మన శక్తి చాటుదాం!

బల్బు మార్చాలంటేనే భయపడతాం. కానీ ఈ అమ్మాయిలు ప్రమాదకరమైన విద్యుత్తు రిపేర్లను ఇట్టే చేసేస్తారు... వందల అడుగుల హైటెన్షన్‌ టవర్లని అలవోకగా ఎక్కేస్తారు. తెలంగాణ ట్రాన్స్‌కోలో ఇటీవల 684 మందికి జూనియర్‌ లైన్‌మన్‌గా ఉద్యోగాలు వస్తే అందులో 199 మంది మహిళలే!

Published : 19 Oct 2021 01:57 IST

బల్బు మార్చాలంటేనే భయపడతాం. కానీ ఈ అమ్మాయిలు ప్రమాదకరమైన విద్యుత్తు రిపేర్లను ఇట్టే చేసేస్తారు... వందల అడుగుల హైటెన్షన్‌ టవర్లని అలవోకగా ఎక్కేస్తారు. తెలంగాణ ట్రాన్స్‌కోలో ఇటీవల 684 మందికి జూనియర్‌ లైన్‌మన్‌గా ఉద్యోగాలు వస్తే అందులో 199 మంది మహిళలే! ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న కొందరితో వసుంధర మాట్లాడింది. పట్టుదల, ధైర్యం ఉంటే ఏదైనా సాధించగలం అంటున్న వారు ఇంకా చెప్పారో చూడండి...


చిన్నప్పటి నుంచీ ఆసక్తి...

మాది నల్గొండ జిల్లా చెట్టుపాలెం. ఇంటర్‌ ఫెయిల్‌ అవ్వడంతో పెళ్లి చేశారు. మావారు సుధాకర్‌. ప్రైవేట్‌ ఉద్యోగి. ముగ్గురు పిల్లలు... చాలీచాలని సంపాదన, ఖర్చులు పెరగడంతో నేను కూలికి వెళ్లేదాన్ని. మా మావయ్య ఒకరు ఎలక్ట్రికల్‌ పనులు చేసే వారు. ఆయన ద్వారా చిన్నప్పటి నుంచి నాకీ పనుల పట్ల ఆసక్తి. ఆయన్ని ఈ పనిలో ఆడవాళ్లు ఎందుకు లేరని అడిగే దాన్ని. నా ఆసక్తి చూసి నా తమ్ముడు ఐటీఐ ఎలక్ట్రికల్‌లో చేరమన్నాడు. కళాశాలలో చేరినప్పుడు గర్భవతిని. నా భర్త ప్రోత్సాహంతో ఇబ్బందులన్నీ దాటుకుంటూ ఐటీఐ చేశా. జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుకు రాత పరీక్షతో పాటు హైటెన్షన్‌ టవర్‌ ఎక్కాల్సి ఉంటుంది. దీనికోసం కఠిన శిక్షణ తీసుకున్నా. 50 కిలోల బరువున్న ట్రాక్టర్‌ టైరుని దొర్లిస్తూ సాధన చేశా. చేతి పట్టు జారకుండా తాడు వ్యాయామాలు చేసేదాన్ని. శారీరకంగా, మానసికంగా దృఢంగా మారా. పరీక్షలు ఆలస్యమవడంతో ఇంటి దగ్గరే ప్రాక్టీస్‌ చేశా. ఇవేవీ నాకు కష్టంగా అనిపించలేదు. సాధించి చూపించాలనే తపన, సాధించగలననే నమ్మకం ముందుకు నడిపాయి. జేఎల్‌ఎంగా ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది.

- పెదమామ్‌ రత్నకుమారి, నల్గొండ


ఒకే కుటుంబంలో ముగ్గురు

మా నాన్న బాబు జానీ బిజినేపల్లిలో విద్యుత్తు సంస్థలో ఫోర్‌మెన్‌. మేం ఐదుగురు ఆడపిల్లలం. నాన్న రెక్కలు ముక్కలు చేసుకుని మా అందర్నీ చదివించారు. అందరం ఐటీఐ ఎలక్ట్రికల్‌, తర్వాత డిగ్రీ చదివాం. జేఎల్‌ఎం పోస్టులకు ఐదుగురమూ దరఖాస్తు చేశాం. మా అక్కలకు పెళ్లిళ్లు అయ్యి పిల్లలూ ఉన్నారు. పిల్లల్ని వదిలి షాద్‌నగర్‌లో గది తీసుకుని అక్కడ కరెంట్‌ స్తంభం ఎక్కడం, 200 అడుగుల ఎత్తైన హైటెన్షన్‌ టవర్‌ ఎక్కడంలో కఠోర సాధన చేశాం. శిక్షణలో కొన్నిరోజులు నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాం. ఆడపిల్లలకు ఇలాంటివి అవసరమా అని కొందరు నిరుత్సాహపరిచే వారు. అవేమీ పట్టించుకో వద్దని నాన్న, మిగిలిన కుటుంబ సభ్యులు వెన్ను తట్టేవారు. శిక్షణలో కొందరు అబ్బాయిలు టవర్‌ ఎక్కడంలో తడబడుతుంటే మమ్మల్ని ఉదాహరణగా చూపేవారు. అప్పుడే పోటీపడి నెగ్గగలం అనే విశ్వాసం వచ్చింది. నేను 3 నిమిషాల్లో టవర్‌ 100 అడుగుల ఎత్తు వరకు వెళ్లి రాగలను. పైకి వెళ్లాక కిందికి చూస్తే ఎవరికైనా కళ్లు తిరుగుతాయి. అలాంటి భయాల్ని అధిగమించి పరీక్షల్లో నెగ్గాం. మా అక్కలు షమా, రుక్సానా కూడా కొలువులు సాధించారు.

- రిజ్వానా, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూలు


కాన్పు అయిన రెండు నెలలకే స్తంభం ఎక్కా!

శాఖలో నేను మూడో తరం! మా నాన్న సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌. మా తాత కూడా ఈ డిపార్ట్‌మెంట్‌లో చేశారు. మా నాన్న తనతో పాటూ అప్పుడప్పుడు నన్నూ విధులకు తీసుకెళ్లే వారు. నా బిడ్డను కూడా డిపార్ట్‌మెంట్‌లోకి తీసుకొస్తా అనే వారు. 2017లో నా ఐటీఐ ఎలక్ట్రికల్‌ పూర్తైంది. జేఎల్‌ఎం పోస్టుల భర్తీ పక్రియ కోర్టు కేసులతో చాలా ఆలస్యమైంది. 2018లో రాత పరీక్ష.. తర్వాత టవర్‌ ఎక్కే పరీక్ష. వీటి కోసం హైదరాబాద్‌లో ప్రైవేటుగా శిక్షణ తీసుకున్నాను. పరీక్ష ఆలస్యం కావడంతో 2020లో నాకు పెళ్లి చేశారు. మా ఆయన మహేశ్‌ కూడా టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ జేఎల్‌ఎం. టవర్‌ ఎక్కే పరీక్షకు రెండు నెలల ముందే నాకు బాబు పుట్టాడు. దీన్నుంచి కోలుకుని మళ్లీ శిక్షణ తీసుకుని స్తంభం ఎక్కే పరీక్షకు సిద్ధమయ్యాను. టెస్ట్‌లో పాస్‌ అయ్యి జేఎల్‌ఎం కొలువుకి ఎంపికయ్యాను. ఆడవాళ్లు దేంట్లోనూ తక్కువ కాదని నాన్న చిన్నప్పటి నుంచి ప్రోత్సహించే వారు. మా వారు కూడా నన్ను బాగా ప్రోత్సహించారు. ఆ మాటలు నిజమని నిరూపించాలని అనుకున్నా.

- చింత శ్రావణి, సంస్థాన్‌ నారాయణపురం
మల్లేపల్లి రమేశ్‌రెడ్డి, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్