యోధులకు రక్షణ.. కళాకారులకు ఉపాధి...

కరోనా ఎందరివో ఉద్యోగాలు లాగేసుకుంది. కానీ దాన్ని మట్టుపెట్టే క్రమంలో కొన్ని అత్యవసర కొలువులు పుట్టుకొచ్చాయి. అలాంటిదే పీపీఈ కిట్ల తయారీ. ‘దీంతో కొవిడ్‌ యోధులకు రక్షణ కల్పించవచ్చు, కళాకారులకు ఉపాధి కూడా దొరుకుతుంది’

Published : 13 Jul 2021 02:14 IST

కరోనా ఎందరివో ఉద్యోగాలు లాగేసుకుంది. కానీ దాన్ని మట్టుపెట్టే క్రమంలో కొన్ని అత్యవసర కొలువులు పుట్టుకొచ్చాయి. అలాంటిదే పీపీఈ కిట్ల తయారీ. ‘దీంతో కొవిడ్‌ యోధులకు రక్షణ కల్పించవచ్చు, కళాకారులకు ఉపాధి కూడా దొరుకుతుంది’ అనుకున్నారు ‘క్రాఫ్ట్‌ విలేజ్‌’ వ్యవస్థాపకులు ఇతీత్యాగి, ఆమె భర్త.

ఇంతకీ ‘క్రాఫ్ట్‌ విలేజ్‌’ ఉద్దేశమేంటంటే హస్త కళాకారులకు ఉద్యోగావకాశం కల్పించడం. బ్రాండ్‌ ఈక్విటీ ఫౌండేషన్‌ గణాంకాలను బట్టి చూస్తే దేశంలో దాదాపు డెబ్భై లక్షలమంది హస్తకళాకారులున్నారు. కానీ వాళ్లలో చాలామందికి చేద్దామంటే పని దొరక్క వలస కూలీల్లా మారుతున్నారు. దీన్ని కొంతయినా తగ్గించడానికి గ్రామాల్లో ఉన్న ఆయా రంగాల కళాకారులకు, పట్టణాల్లో వినియోగదారులకు మధ్య వారధిగా నిలిచింది. అంటే దళారుల ప్రమేయం లేకుండా తిన్నగా వీరివద్దే కొనే వెసులుబాటు కల్పిస్తుందన్నమాట. అన్ని రంగాల్లాగే కరోనా చేతికళలనూ దెబ్బతీసింది. ముందే అరకొరగా ఉన్న ఉపాది ఫమార్గాలకు గండికొట్టింది. వారిలో కొందరికైనా పని కల్పించాలనుకుంది ఇతిత్యాగి.

ఇతికి డిజైనర్‌గా మంచి పేరుంది. గ్లాసు, చెక్క, లోహం తేడా లేకుండా దేని మీదైనా డిజైన్లు వేస్తుంది. ఎంబ్రాయిడరీ వర్క్‌ చేస్తుంది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, పారిశ్రామిక అభివృద్ధి సంస్థల్లో పనిచేసింది. హస్త కళాకారులకు చేయూతనందించి ‘నారీశక్తి పురస్కారం’ అందుకుంది. భర్త సోమేష్‌ సింగ్‌ మిలటరీ, పోలీసు యూనిఫాంల వస్త్ర సంస్థకు డైరెక్టర్‌. తమ అనుభవం పీపీఈ కిట్లు రూపొందించడంలో పనికొస్తుందనుకున్నారు. పత్రికలు, ఛానళ్లలో డాక్టర్లు, పోలీసులు తదితర ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, సరైన భద్రతా పరికరాలు లేక ఇబ్బంది పడుతున్నారు, కొందరు ప్రాణాలూ కోల్పోతున్నారనే వార్తలు చదివినపుడు ఈ ఆలోచన వచ్చింది. గట్టి భద్రత కల్పించే మేలిమి పీపీఈ (పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌) కిట్స్‌ను రూపొందిస్తే సమస్య పరిష్కారమవుతుంది అనుకున్నారు. ఇక వాటి గురించి వీలైనంత అధ్యయనం చేశారు. అవి గాలి చొరబడని విధంగా ఉండాలి. లేదా కలుషిత గాలిని నిరోధించేలా ఉండాలి. వాటర్‌ప్రూఫ్‌ అయ్యుండాలి. మార్కెట్లో చాలా రకాల కిట్స్‌ ఉన్నా ఎక్కువ శాతం సింథటిక్‌వే. అవి వేసుకుంటే ఊపిరాడక ఎప్పుడెప్పుడు తీసేద్దామా అనిపిస్తుంది. కనుక వైరస్‌ నుంచి కాపాడటంతోబాటు సదుపాయంగానూ ఉండాలనుకున్నారు. అందుకు సగం సిమెంట్‌ ఫాబ్రిక్‌ సరైంది అనిపించింది. ఇది పర్యావరణ హితం కూడా. అన్ని కోణాల్లోనూ ఆలోచించి సౌకర్యం, సుస్థిరం అనిపించే కవరాల్‌-21 కిట్స్‌ రూపొందించారు. ఇవి వేసుకోడానికి అనువుగా ఉండి వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవడమే కాదు అత్యాధునికం కూడా. చుట్టూ నెలకొన్న స్థితిలో ఒత్తిడి సహజం. దాన్ని తగ్గించేలా పరిమళభరితంగానూ చేశారు. ఈ సువాసనలు 50 ఉతుకుల వరకూ ఉంటాయి. చొక్కా జేబులో ఉన్న మొబైల్‌ తీయడం, శానిటైజ్‌ చేయడం లాంటివి అక్కర్లేకుండా డిటాచబుల్‌ మైకులు అమర్చారు. ఈ మొత్తం ప్రణాళికలో కీలక పాత్ర పోషించిన ఇతీ త్యాగి ‘స్త్రీలు ముడుచుకుపోయే గుణాన్ని, మూసతత్వాన్ని వదలగలిగితే ఎంతో సాధించవచ్చు’ అంటుంది. నిజమే కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్