పేదింటి బిడ్డలు.. బంగారు కొండలు

అమ్మాయిలకు ఆటలేంటి అన్నా... ఆర్థిక ఇబ్బందులు అడ్డంపడినా... క్రీడల్లో తమ ప్రతిభతో రాణించారు ఈ ఇద్దరూ. వారి ఒలింపిక్స్‌ కలలపై కరోనా మహమ్మారి విరుచుకుపడింది.  దాంతో ఒకరు కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరగా, మరొకరి కన్నతండ్రి ఈ వైరస్‌తోనే కన్నుమూశారు.  ఈ పరిస్థితులతో టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే అవకాశాన్ని కోల్పోయారు. అయినా ఆత్మవిశ్వాసాన్ని వదల్లేదీ యువతులు. తాజాగా హనుమకొండలో జరిగిన 60వ జాతీయ ఓపెన్‌

Updated : 20 Sep 2021 05:46 IST

అమ్మాయిలకు ఆటలేంటి అన్నా... ఆర్థిక ఇబ్బందులు అడ్డంపడినా... క్రీడల్లో తమ ప్రతిభతో రాణించారు ఈ ఇద్దరూ. వారి ఒలింపిక్స్‌ కలలపై కరోనా మహమ్మారి విరుచుకుపడింది.  దాంతో ఒకరు కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరగా, మరొకరి కన్నతండ్రి ఈ వైరస్‌తోనే కన్నుమూశారు.  ఈ పరిస్థితులతో టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే అవకాశాన్ని కోల్పోయారు. అయినా ఆత్మవిశ్వాసాన్ని వదల్లేదీ యువతులు. తాజాగా హనుమకొండలో జరిగిన 60వ జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాలను పండించారు. వారే తమిళనాడుకు చెందిన విత్య, మహారాష్ట్రకు చెందిన సంజీవని బాబురావు జాదవ్‌. వారిని ‘వసుంధర’ పలకరించింది.


21 రోజులు ఆసుపత్రిలో ఉన్నా

టలో గెలుపోటములే కాదు...జీవితంలో ఆటుపోట్లూ తెలిసినదాన్ని. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు నన్ను కట్టిపడేసినా... నా కలను మాత్రం దూరం చేయలేకపోయాయి. తాజా విజయం మరింత స్ఫూర్తినిచ్చింది. మాది తమిళనాడులోని కోయంబత్తూరు. దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్న ఆటోడ్రైవర్‌. అమ్మ గృహిణి. మొదటి కాన్పులోనే కాదు...తర్వాత పుట్టిన కవలలం కూడా ఆడపిల్లలమే. ముగ్గురాడపిల్లల పోషణ కష్టమని...వారికి త్వరగా పెళ్లి చేసేయండని చెప్పేవారు అంతా. కానీ అమ్మానాన్నలు మాత్రం మమ్మల్ని భారంగా భావించలేదు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా...రాత్రింబవళ్లు కష్టపడి మరీ మమ్మల్ని చదివించేవారు. అప్పటికి నేను ఆరోతరగతి చదువుతున్నా. వ్యాయామ ఉపాధ్యాయుడు నేను క్రీడల్లో చురుగ్గా ఉండటం గుర్తించి ప్రోత్సహించారు. ఆయనే ప్రభుత్వ స్పోర్ట్స్‌ స్కూల్లో చేర్పించారు. అక్కడ సుమారు 80 మంది ఆడపిల్లలు ఉండేవారు. బాత్రూం ముందు చాంతాడంత వరుస ఉండేది. అందుకే ఏ మూడింటికో లేచి కాలకృత్యాలు తీర్చుకునేదాన్ని. ఐదు నుంచి ఎనిమిది వరకూ అథ్లెటిక్స్‌లో శిక్షణ, ఆపై బడి, సాయంత్రం సాధన....ఇలా రోజులో ఇరవై గంటలకు పైగా కాలంతో పాటు పరుగెత్తేదాన్ని. ప్రభుత్వం అన్నీ ఉచితంగా అందించినా...అవి సరిపోయేవి కావు. ముఖ్యంగా వారిచ్చే ఒక జత చెప్పులు ఏడాదిపాటు మన్నేవి కావు...నాన్న రూపాయి రూపాయి కూడబెట్టి వాటిని కొనిచ్చేవారు. క్రీడాకోటాలోనే కాలేజీలో సీటు సంపాదించి బీబీఏ పూర్తిచేశా. జాతీయ స్థాయి జూనియర్‌లో 4 మెడల్స్‌, సీనియర్‌ ఫెడరేషన్‌లో 400 హర్డల్స్‌లో బంగారు పతకం సాధించాను. 2020లో టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్‌కు 2019లోనే పాటియాలాలో జరిగిన ఇండియన్‌ క్యాంపునకు వెళ్లా. అప్పుడు కరోనా వల్ల ఒలింపిక్స్‌ వాయిదా పడ్డాయి. ఈసారి కచ్చితంగా వెళతానని కోటి ఆశలు పెట్టుకున్నా, కానీ ఏప్రిల్‌లో కొవిడ్‌ వచ్చి 21 రోజులపాటు ఆసుపత్రిలో చేరా. దాంతో ఒలింపిక్స్‌కు వెళ్లే అవకాశం కోల్పోయా.  కొవిడ్‌ తర్వాత సాధన చేయడం ఎంతో సవాలుగా మారింది. అయినా కూడా కఠోర శ్రమ చేయడంతోనే ఇప్పుడు 400 మీటర్లు, 400 మీటర్ల హర్డల్స్‌, 4్ల400 రిలేలో మూడు బంగారు పతకాలు సాధించగలిగా. వచ్చే ఏడాది కామన్వెల్త్‌ ఆటల్లో కచ్చితంగా పతకం సాధించి తీరుతా.


నాన్న దూరమైనా...

మాది మహారాష్ట్రలోని నాసిక్‌. ఎంఏ సైకాలజీ పూర్తిచేశా. ఎప్పటికైనా ఒలింపిక్స్‌ పతకం సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నా. పతకం తీసుకొస్తానని నాన్న బాబూరావుకి మాట ఇచ్చాను. కానీ నా కల నెరవేరక ముందే ఆయన కరోనాతో కన్నుమూశారు. ఒలింపిక్స్‌కు సరిగ్గా నెల ముందు నాన్నతోపాటు,  అమ్మ, అన్నయ్య.. అందరూ కరోనా బారిన పడ్డారు. ఒకవైపు ఆసుపత్రిలో కుటుంబమంతా చికిత్స పొందుతోంది. మరోవైపు ఒలింపిక్స్‌ సెలక్షన్స్‌ ఉండడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యా. అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఏఎఫ్‌ఐ) నుంచి టోక్యో ఒలింపిక్స్‌ సెలక్షన్ల కోసం ఎంపిక శిబిరానికి రావాలని పిలుపు వచ్చిన రోజే నాన్న కన్నుమూశారు. మిగిలినవారికీ కరోనా తగ్గకపోవడంతో కనీసం వాళ్లు అంత్యక్రియలకు కూడా రాలేని పరిస్థితి. గుండెనిండా దుఃఖంతో బంధువుల సాయంతో నాన్న అంత్యక్రియలు పూర్తి చేశా.  ఆ ప్రభావం నాపై చాలా రోజులు ఉంది. నెమ్మదిగా కోలుకున్నాక ఆటపై దృష్టిపెట్టా. నాన్నకు ఇచ్చిన మాట కోసం మళ్లీ ట్రాక్‌పై పరుగుతీశా. తాజాగా హనుమకొండలో జరిగిన జాతీయ అథ్లెటిక్స్‌ పోటీలో పదివేల మీటర్లలో బంగారు పతకం, 5000 మీటర్లలో రజత పతకం సాధించి నాన్నకు అంకితమిచ్చా. 2017లో తైపీలో జరిగిన వరల్డ్‌ యూనివర్సిటీ గేమ్స్‌లో తొలి రజత పతకం సాధించిన భారత మహిళగా రికార్డు నెలకొల్పా. ఇంకా అంతర్జాతీయ స్థాయిలో ఎనిమిది వరకు పతకాలను కైవసం చేసుకున్నా. మహారాష్ట్ర ప్రభుత్వం 2019లో తాలూకా స్పోర్ట్స్‌ అధికారిగా ఉద్యోగం ఇచ్చింది. నాన్నకి ఇచ్చిన మాట కోసం ఒలింపిక్స్‌లో పతకం తీసుకొస్తానంటూ’ కన్నీటి పర్యతమయ్యింది సంజీవని బాబురావు జాదవ్‌. తన విజయంలో కోచ్‌ విజయేంద్రసింగ్‌ పాత్ర వెలకట్టలేనిదని చెబుతోంది.

- గుండు పాండురంగశర్మ, కర్పనస్వామి చిన్నబాబు, వరంగల్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్