చాయ్‌వాలీఅనిపించుకోవడం సంతోషం!

గరం గరం చాయ్‌ గొంతులోకి దిగుతుంటే.. ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేం. అయితే బంధువులు, స్నేహితుల్లో ఎవరైనా టీకొట్టు పెడతామంటే అదేంటీ అంటాం. అందులోనూ మహిళలైతే నీకెందుకొచ్చిన తిప్పలు అని వారిస్తాం. గుజరాత్‌కు చెందిన ఆ యువతి మాత్రం ఎందరు వ్యతిరేకించినా వెనకడుగు వేయలేదు

Published : 18 Jan 2022 00:45 IST

గరం గరం చాయ్‌ గొంతులోకి దిగుతుంటే.. ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేం. అయితే బంధువులు, స్నేహితుల్లో ఎవరైనా టీకొట్టు పెడతామంటే అదేంటీ అంటాం. అందులోనూ మహిళలైతే నీకెందుకొచ్చిన తిప్పలు అని వారిస్తాం. గుజరాత్‌కు చెందిన ఆ యువతి మాత్రం ఎందరు వ్యతిరేకించినా వెనకడుగు వేయలేదు. తనకిష్టమైన తేనీటి తయారీలోనే రాణిస్తూ శభాష్‌ అనిపించుకుంటోంది ‘ది చాయ్‌లాండ్‌’ నిషా హుస్సేన్‌ (28).

రాజ్‌కోట్‌కు చెందిన నిష పదోతరగతి తర్వాత చదువాపేసి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా చిరు ఉద్యోగం చేసేది. జీతం ఇంట్లో ఖర్చులకూ సరిపోయేది కాదు. తనకా ఉద్యోగమూ నచ్చేది కాదు. కానీ తన చదువుకు పెద్ద ఉద్యోగాలెక్కడ వస్తాయి? ఆ సమయంలో వసతి గృహంలో ఉండేది. అక్కడ స్నేహితులకు రకరకాల టీలు చేసిపెడుతూ ఉండేది. వాళ్లంతా... నువ్వు టీ సెంటర్‌ పెడితే బాగుంటుందని ప్రశంసించే వాళ్లు. ఆ ప్రోత్సాహం కొత్త ఆలోచనలు రేకెత్తించింది. ఇంకేం దాన్నే ఉపాధిగా ఎంచుకుంది. ఆరంభంలో చిన్న బండి మీద రహస్యంగా తేనీటిని విక్రయించిన నిషా.. ఇప్పుడు పది రకాల సువాసనలు వెదజల్లే టీలను తయారు చేస్తూ ‘చాయ్‌వాలి ఆఫ్‌ రాజ్‌కోట్‌’గా గుర్తింపు పొందింది. ‘‘ఆనందంగా, నిజాయితీతో చేసే ఏ పనికైనా గర్వపడాలి. నామోషీగా భావించకూడదు’’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.                        

చాలా రోజులు పారబోశాను
‘‘చిన్నప్పటి నుంచి ఏ అవకాశం దొరికినా రకరకాల టీలు చేసేదాన్ని. అందుకే వ్యాపారం ప్రారంభించినప్పుడు నమ్మకంగా ఉన్నా. మొదట్లో వినియోగదారులు వచ్చే వారు కాదు. ఓ మహిళ చాయ్‌ బండిని నడపడమేంటని అదోలా చూసేవాళ్లు. దాదాపు 15 రోజులు చేసిన టీని పారబోయాల్సి వచ్చేది. తర్వాత క్రమంగా వ్యాపారం పుంజుకుంది. ఈ సమయంలో ఓ నెటిజన్‌ నా స్టాల్‌ గురించి ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. అది వైరల్‌గా మారిపోయింది. అప్పటి నుంచి ‘ది చాయ్‌లాండ్‌’కు తాకిడి పెరిగింది. ‘రాజ్‌కోట్‌ చాయ్‌వాలి’ అని పిలిచినప్పుడు ఆనందంగా ఉంటుంది. చాలా మంది వాళ్ల పిల్లలను తీసుకొచ్చి నన్ను పరిచయం చేసి నా గురించి వాళ్లకు ఆదర్శంగా తీసుకోమని చెబుతుంటే సంతోషంగా అనిపిస్తుంది’’ అని నిషా చెప్పుకొచ్చింది. నిషాకు పుస్తకాలన్నా, సాహిత్యమన్నా ఇష్టం. తన స్టాల్‌ దగ్గర నెపోలియన్‌ హిల్‌, పౌలా కొల్హో వంటి ప్రసిద్ధ రచయితల పుస్తకాలనూ ఉంచుతుంది. టీ కోసం వేచి చూస్తున్నప్పుడు, తాగుతున్నప్పుడు చాలా మంది వాటిని తిరగేస్తారు. అలా నాలుగు పేజీలు చదివినా, ఆసక్తి కలిగి పుస్తకాలకు అలవాటుపడతారన్నది నా ఆశ అంటుంది తను. ఇప్పుడు అక్కడ ‘తందూరీ చాయ్‌’ చాలా స్పెషల్‌.

ఇంట్లో వద్దంటారని తెలిసినా..
వ్యాపారం ప్రారంభించాలకున్న తర్వాత..  ఇంట్లో తెలీయకుండా ఓ కేఫ్‌లో పని చేసింది. మూడు నెలల తర్వాత తాను దాచుకున్న రూ.25వేలతో ‘ది చాయ్‌లాండ్‌’ పేరుతో రాజ్‌కోట్‌లోని విరాణి చౌక్‌ వద్ద బండిని ప్రారంభించింది. ఇప్పుడు నెలకు లక్షకు పైగా సంపాదిస్తోంది. ‘‘ఇది తెలిసి ఇంట్లో వాళ్లు కొన్నాళ్లు నాతో మాట్లాడలేదు. అయితే ఇప్పుడు నాకంటూ ఓ గుర్తింపు సాధించడంతో వారంతా ఎంతో సంతోషంగా ఉన్నారు’’ అని పేర్కొంది. రెండేళ్ల కిందట ‘ది చాయ్‌లాండ్‌’ కేఫ్‌ను ప్రారంభించిన నిషా.. ఆర్థిక ఇబ్బందులతో మూసేసింది. లాక్‌డౌన్‌ వంటి కారణాలతో ఆటుపోట్లు ఎదురైనా.. ప్రత్యేక కార్యక్రమాలు, వేడుకల్లో ‘ది చాయ్‌లాండ్‌’ స్టాల్‌ను ఏర్పాటు చేయడంతో నష్టాలను అధిగమించినట్లు వివరించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్