వీళ్లకు శిఖరాలే తలవంచుతున్నాయి!

అబ్బాయిలకే పరిమితమనుకునే రంగాల్లో ట్రెక్కింగ్‌ ఒకటి. అందులోకి అమ్మాయిలు వస్తామంటే... కుటుంబ, సామాజిక ఆంక్షలతో పాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండరంటూ రకరకాల కారణాలు తెరమీదకి వచ్చేస్తుంటాయి.

Updated : 10 Nov 2021 06:15 IST

అబ్బాయిలకే పరిమితమనుకునే రంగాల్లో ట్రెక్కింగ్‌ ఒకటి. అందులోకి అమ్మాయిలు వస్తామంటే... కుటుంబ, సామాజిక ఆంక్షలతో పాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండరంటూ రకరకాల కారణాలు తెరమీదకి వచ్చేస్తుంటాయి. ఇవేమీ తమను ఆపలేమంటున్నారు కొందరు. సరదాకే కాదు... ట్రెక్కింగ్‌ లీడర్లుగానూ వ్యవహరిస్తున్నారు. వాళ్లెవరో తెలుసుకుందాం రండి!


స్నేహితుడికి సాయం చేద్దామని: మాన్సీ దవే

యూఎక్స్‌ డిజైనర్‌ మాన్సీకి ట్రెక్కింగ్‌ గురించిన అవగాహనే లేదు. 2017లో ఓరోజు ఈమె స్నేహితుడు హేమల్‌ తన ట్రెక్కింగ్‌ షో కోసం అమ్మాయి ఎవరూ దొరకడం లేదని వాపోయాడు. అతనికి సాయం చేయాలనే ఉద్దేశంతో మాన్సీ ఆ షోలో చేస్తానంది. దానికి శిక్షణ నిమిత్తం మనాలీ వెళ్లింది. కొండా కోనలూ, పచ్చదనం ఆమెను ఆకర్షించాయి. అది మొదలు.. మరుసటి ఏడాది నుంచి మాన్సీ కూడా పార్ట్‌టైమ్‌ ట్రెక్‌ లీడర్‌గానూ అతనితో పాటు పనిచేసింది. ఈ మూడేళ్లలో మనాలీ, కాసోల్‌, పవగథ్‌ పర్వతాలు, సపుతారాల్లో బృందాలను ముందుండి నడిపించింది. లాక్‌డౌన్‌ లేకపోతే మరింత ఎక్కువగా చేసే వాళ్లమంటోంది 25 ఏళ్ల మాన్సీ. ‘నేను లీడ్‌ చేసిన వాటిలో సపుతారా పర్వతాల ట్రెక్‌ కొంచెం సవాళ్లతో కూడుకున్నది. ఐదుగురం వెళ్లాం. అక్కడికి వెళ్లాక చిరుతపులి సంచరిస్తోందని స్థానికులు చెప్పారు. దీంతో ఆయుధాలనూ తీసుకెళ్లాం. రాత్రులు ముగ్గురు పడుకుంటే ఇద్దరం కాపలా కాసేవాళ్లం. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదాలూ ఎదురవలేదు. ఇప్పుడు లేహ్‌, లద్దాఖ్‌కు ప్లాన్‌ చేస్తున్నాం. ఎక్కువ మంది అమ్మాయిలను ట్రెక్కింగ్‌ దిశగా నడిపించాలనుకుంటున్నా’ అంటోందీ గుజరాతీ అమ్మాయి.


ఇదో థెరపీ: తాన్యా గిన్వాలా

క్లినికల్‌ సైకాలజిస్ట్‌గా తాన్యాకి ఐదేళ్ల అనుభవముంది. గదిలో నాలుగు గోడల మధ్య మానసిక సమస్యలకు పరిష్కారం చూపలేమన్నది ఆమె భావన. అప్పుడే అడ్వెంచర్‌ థెరపీ గురించి తెలుసుకుంది. సంబంధిత కోర్సులతోపాటు ట్రెక్కింగ్‌ అండ్‌ మౌంటెనీరింగ్‌లో సర్టిఫికేషన్‌నూ చేసింది. ఓ ఎన్‌జీఓతో కలిసి అంగవైకల్యం ఉన్న వారినీ ట్రెక్కింగ్‌, మారథాన్లకు తీసుకెళ్లేది. ఈ అనుభవంతో ఏడాది నుంచి అడ్వెంచర్‌ థెరపీ ట్రెక్కింగ్‌ని ప్రారంభించింది. ప్రాక్టీస్‌నూ పుణె నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌కు మార్చింది. ‘సాధారణ థెరపీనే ప్రకృతి ఒడిలో కొండలు, పర్వతాల మధ్య అందిస్తాను. వీళ్లతో మాట్లాడుతూ, వాళ్ల పరిస్థితిని అంచనా వేస్తూ జాగ్రత్తగా వ్యవహరించాలి కాబట్టి, మామూలుగా వెళ్లే వాళ్లతో పోలిస్తే ఎక్కువ సమయం పడుతుంది. ఒక్కొక్కరి వీలునుబట్టి రెండు నుంచి పది రోజుల వరకూ ట్రెక్‌ నిర్వహిస్తాను’ అంటోంది తాన్యా.


సైనికులకీ శిక్షణ: ఇషానీ సావంత్‌

13 ఏళ్ల వయసులో అనుకోకుండా హిమాలయాల ట్రెక్కింగ్‌కు వెళ్లింది. అది బాగా నచ్చడంతో తెలిసిన వాళ్లు వెళుతున్నారంటే చాలు కలిసి వెళ్లిపోయేది. అడ్వాన్స్‌డ్‌ మౌంటెనీరింగ్‌ కోర్సులను చేసింది. అమెరికన్‌ మౌంటెయిన్‌ గైడ్స్‌ అసోసియేషన్‌ నుంచి సర్టిఫికేషన్‌నూ చేసింది. దీని వల్ల శిక్షణనిచ్చే అర్హతా దక్కింది. ఏటా మన దేశంతోపాటు యూఎస్‌, హాంకాంగ్‌ల్లోనూ ట్రెక్కింగ్‌ నిర్వహిస్తోంది. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో రాక్‌ క్లైంబింగ్‌పై శిక్షణనూ ఇస్తోంది. తను ఎక్కిన పర్వతాల్లో 6443 మీటర్ల ఎత్తున్న మెంతోసా చాలా కష్టమైందంటుంది ఇషానీ. ‘స్వయంగా చేయడంతోపాటు లీడ్‌ చేస్తున్నా కూడా. ఈ పదేళ్లలో ఎన్ని ట్రెక్స్‌ నిర్వహించానో లెక్క కూడా మర్చిపోయాను. ఓసారి శిక్షణ ఇవ్వడానికి వెళితే నాకేమీ రాదనుకుని ఎగతాళి చేశారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ల అభిప్రాయం తప్పని ఒప్పుకున్నారు. అమ్మాయిలు ఇంతేసి దూరాలు నడవడం, ఎక్కడం కన్నా... ఇలాంటి అభిప్రాయాలకు సమాధానమివ్వడానికి ఎక్కువ కష్టపడుతున్నారు’ అంటోంది 30 ఏళ్ల ఇషానీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్