ప్రపంచవ్యాప్తంగా 40 మందిలో ఒకరిగా నిలిచి...

క్రీడలపై ఆసక్తిని ఆమె కెరియర్‌గా మార్చుకుంది. మీడియా రంగంలో అడుగుపెట్టి, క్రీడా పాత్రికేయురాలిగా పనిచేసింది. అక్కడ తను కనబరిచిన ప్రతిభ ఆమెను ‘క్రికెట్‌ ఫ్యూచర్‌ రీడర్స్‌’ ప్రోగ్రాంకు ఎంపికయ్యేలా చేసింది.

Updated : 10 Sep 2021 01:37 IST

క్రీడలపై ఆసక్తిని ఆమె కెరియర్‌గా మార్చుకుంది. మీడియా రంగంలో అడుగుపెట్టి, క్రీడా పాత్రికేయురాలిగా పనిచేసింది. అక్కడ తను కనబరిచిన ప్రతిభ ఆమెను ‘క్రికెట్‌ ఫ్యూచర్‌ రీడర్స్‌’ ప్రోగ్రాంకు ఎంపికయ్యేలా చేసింది. 45 దేశాల నుంచి 40 మంది మహిళలు ఎంపికైతే... మనదేశం నుంచి ఆ అర్హతను సాధించిన ఏకైక మహిళగా హరిణి రాణా నిలిచింది.

పాత్రికేయురాలిగా ఉద్యోగంలో చేరిన రాణా, మూడు పదుల వయసు నిండకుండానే తన కృషితో దేశంలోనే ప్రముఖ టీవీ ఛానెల్‌ల్లో మహిళా స్పోర్ట్స్‌ ఎడిటర్‌ అయ్యింది. విధుల్లో భాగంగా 14 దేశాల్లో పర్యటించింది. క్రికెట్‌, బ్యాడ్మింటన్‌ వంటి అంతర్జాతీయ పోటీల వార్తలను రిపోర్ట్‌ చేసింది. అంతర్జాతీయ క్రీడా దిగ్గజాలుగా నిలిచిన ప్రముఖులనెందరినో ఇంటర్వ్యూలు చేసి ఔరా అనిపించుకుంది. ఇప్పుడు తాజా ఎంపికతో దేశంలోనే తొలి మహిళగా నిలిచింది.

అనుకోకుండా...

హరిణి వాళ్లది ముంబయి. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే ఇంగ్లండ్‌లో జరిగిన క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ పోటీలను చూసే అవకాశం అనుకోకుండా రాణాకు దక్కింది. అప్పటి నుంచి క్రీడలపై ఆసక్తిని పెంచుకుంది. చదువు పూర్తయిన తర్వాత 2006లో మనసుకు నచ్చిన కెరియర్‌నే ఎంచుకుంది. క్రీడల రిపోర్టింగ్‌ ప్రారంభించింది. ఈ 15 ఏళ్ల అనుభవంలో ఎదురైనవన్నీ విజయాలే కాదంటుందీమె. ‘వైఫల్యాలు, ఛాలెంజ్‌లు, లింగ వివక్ష వంటివెన్నో ఎదుర్కొన్నా. వీటన్నింటి నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కడానికి ప్రయత్నించా. నేను ఇంటర్వ్యూ చేసిన ప్రతి క్రీడాకారుడి నుంచి స్ఫూర్తిని పొందా. ఆ అనుభవాలన్నీ ఎప్పటికప్పుడు నన్ను ఉత్సాహపరుస్తూనే ఉంటాయి’ అంటుంది రాణా.

సచిన్‌.. ధోనీ నుంచి...

ప్రపంచ కప్‌ క్రికెట్‌, ఒలింపిక్స్‌, కామన్‌వెల్త్‌ వంటి క్రీడల రిపోర్టింగ్‌కి దేశ విదేశాలు పయనించింది రాణా. విలేకరిగానే కాదు, మహిళా ఎడిటర్‌గా, మేనేజిమెంట్ ప్రొఫెషనల్‌గానూ ఎదిగింది. క్రీడారంగంలోనే కాదు, పలు ప్రత్యేక సందర్భాల్లోనూ తనదైన శైలితో రిపోర్టింగ్‌ చేసి ప్రముఖుల ప్రశంసలనూ అందుకుంది. వాటిలో ముంబయిలో తాజ్‌ హోటల్‌పై ఉగ్రవాదుల దాడి. అది జరిగినప్పుడు ఏకబిగిన 40 గంటలు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు వార్తలందించింది. ‘ఎమ్‌ఎస్‌ ధోనీని ఇంటర్వ్యూ చేసినప్పుడు  ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ తొణకని అతడి స్థిర చిత్తాన్ని తెలుసుకున్నా. అలాగే సచిన్‌...  నుంచీ ఎన్నో పాఠాలు నేర్చుకున్నా. సానియామీర్జాలోని పట్టుదల; విరాట్‌కోహ్లీ స్థిరచిత్తం, లియాండర్‌ పేస్‌ పట్టుదల వంటిఎన్నో విషయాలు గ్రహించా. సచిన్‌తో కలిసి టీ తాగడం, అదీ ఆయన రెస్టారెంట్‌లోనే కూర్చుని ఇంటర్వ్యూ చేస్తూ... జీవితంలో మర్చిపోలేని అనుభవం. అతడి బిజినెస్‌ పార్టనర్‌ను కలవడానికి వెళ్లిన నాకు, అనుకోకుండా ఆ రోజు వరంలా దొరికిన సచిన్‌ ఇంటర్వ్యూ... నా కెరియర్‌లో మరవలేనిది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా 45 దేశాల నుంచి ‘క్రికెట్‌ ఫ్యూచర్‌ రీడర్స్‌ ప్రోగ్రాం’కు మహిళలను ఎంపిక చేయడం, అందులో మన దేశం నుంచి నేను అర్హత పొందడం చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. దీన్ని ఓ గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నా. అంతర్జాతీయ వేదికపై మాతృదేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం నాకు దక్కింది. ప్రపంచ క్రికెట్‌లో భవిష్యత్తులో సామర్థ్యం ఉన్న మహిళలను నియమించే దిశగా ఈ ఎంపిక జరిగింది. క్రీడారంగంలో కృషి చేసిన మహిళలకు ఇందులో స్థానాన్ని కల్పించనున్నారు. త్వరలో దీనిపై శిక్షణనూ అందిస్తారు’ అని పరవళ్లు తొక్కే ఉత్సాహంతో చెబుతోంది రాణా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్