కోపిష్టి భాగస్వామితో ఇలా మెలగండి...

పెళ్లి మీద వచ్చినన్ని జోకులు మరే ఇతర అంశం మీదా వచ్చి ఉండవు. ఎంత నవ్వుకున్నా, ఎన్ని వ్యంగ్యాస్త్రాలు విసురుకున్నా పెళ్లి జీవితంలో ముఖ్యమైందనే సంగతి మనందరికీ తెలుసు. బంధుమిత్రులెందరున్నా భార్య లేదా భర్త స్థానాన్ని మాత్రం ఎవరూ భర్తీ చేయలేరు.

Updated : 29 May 2022 06:27 IST

పెళ్లి మీద వచ్చినన్ని జోకులు మరే ఇతర అంశం మీదా వచ్చి ఉండవు. ఎంత నవ్వుకున్నా, ఎన్ని వ్యంగ్యాస్త్రాలు విసురుకున్నా పెళ్లి జీవితంలో ముఖ్యమైందనే సంగతి మనందరికీ తెలుసు. బంధుమిత్రులెందరున్నా భార్య లేదా భర్త స్థానాన్ని మాత్రం ఎవరూ భర్తీ చేయలేరు. జీవన పర్యంతం తోడునీడగా ఉండాల్సిన భార్యాభర్తలో ఏవైనా లోపాలున్నా పరస్పరం సర్దుకుపోవాలి అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్లు...

కోపం ఒక బలహీనత. అది అనర్థాలకు దారి తీసే మాట నిజం. కానీ ఆ కారణంతో భాగస్వామిలో ఉన్న ఇతర సుగుణాలన్నిటినీ మర్చిపోయి మీరూ ఆగ్రహం చూపితే కలహాల కాపురంగా మారి ఇంట్లో మనశ్శాంతి కరువౌతుంది. కనుక తనకు కోపం వచ్చినప్పుడు మీరు శాంతంగా ఉండండి. ఆవేశం తగ్గాక మీరెంత బాధపడిందీ చెప్పండి.

* కోపం మితిమీరి పరుషంగా, మీ గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడితే మౌనంతో తిప్పికొట్టండి. ప్రతిస్పందించకపోవడాన్ని మించిన జవాబు లేదు. తప్పక పశ్చాత్తాపం కలుగుతుంది.
* చీటికి మాటికి ఏదో ఒక నెపంతో అరుస్తోంటే అసలు కారణమేంటో ఆలోచించండి. పని ఒత్తిడా, ఆఫీసులో టెన్షనా, ఆర్థిక ఇబ్బందా, అనారోగ్యమా, మరేదన్నా ఇతర కారణమా అనేది తెలుసుకోండి. మీకు చేతనైతే అందులోంచి ఎలా బయటపడొచ్చో సూచించండి. లేదా ఇద్దరూ కలిసి ఆయా అంశాల గురించి చర్చించండి. లేదంటే ఆత్మీయుల సహకారం తీసుకోండి. అప్పటికీ పరిష్కారం కాకపోతే ప్రతి రంగంలోనూ సహాయం చేసేందుకు కొందరు నిపుణులుంటారు కదా.. వాళ్ల సలహా తీసుకోండి.
* రోజులో కనీసం అరగంటయినా ధ్యానం చేయండి. భాగస్వామితోనూ చేయించండి. కోపావేశాలు తగ్గడమే కాదు, ఏకాగ్రత, సామర్థ్యాలు పెరుగుతాయి.
* కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఇద్దరూ కలిసి ఆలోచించి, నిర్ణయాలు తీసుకోండి. ఎదురయ్యే సమస్యలేంటో, నివారణా పద్ధతులేంటో ఇద్దరికీ తెలుస్తాయి కనుక ఒక్కరికే భారమై ఉద్రేకపడే పరిస్థితి రాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్