అమేజింగ్‌ పిల్ల... ఔదార్యం

ఆమె కుటుంబమంతా కొవిడ్‌ పాలైంది. అప్పుడే దాని బాధితుల ఇబ్బందులు ఆమెకు అర్థమయ్యాయి. వారికి తనూ సాయమందించాలనుకుంది. వృద్ధులు, కరోనా బాధితులకు పోషకాహారాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

Updated : 29 Jun 2021 06:03 IST

ఆమె కుటుంబమంతా కొవిడ్‌ పాలైంది. అప్పుడే దాని బాధితుల ఇబ్బందులు ఆమెకు అర్థమయ్యాయి. వారికి తనూ సాయమందించాలనుకుంది. వృద్ధులు, కరోనా బాధితులకు పోషకాహారాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఆమే విశాఖపట్నానికి చెందిన రేగుళ్ల అనూష. ఆమె సేవా ప్రయాణాన్ని చూద్దామా!

నూషది విశాఖపట్నంలోని కృష్ణరాయ పురం. దూరవిద్యలో యానిమేషన్‌, వీఎఫ్‌ఎక్స్‌ కోర్సులు చదువుతూనే రేడియో జాకీగా చేసింది. వివిధ అంశాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ‘అమేజింగ్‌ పిల్ల’ పేరిట ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించింది. ఆ పేరుతోనే తనూ గుర్తింపూ పొందింది. ‘మిసెస్‌ ఇండియా- 2020’ జాతీయ స్థాయి పోటీలో ఏపీ నుంచి మొదటి రన్నరప్‌గా నిలిచి, శ్రీమతి స్టైలిష్‌ అవార్డును సాధించింది. ‘వర్ణం ఈవెంట్స్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ పేరుతో సొంత సంస్థను స్థాపించింది. కొవిడ్‌ ఉద్ధృతిలో వ్యాపార కార్యకలాపాలు తగ్గాయి. అదే సమయంలో తన కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. అప్పుడే కొవిడ్‌ బాధితుల సమస్యలు ఆమె దృష్టికి వచ్చాయి. వారికి ఉచితంగా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలనుకుంది. భర్త రాంకిరణ్‌ ఆమె ఆలోచనను ప్రశంసించడమే కాకుండా ఆర్థికంగా అండగా నిలిచారు. వారిద్దరూ కలసి రోజూ భోజనాలు సిద్ధం చేసి ఉచితంగా పంపిణీ చేయడం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమాన్ని రెండు నెలలుగా కొనసాగిస్తూనే ఉన్నారు. రోజూ ఒక ఆకుకూర, ఒక పండు, ఉడకబెట్టిన కోడిగుడ్డు, ఒక కూర, వారానికి రెండుసార్లు మాంసం అందిస్తోంది. ఈమె చేస్తున్న పని నచ్చి కొందరు స్నేహితులు, తెలిసిన వారూ కూడా అండగా నిలిచారు. ఆహారాన్ని పంపిణీ చేయడానికి ఒక వలంటీరు, ఇద్దరు వ్యక్తులను నియమించుకుంది. వారే నగరంలోని పలు ప్రాంతాలకు తిరిగి ఆహార ప్యాకెట్లను అందిస్తారు. కొందరు మిత్రులు సరుకులు కొని ఇస్తున్నారు. వంటలను తనే దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. ఇప్పటివరకూ పదివేల మందికి ఆహారాన్ని అందించింది. అనూషకు సేవా కార్యక్రమాలంటే మొదట్నుంచీ ఆసక్తి ఎక్కువే. ఆరేళ్లుగా పింక్‌థాన్‌ అంబాసిడర్‌గా కొనసాగుతోంది. అందులో భాగంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తండ్రి ఆర్‌.నారాయణరావు బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఇంజినీర్‌. ఆయన కొందరు పిల్లలకు ఇంట్లోనే వసతి కల్పించి మరీ చదువు చెప్పించే వారు. తల్లి సావిత్రీరావు కూడా సేవా కార్యక్రమాలకు అండగా నిలిచే వారు. వారి స్ఫూర్తితో అనూష కూడా సేవా కార్యక్రమాలపై ఆసక్తిని పెంచుకుంది. పిల్లలకు చదువు చెప్పడం, సెక్యూరిటీ గార్డులకు భావవ్యక్తీకరణ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తోంది. రోజూ కొంత సేపు సేవా కార్యక్రమాలకు కేటాయిస్తుంది.

‘కొవిడ్‌ బాధితులకు కోలుకునే వరకు గరిష్ఠంగా 21 రోజులు ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నాం. మా గురించి తెలుసుకుని ‘కొవిడ్‌ మీల్స్‌ ఇండియా’ వాళ్లు విశాఖలో మా సంస్థ పేరును వారి వెబ్‌సైట్లో పొందుపరచారు’ అంటోంది అనూష.

- బీఎస్‌ రామకృష్ణ, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్