పిల్లల్లో ధ్యాస తగ్గుతోందా...

పిల్లలు చదువుల్లో మరో అడుగు ముందుకేసే సమయమిది. సెలవుల తర్వాత కొత్త పాఠాలు మొదలవుతాయి. చదువు మీద ధ్యాస తక్కువగా ఉన్నట్లు గుర్తిస్తే మాత్రం దాన్ని పెంచడానికి ఇదే సరైన సమయం అంటున్నారు నిపుణులు.

Published : 04 May 2023 00:13 IST

పిల్లలు చదువుల్లో మరో అడుగు ముందుకేసే సమయమిది. సెలవుల తర్వాత కొత్త పాఠాలు మొదలవుతాయి. చదువు మీద ధ్యాస తక్కువగా ఉన్నట్లు గుర్తిస్తే మాత్రం దాన్ని పెంచడానికి ఇదే సరైన సమయం అంటున్నారు నిపుణులు.

* సెలవుల్లో చదువుతో పనిలేకుండా పూర్తిగా ఆటలపైనే పిల్లలు ధ్యాస పెడతారు. ఆ ఆటలతోనే వారిలో ధ్యాస, ఏకాగ్రత పెంచడానికి ప్రయత్నించాలి. శారీరకంగా వారు అలసిపోయేలా ఆడటానికి మైదానం, పార్కుకు తీసుకెళ్లాలి. మెదడుకు కావాల్సిన ఆక్సిజన్‌ అంది, నరాల వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఒత్తిడిని కలిగించే కార్టిసోల్‌ హార్మోన్‌ ఉత్పత్తిని ఇది తగ్గిస్తుంది. ఏకాగ్రత, గ్రహణ శక్తి పెరుగుతాయి.

* భవన నిర్మాణం, రకరకాల జంతువులు, వస్తువులను ఫిక్స్‌ చేసే బుర్రకు పదును పెట్టే సెట్స్‌ అందించాలి. వీటితో మెదడు చురుకుగా ఆలోచించడం మొదలుపెడుతుంది. దృష్టి కేంద్రీకరించి మరీ పట్టుదలగా ఆడటంతో ఏకాగ్రతతోపాటు వేగంగా ఆలోచించే నైపుణ్యాలు పెరుగుతాయి.  

* పిల్లల మనసులో మనకు తెలియని ఊహాలోకం ఉంటుంది. ఇల్లు, పక్షులు, ప్రకృతి వంటివాటి గురించి రకరకాల ఆలోచనలుంటాయి. వాటన్నింటినీ కాగితంపై పెట్టేలా ప్రోత్సహించాలి. ఆ బొమ్మలకు రంగులేయడం నుంచి ఫ్రేంలా తయారుచేయడం వరకు నేర్పించాలి. వాటిని వారి గదిగోడలకు అలంకరించాలి. వారి సృజనాత్మకతను ప్రశంసించాలి. దీంతో చిన్నారుల మనసు సంతోషంతో నిండుతుంది. మనసును కాగితంపై పరచినట్లుగా ఫీల్‌ అవుతారు. ప్రతి చిన్న విషయానికీ స్పందించి, దాన్ని బొమ్మలుగా తీర్చిదిద్దుతారు. ఇవన్నీ వారిలో ఆందోళన, ఒత్తిడిని దూరం చేస్తాయి. దీంతో ఏ కొత్త విషయం చెప్పినా త్వరగా గ్రహించ గలుగుతారు. ఏకాగ్రత కూడా పెంపొందుతుంది.

* పోషకవిలువలున్న ఆహారమని చెబితే పిల్లలకు అర్థం కాకపోవచ్చు. వారికి కావాల్సిన పోషకాహారాన్ని పెద్దవాళ్లే ఎంపిక చేయాలి. అయితే అది వారికి నచ్చేలా అందించగలగాలి. మంచినీళ్లు మాత్రమే కాకుండా పండ్లరసాలు వంటి ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకొనేలా ప్రోత్సహిస్తే చాలు. వీటితో శారీరక సామర్థ్యంతో పాటు మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్