బుజ్జాయి బ్యాగులతో.. కోటి వ్యాపారం!

ప్రసవించి రెండు నెలలు కాలేదు. బేకరీలో పని చేయాల్సి వచ్చిందామెకు. చంటి బిడ్డను ఎత్తుకుని పని చేయాల్సిన ఆ సమయంలో ఆమెకొచ్చిన ఆలోచన ‘కోల్‌కోల్‌ బేబీ క్యారియర్‌’. ఇది ఎంత విజయం సాధించిందంటే ఇప్పుడు తన వ్యాపారం ఏటా కోటి రూపాయలు దాటింది. ఈ అసాధారణ విజేత గోవాకు చెందిన 38 ఏళ్ల భైరవి మణి మాంగోన్కర్‌. తన విజయగాథను చూడండి.

Updated : 09 Sep 2022 12:59 IST

ప్రసవించి రెండు నెలలు కాలేదు. బేకరీలో పని చేయాల్సి వచ్చిందామెకు. చంటి బిడ్డను ఎత్తుకుని పని చేయాల్సిన ఆ సమయంలో ఆమెకొచ్చిన ఆలోచన ‘కోల్‌కోల్‌ బేబీ క్యారియర్‌’. ఇది ఎంత విజయం సాధించిందంటే ఇప్పుడు తన వ్యాపారం ఏటా కోటి రూపాయలు దాటింది. ఈ అసాధారణ విజేత గోవాకు చెందిన 38 ఏళ్ల భైరవి మణి మాంగోన్కర్‌. తన విజయగాథను చూడండి.

భైరవి వాళ్ల నాన్న వ్యాపారవేత్త కావడంతో తనూ సొంతంగా ఏదైనా చేయాలనుకునేది. చదువు అయిన వెంటనే ఈవెంట్‌ మేనేజ్‌మెంటు విభాగంలో చేరింది. చిన్నప్పటి కలను నెరవేర్చుకోవడానికి సొంతంగా చిన్న బేకరీని కూడా ప్రారంభించింది. పెళ్లై, ఆమెకు బాబు పుట్టాడు. ప్రసవించిన 45 రోజులకే బేకరీలోకి అడుగుపెట్టింది భైరవి. ఓవైపు ఆ చిన్నారిని ఎత్తుకుంటూనే గంటల తరబడి పనిచేసేది. దుపట్టా లేదా పాతచీరతో పిల్లాడిని వీపుపై ఉండేలా కట్టుకునేది. అవసరం కావడంతో ఎక్కువ ఖరీదైనా కూడా విదేశం నుంచి చంటి పిల్లలను వీపుపై కట్టుకునే క్యారియర్‌ని తెప్పించుకుంది. అయితే అందులో బాబుకి సౌకర్యం లేకపోవడం గుర్తించింది. మరోరకం  వాడి చూసింది. అదీ అంతంత మాత్రంగానే అనిపించింది. అప్పుడు ఆలోచిస్తే...తనలాగే తల్లులందరూ ఇలాగే అసౌకర్యంగా ఉండి ఉంటారనిపించిందామెకు. దాంతో తానే ఓ పరిష్కారం చూపించాలానుకుంది.

ప్రయోగాలతో ...

భైరవి తనకు ఎదురైన సమస్యలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఓ బేబీ క్యారియర్‌ని తయారు చేసింది. దాన్ని తాను వాడటమే కాకుండా తనలాంటి తల్లులకూ ఉచితంగా అందించి, వాడమనేది. వారి అనుభవాల్ని తెలుసుకుని, తన డిజైన్‌లో మార్పులు చేసేది. అలా దాదాపు 100 రకాలకుపైగా రూపొందించి ప్రయోగాత్మకంగా ఉపయోగాన్ని, అసౌకర్యాన్ని పరిశీలించింది. అంతే కాదు, తాను రూపొందించిన డిజైన్‌ను సోషల్‌ మీడియాలోనూ ఉంచి సలహాలను, సూచనలను తీసుకుంది. లోపాలను సరిచేసుకునేది. అలా ఓ వినూత్న పరిష్కారం కనిపెట్టింది.

ముందుగా

ఏ డిజైన్‌ చేసినా ముందుగా తానే వాడేదాన్ననని చెబుతుంది భైరవి. ‘అప్పుడే కదా బిడ్డనెత్తుకునే తల్లికి ఎక్కడెక్కడ అసౌకర్యంగా ఉందో తెలుస్తుంది. అలాగే చిన్నారి ఇబ్బందిని కూడా గుర్తించొచ్చు. నాలాంటి మరికొందరు తల్లుల అభిప్రాయాలు నాకెంతో ఉపయోగపడేవి. 2014లో ‘కోల్‌కోల్‌ బేబీ క్యారియర్‌’ను రూ.50వేలు పెట్టుబడితో ప్రారంభించా. అప్పటికే దీని గురించి తెలిసిన వారి నుంచి ఆర్డర్లు వచ్చేవి. ఆ నోటా ఈ నోటా ప్రచారమై...మా ఉత్పత్తికి ఆదరణ లభించింది. తొలుత ఒక టైలర్‌తో పనిచేసే నేను, ఇప్పుడు పదిహేను మందికి పని కల్పిస్తున్నా. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూనే ఉంటా. ఒక క్యారియర్‌ చేయడానికి నాలుగు రోజులు పడుతుంది. ఇప్పుడు మావద్ద రెండు రకాల బేబీ క్యారియర్లు తయారవుతున్నాయి. ప్రస్తుతం నెలకు 600 ఆర్డర్లు తీసుకునే స్థాయికి మా సంస్థ ఎదిగింది. మొదట్లో దక్షిణాది ప్రాంతాల నుంచి మాత్రమే ఆర్డర్లు వచ్చేవి. క్రమంగా దేశం, ఆపై విదేశాలకు వీటిని సరఫరా చేస్తున్నాం. అంటే మా ప్రొడక్టు ప్రతి తల్లికీ దగ్గరవుతోందన్నమాట. నా అవసరానికి వచ్చిన ఆలోచన మరెందరో తల్లులకు ఉపయోగపడటమే కాకుండా, ఓ వ్యాపారవేత్తగా నా కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది’ అని అంటుంది భైరవి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్