అతి చేస్తే అంతే!

పిల్లలు ఎదిగే కొద్దీ స్వేచ్ఛ కోరుకుంటారు. ప్రతి నిర్ణయాన్నీ సొంతంగా తీసుకోవాలనుకుంటారు. తల్లిదండ్రులకేమో తమ పిల్లలు దారితప్పే వయసు ఇదేనని వారిని అదుపులో పెట్టాలనుకుంటారు. ఈ తీరే ఇద్దరి మధ్య సంఘర్షణకు కారణమవుతుంది. అమ్మగా ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత మీదే.

Published : 05 Jun 2023 00:09 IST

పిల్లలు ఎదిగే కొద్దీ స్వేచ్ఛ కోరుకుంటారు. ప్రతి నిర్ణయాన్నీ సొంతంగా తీసుకోవాలనుకుంటారు. తల్లిదండ్రులకేమో తమ పిల్లలు దారితప్పే వయసు ఇదేనని వారిని అదుపులో పెట్టాలనుకుంటారు. ఈ తీరే ఇద్దరి మధ్య సంఘర్షణకు కారణమవుతుంది. అమ్మగా ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత మీదే.

* పరిగణనలోకి తీసుకోండి... ఎంత వయసు వచ్చినా సరే...తల్లిదండ్రులకు తమ పిల్లలు చిన్నగానే కనిపిస్తారు. అలాగని వారి వయసుని గుర్తించకపోతే ఎలా? వారికేం కావాలో వారు చెప్పగలరు. ముఖ్యంగా టీనేజీకి వచ్చేసరికి... తమ ఆలోచనలకూ, పనులకూ గుర్తింపు కావాలని కోరుకోవడం సహజం. అందుకే, ఈ వయసులో ఉన్న వారి ఆలోచనల్నీ, అభిప్రాయాల్నీ పరిగణనలోకి తీసుకోండి. అయితే, పొరపాట్లు చేసినా, తప్పుదోవలోకి వెళ్తున్నా...అప్పుడు మాత్రం మీరు మార్గనిర్దేశనం చేస్తే సరి.

* స్వేచ్ఛ ఇవ్వాలి... ఎదిగే పిల్లలకు స్వేచ్ఛ ఇస్తే వారెక్కడ దారితప్పుతారేమో అనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు. దాంతో అనుక్షణం కాపలా కాయడం, వారి ఆనుపోనుల్ని గమనించడం, ప్రతిదాన్నీ అనుమానించడం వంటివి చేస్తుంటారు. ఈ తీరు... పిల్లల్ని ఆందోళనకు గురి చేస్తుంది. దీంతో చేసే ప్రతిపనినీ పెద్దలకు తెలియకుండా చేయాలనే నిర్ణయానికి వచ్చేస్తారు. ఎదిగిన మీ అమ్మాయితో స్నేహం...వారి మనసుని తెలుసుకునేలా చేస్తుంది. మీరిచ్చే స్వేచ్ఛ...మీతో ప్రతి విషయాన్నీ పంచుకునే స్థైర్యాన్నిస్తుంది.

* దారి చూపండి... ఎదిగే పిల్లలకు జాగ్రత్తలు చెప్పడం మంచిదే. అలాగని ప్రతిసారీ మీ కష్టాలనూ, బాధలనూ ఏకరువు పెట్టడం, అతి జాగ్రత్తలు చెప్పడం వల్ల వారు తామేదో కోల్పోయిన భావనలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అలానే, వారికోసం అతిగా ఖర్చుపెట్టడం, కోరిందల్లా ఇవ్వడం వంటివీ సరికాదు. సామాజిక పరిస్థితులూ, కుటుంబ స్థితిగతులూ చెబుతూనే...జీవితంలో ఎదురయ్యే కష్టానష్టాలను ఎలా అధిగమించొచ్చో వారికి దారి చూపించాలి. ప్రతిపనీ సొంతంగా చేసుకునే శక్తిని ఇవ్వాలి. అప్పుడు ఏ పని చేసినా...తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా ఉంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని