నాటి సంస్కృతిని నేటి తరానికి...

దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజలకు చేర్చాలనుకుందామె. ఆ ఆశయంతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రత్యేక వెబ్‌సైట్‌ ప్రారంభించి, పురాతన సంప్రదాయాలు, కళలపై అందరికీ అవగాహన కలిగించే కృషి చేస్తోంది. సంస్కృతికి వారసత్వంగా నిలిచిన జానపద,

Published : 21 Sep 2021 01:20 IST

దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజలకు చేర్చాలనుకుందామె. ఆ ఆశయంతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రత్యేక వెబ్‌సైట్‌ ప్రారంభించి, పురాతన సంప్రదాయాలు, కళలపై అందరికీ అవగాహన కలిగించే కృషి చేస్తోంది. సంస్కృతికి వారసత్వంగా నిలిచిన జానపద, హస్తకళలపై పరిశోధనలు జరుపుతోంది. అలనాటి మ్యూజియంల సమాచారాన్ని యువతకు పరిచయం చేస్తూ, ఈతరానికి వాటిని దగ్గర చేస్తోంది... మేధావీ గాంధీ.

మేధావి విద్యార్థినిగా ఉన్నప్పుడు ఆమె పర్యటించిన మ్యూజియంలు తనని చాలా ప్రభావితం చేసేవి. ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, కళలను అక్కడ చూసి రావడమే కాదు, వాటి గురించి సమగ్రంగా వివరాలను సేకరించి భద్రపరుచుకునేది. ఆ అభిరుచి ఆమెను వీడలేదు. చదువుతోపాటు మ్యూజియంలపైనా ఆమె ప్రేమ పెంచుకుంది. పుణెలో కమ్యూనికేషన్‌ అండ్‌ మీడియా స్టడీస్‌లో ఎంబీఏ చేసిన ఈమె, దిల్లీలో ఇంటర్న్‌షిప్‌లో భాగంగా చేపట్టిన అధ్యయనంలో భారతీయ జానపద, హస్తకళల గురించి తెలుసుకుంది. దాంతో చదువుతూనే ‘ది హ్యాపీ హ్యాండ్స్‌’ స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. దీని ద్వారా మ్యూజియంల ప్రత్యేకతపై అందరిలో అవగాహన కలిగిస్తూ వర్క్‌షాపులను నిర్వహించేది. మ్యూజియం వాక్‌ పేరుతో పర్యటకులకు సమగ్రంగా వివరించేది.

ప్రదర్శనశాలల్లోని పురాతన విజ్ఞానాన్ని అందరి వద్దకు చేర్చాలనుకున్నా అంటుంది మేధావి. ‘మన దేశంలో ఉన్నవాటి గురించి అందరికీ తెలియజెప్పడానికి ట్రావెలింగ్‌ మ్యూజియం  పని మొదలుపెట్టా. బెంగళూరులోని ప్రభుత్వ పాఠశాలల్లో పర్యటించి అక్కడి విద్యార్థులకు స్థానిక మ్యూజియంల గురించి అవగాహన కలిగించే దాన్ని. జానపద కళలకు పాఠ్యాంశాలలో ప్రత్యేక స్థానం దక్కడానికి నేను చేసిన కృషి ఫలించింది. దీంతోపాటు సోషల్‌మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి ప్రదర్శనశాలల గురించి తెలిసేలా చేయాలనిపించింది. అందుకే 2016లో ‘హెరిటేజ్‌ ల్యాబ్‌’ వెబ్‌సైట్‌ ప్రారంభించా. దేశవ్యాప్తంగా పర్యటించి ఆయా మ్యూజియంల్లో భద్రపరిచిన మనదేశ సంప్రదాయాలు, కళలకు సంబంధించిన చిత్రలేఖనాల గురించి అధ్యయనం చేసి ఆ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో పొందు పరుస్తున్నా. కొన్నింటిని ఫొటోలతోసహా వివరిస్తున్నా. వందల ఏళ్ల నుంచి భద్రపరిచి ఉంచిన ఇంతటి విలువైన కళల గురించి రాబోయే తరానికి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతేకాదు, ఈ సమాచారం విద్యార్థులకే కాదు, సామాన్యులకూ అందాలనేది నా లక్ష్యం’ అని చెబుతున్న మేధావి ప్రస్తుతం కామన్‌వెల్త్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూజియమ్స్‌ బోర్డు సభ్యురాలు కూడా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్