Updated : 21/08/2021 18:13 IST

సినిమాలో ఒక్క పాట పాడితే చాలనుకున్నా!

పాట తనకు ప్రాణం... దాని కోసం చిన్నప్పటి నుంచీ సాధన చేసింది. సినిమాల్లో తన గొంతు వినిపించాలని తపించింది. అలుపెరగక ప్రయత్నించింది. ఇవి చేస్తూనే ఉన్నత విద్యార్హతలూ సంపాదించుకుంది... బాహుబలి నుంచి వకీల్‌సాబ్‌ వరకు... తన పాటలన్నీ హిట్లే. తాజాగా ‘బుల్లెట్‌బండి’ అంటూ ఆటతోనూ కట్టి పడేసింది. తనే ‘మోహనా భోగరాజు’. తన పాటల ప్రయాణాన్ని వసుంధరతో పంచుకుంది...

ప్రతి ఒక్కరికీ కలలు ఉంటాయి. అవి  నెరవేర్చుకోవాలంటే... మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. నాకీ గుర్తింపు, అవకాశాల కోసం ఎంతో సాధన చేశా. లెక్కకు మించి ఆడిషన్లకు వెళ్లా. టీవీల్లో పాటల పోటీల్లో ప్రయత్నించా. చాలా సార్లు సెలక్షన్స్‌లోనే ఫెయిల్‌ అయ్యా. అయినా నిరాశపడ లేదు. ప్రతిసారీ... ‘గెలవడానికి మరో అడుగు ముందుకు వేసినట్లే, ఇంకోసారి ప్రయత్నిద్దాం’ అని అమ్మానాన్నా ప్రోత్సహించేవారు. ఇవే నన్ను గాయనిగా నిలబెట్టాయి.
నేను పుట్టింది అమ్మమ్మ వాళ్లూరు, ఏలూరులో. పెరిగింది హైదరాబాద్‌లో. బీటెక్‌, తర్వాత ఎంబీఏ చేయాలనుకునేదాన్ని. నేపథ్య గాయనిగానూ ఎదగాలనుకున్నా. రెండు పడవల మీద కాలేసినా దేన్నీ నిర్లక్ష్యం చేయలేదు. కాకపోతే ఒకటి కాస్త ఆలస్యమయ్యింది. గాయనిగా గుర్తింపు పొందాకే ఎంబీఏ చేశా.

నాకు పాటలు పరిచయం అయింది అమ్మ వల్లే. నా చిన్నప్పుడు తను సంగీతం తరగతులకు వెళ్లేది. ఇంటికి వచ్చాక సాధన చేస్తోంటే నేనూ కూనిరాగాలు తీసేదాన్ని. అప్పటికి సెయింట్‌మేరీస్‌ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నా. ఓ రోజు అమ్మ స్నేహితురాలు నా గొంతు విని... ఓ పాటల పోటీ గురించి చెప్పారు. అదే మొదటిసారి బయట పాడటం. అక్కడ సబ్‌ జూనియర్స్‌లో మొదటి బహుమతి అందుకున్నా. ఎప్పటికీ నాకదే అపురూపమైన బహుమతి. అప్పటి నుంచీ సంగీత పోటీలకు వెళ్లేదాన్ని. అమ్మమ్మ ఎవరు కనిపించినా, ఏ ఫంక్షన్‌లో ఉన్నా... మా మనవరాలు బాగా పాడుతుంది అని పాడించేది. విన్న వారి ప్రశంసలు సంగీతంపై నా ఆసక్తిని ఇంకా పెంచాయి. దాంతో నాకు శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టారు. ఐదోతరగతిలో ఉన్నప్పుడు వార్షికోత్సవంలో వేదికపై పాడా. అప్పటి నుంచి టీచర్లు, స్నేహితులు ప్రత్యేకంగా చూసేవారు. అయితే ఈ భావన ఎప్పటికీ ఉండి పోవాలంటే... సినిమాల్లో పాడాలనేది నా మనసులో నాటుకుపోయింది. ఒక్క సినిమాలోనైనా అవకాశాన్ని సాధించాలని కలలు కన్నా.

ఉద్యోగమూ చేశా!

ఓసారి సంగీత దర్శకులు బాలాజీ నా గొంతు విన్నారు. ఆయన సంగీత దర్శకత్వం వహించిన ‘జైశ్రీరామ్‌’లో ‘సయ్యామమాసం’ అనే పాటను నాతో పాడించారు. తర్వాత... కోరస్‌, ట్రాక్‌లు, రీరికార్డింగ్స్‌ చేసేదాన్ని. కొన్నాళ్లు... ఉద్యోగమా? గాయనిగా కొనసాగుదామా అని ఆలోచించా. మధ్యలో సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో శిక్షణా తీసుకున్నా. కొన్ని నెలలు ఉద్యోగమూ చేశా. అవేవీ సంతృప్తిని ఇవ్వలేదు. ఇక నా మనసుకు నచ్చిన రంగమే నా కెరీర్‌ అని నిర్ణయించుకున్నా. ఓ పాటను రికార్డ్‌ చేసి క్యాసెట్‌ని రమ్య బెహరా సాయంతో కీరవాణి గారికి పంపా. ఆయనకు నచ్చి బాహుబలిలో అవకాశం ఇచ్చారు. అదే ‘మనోహరి’ పాట. అంత పెద్ద సినిమాలో అవకాశాన్ని నేనెప్పుడూ ఊహించలేదు. దాంతోనే మోహన గురించి ప్రపంచానికి తెలిసింది. తర్వాత.... ‘భలే భలే మగాడివోయ్‌’ టైటిల్‌ సాంగ్‌, ‘బాహుబలి-2’లోని ‘ఓరోరి రాజా’ (తమిళ వెర్షన్‌), అరవింద సమేతలో రెడ్డెమ్మతల్లి, సైజ్‌ జీరో, అఖిల్‌, సోగ్గాడే చిన్నినాయనా, ఇజం, శతమానం భవతి, జవాన్‌, భాగమతి, సవ్యసాచి, బ్లఫ్‌మాస్టర్‌, ఎన్టీఆర్‌ బయోపిక్‌, ఓ బేబీ, వెంకీమామ, టక్‌ జగదీశ్‌, వకీల్‌సాబ్‌లో ‘మగువా మగువా’ పాడాను. ఇప్పటివరకూ తెలుగు, తమిళం, కన్నడల్లో వందకుపైగా పాటలు పాడగలిగాను. కోట్ల మంది అభిమానాన్ని పొందే అవకాశాలనిచ్చి ప్రోత్సహిస్తున్న సంగీత దర్శకులందరికీ రుణపడి ఉంటాను.

ఇక ఇటీవల నేను సొంతంగా విడుదల చేసిన ప్రైవేట్‌ సింగిల్‌ ‘బుల్లెట్‌ బండి’కి మంచి ఆదరణ లభించింది. డ్యాన్స్‌ చేయడం ఇదే మొదటిసారి కూడా. యూట్యూబ్‌లో మూడున్నర నెలల్లో 85 లక్షల మందికిపైగా దాన్ని చూశారు. అక్కడా, ఇన్‌స్టాలో వేలల్లో వస్తోన్న మెసేజీలకు స్పందించలేకపోతున్నా. నా ఇష్టాలకు విలువనిస్తూ... అమ్మా, నాన్న, మా వారు ప్రోత్సహించడం వల్లే ఈ స్థాయిలో ఉన్నా. మరిన్ని మంచి పాటల్ని పాడాలన్నది నా ఆకాంక్ష.


పంజాబీ కుడీ...

పంజాబీలోనూ ‘సోనే... సోనే’ పేరుతో అంతకు ముందే ఓ సింగిల్‌ చేశా. చాలామంది అడుగుతారు... పంజాబీలో ఎందుకని. నిజానికి నాకు పంజాబీతో సంబంధం ఏమీ లేదు. చిన్నప్పటి నుంచీ రకరకాల పాటలు వినేదాన్ని. అలానే పంజాబీ పాటలూ వినేదాన్ని. అవెందుకో బాగా నచ్చేశాయి. కొన్నాళ్లు డ్రెస్సులూ ఆ స్టైల్‌వే! ఆహారమూ అక్కడిదే!! అందుకే విభిన్నంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు పంజాబీలో పాడాలనే ఆలోచన వచ్చింది. దీన్ని బ్యాంకాక్‌లో చిత్రీకరించాం. దీనికీ లక్షల్లో వ్యూస్‌ వచ్చాయి.
Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని