అందుకు మినహాయింపు. దాన్ని వాళ్ల ఇష్టానికి తగినట్టుగా అమర్చండి. మరీ చిన్న పిల్లలయితే ముదురు రంగులు, భిన్నమైన డిజైన్లు ఇష్టపడతారు. మీకు గాడీగా అనిపించినా సరే, అవే వాళ్లకు నదరుగా అనిపిస్తాయి. కాస్త పెద్దవాళ్లయితే తమకు ఇష్టమైన నటులు, క్రికెటర్లు, గాయకుల పోస్టర్లు అంటించుకున్నా అభ్యంతరం చెప్పకండి. పెద్దయ్యే కొద్దీ ఇష్టాయిష్టాలు మారిపోతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని