హస్తకళలను వెలుగులోకి తెచ్చింది...

పేద గ్రామీణ హస్త కళాకారులకు చేయూతనందించడాన్ని ఉద్యమంలా చేపట్టిందా యువతి. ఇందుకు ప్రత్యేకంగా ఓ ఎన్జీవోను స్థాపించింది. దీనిద్వారా వేలమంది మహిళలకు సాధికారతను అందిస్తున్న చెన్నైకి చెందిన 29ఏళ్ల మణిమేఖలై సౌరీరాజన్‌

Updated : 30 Sep 2021 02:07 IST

పేద గ్రామీణ హస్త కళాకారులకు చేయూతనందించడాన్ని ఉద్యమంలా చేపట్టిందా యువతి. ఇందుకు ప్రత్యేకంగా ఓ ఎన్జీవోను స్థాపించింది. దీనిద్వారా వేలమంది మహిళలకు సాధికారతను అందిస్తున్న చెన్నైకి చెందిన 29ఏళ్ల మణిమేఖలై సౌరీరాజన్‌ స్ఫూర్తి కథనమిది.

నార్త్‌ చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలోని పులికాట్‌ (పళవేర్కాడు) ప్రాంతమది. అక్కడ ఏపుగా పెరిగే తాటిచెట్లను ఆధారంగా చేసుకుని నివసించే కుటుంబాలు వందల్లో ఉంటాయి. వాటిఆకులతో సంచులు అల్లడం, మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయించడంలో మహిళలే ముందుండేవారు. కాలక్రమేణా అక్కడి నుంచి యువతులు చదువుకొని ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలసవెళ్లడంతో క్రమేపీ ఈ చేతి వృత్తులు మూలపడ్డాయి. నేటి తరానికి ఈ కళ దూరమైంది. దాంతో అక్కడ ఉపాధిమార్గాలు కూడా తగ్గిపోయాయి. ఆ ప్రాంతంలో మహిళలకు తిరిగి ఉపాధి కల్పించాలనుకుంది మణిమేఖలై.

సేవాసంస్థ ద్వారా...  60-70 ఏళ్ల క్రితం పులికాట్‌లో పళవేర్కాడు విమెన్స్‌ కోఆపరేటివ్‌ అనే సంఘం ప్రారంభమైంది. అందులో రెండు వేల మంది స్థానిక మహిళలను సభ్యులుగా చేర్చుకుని, వారితో తాటాకుల బుట్టలను అల్లించేవారు. నెలకు ప్రతి మహిళకు రూ.4వేలు ఆదాయం వచ్చేది. ప్రస్తుతం అదీ నిలిపేశారు. తిరిగి అక్కడివారి కళను మార్కెట్‌లోకి తీసుకురావాలనుకుంది మణిమేఖలై. చెన్నై అన్నా విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్‌ కోర్సును పూర్తిచేసింది మణిమేఖలై. ప్రాజెక్టులో భాగంగా ఇటలీ, లండన్‌, రష్యావంటి ప్రాంతాల్లో పర్యటించింది. ఎమ్మెస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్న ఈమెకు కొవిడ్‌ సమయంలో మార్కెట్‌లో డిమాండ్‌గా ఉన్న వస్తువులపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా మహిళలు పలురంగాల్లో స్వయం ఉపాధిని పొందిన విధానాన్ని గుర్తించింది. గ్రామీణప్రాంతాలకు చెందిన ఎందరో మహిళలు తమ సామర్థ్యం, నైపుణ్యాలతో సాధించిన విజయాలను చూసింది. ఇదే కోణంలో పులికాట్‌ మహిళల హస్తకళను వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో జూన్‌, 2020లో ‘నోనర్బన్‌ ఫౌండేషన్‌’ సేవాసంస్థను స్థాపించింది.

ఆన్‌లైన్‌ వేదికగా... యూనివర్శిటీ విద్యార్థులందరూ పాల్గొనేలా అంతర్జాతీయస్థాయిలో ఒక పోటీని నిర్వహించింది మణిమేఖలై. తోటపెంపకం, అల్లికలు, చేనేత, హస్తకళలకు సంబంధించి వ్యాపార ఆలోచనలు, వాటిని మార్కెటింగ్‌ విధానాలపై ఆలోచనలను పంచుకునే వేదికగా ఈ పోటీని నిర్వహించా అంటుందీమె. ‘ఇందులో 24 ఏళ్లలోపు విద్యార్థులను 33మందిని ఎంపిక చేశా. వీరి నుంచి ఎన్నో ఆలోచనలను సేకరించాం. మా ఫౌండేషన్‌కు ఆన్‌లైన్‌ను వేదికగా మార్చాం. మా విద్యార్థులందరికీ వారి సొంతప్రాంతాల్లో మరుగునపడిన హస్తకళలు, చిరువ్యాపారాలను గుర్తించమని చెప్పాం. అలా వాటిని వెలుగులోకి తేవడానికి ప్రోత్సాహాన్ని అందించాలని సూచించాం. ఆ తర్వాత అక్కడి మహిళలకు అవసరమైన శిక్షణను మేం అందించడం మొదలుపెట్టాం. అలా ప్రస్తుతం అనకాపుత్తూరులో 100 మంది మహిళలు అరటినార నుంచి చీరలను నేస్తున్నారు. పులికాట్‌లో 300 మంది తాటాకులతో బ్యాగులు అల్లుతున్నారు. మన్నార్‌గుడికి చెందిన 1000 మంది కొబ్బరి పీచుతో చాపలు తయారుచేస్తున్నారు. వీటన్నింటినీ ఆన్‌లైన్‌లో వినియోగదారులకు మా ఫౌండేషన్‌ తరఫున చేరేలా చూస్తున్నాం. గ్రామీణ మహిళలందరూ వారికి తెలిసిన విద్యతో ఆర్థికస్వావలంబన పొందడం మొదలైంది. అలాగే మేం చేస్తున్న మార్కెటింగ్‌ గురించి కూడా వారికి తెలిసేలా శిక్షణనిస్తున్నాం. దాంతో వాళ్లు తయారుచేసే ఉత్పత్తులు ఇప్పుడు విదేశాలకూ ఎగుమతి అయ్యే స్థాయికి చేరాయి’ అని చెబుతోంది మణిమేఖలై.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్