వేల మందికి దారిదీపాలు...

గ్రామీణ అమ్మాయిలకు స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్య్రం కల్పించాలన్న ఉద్దేశంతో ప్రారంభమైంది ‘ఈవెన్‌ కార్గో’. దీన్ని.. లింగ సమానత్వానికి మొదటి అడుగు ఆర్థిక స్వేచ్ఛే అని నమ్మిన ఓ అబ్బాయి ‘కేవలం అమ్మాయిల’ కోసం ప్రారంభించాడు.

Published : 06 Mar 2022 01:35 IST

కొండంత అండ!

గ్రామీణ అమ్మాయిలకు స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్య్రం కల్పించాలన్న ఉద్దేశంతో ప్రారంభమైంది ‘ఈవెన్‌ కార్గో’. దీన్ని.. లింగ సమానత్వానికి మొదటి అడుగు ఆర్థిక స్వేచ్ఛే అని నమ్మిన ఓ అబ్బాయి ‘కేవలం అమ్మాయిల’ కోసం ప్రారంభించాడు. దాని కథాకమామీషు చదివేయండి.

2012 నిర్భయ ఘటన యోగేశ్‌ కుమార్‌ని ఆలోచనలో పడేసింది. తను ఇంజినీర్‌. అమ్మాయిలకు సురక్షిత సమాజాన్ని అందించాలన్నది తన అభిప్రాయం. ఇందుకోసం పోలీసు శాఖతో కలిసి యాప్‌లు, వగైరా విషయాల్లో కోడింగ్‌ పరంగా సాయమందించాడు. అయినా ఏదో అసంతృప్తి. ఈ క్రమంలోనే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో గడప దాటడానికీ నోచుకోని అమ్మాయిలను చూశాడు. వాళ్లకి స్వేచ్ఛ, సమానత్వాలను కల్పించాలనుకున్నాడు. అది ఆర్థిక స్వాతంత్య్రంతోనే సాధ్యమవుతుందని నమ్మాడు. అలా 2016లో ‘అమ్మాయిల చేత, అమ్మాయిల కోసం’ నినాదంగా దిల్లీలో ‘ఈవెన్‌ కార్గో’ని ప్రారంభించాడు. ఇదో లాజిస్టిక్‌ డెలివరీ సంస్థ. దీనిలో పేద అమ్మాయిలను ఎంపిక చేసి, శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలనూ చూపిస్తారు. సంస్థ ప్రారంభమైన ఆరు నెలలకే కరీనా బాసిన్‌ అనే అమ్మాయి సహ వ్యవస్థాపకురాలైంది. ఈమెదీ లింగభేదం, గృహహింసలకు వ్యతిరేకంగా పోరాడాలన్న ఉద్దేశమే. అందుకే యోగేశ్‌తో చేతులు కలిపింది. లాజిస్టిక్స్‌, ఈకామర్స్‌ డెలివరీ.. పురుషాధిక్య రంగం. దీనిలోకి మహిళల్ని ప్రోత్సహించడానికి కరీనా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎన్నో బెదిరింపులు. అయినా బృందాల్ని ఏర్పరచుకుని మురికివాడల్లో వాళ్లని కలిసి శిక్షణకి ఒప్పించింది. కొన్ని ప్రాంతాల్లో సుముఖంగా ఉన్నా.. అప్పటిదాకా ఇల్లు దాటని వాళ్లకు సంస్థ వరకూ బస్సులు, మెట్రోల్లో రావడం ఇబ్బంది అయ్యేది. దీంతో వాళ్లు నివసించే ప్రాంతాల్లోనే శిక్షణ ఏర్పాటు చేసేది. సంస్థల వారితో మాట్లాడటం దగ్గర్నుంచి, వాహనాలు నడపడం వరకు అన్ని అంశాల్లో శిక్షణ సాగుతుంది. అలా 15 మందితో దిల్లీలో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు హైదరాబాద్‌, ఝార్ఖండ్‌, కోల్‌కతా, ముంబయి, నాగ్‌పూర్‌ సహా ఎన్నో నగరాల్లో సేవలందిస్తోంది. కొందరికి ఇతర ఈకామర్స్‌ సంస్థల్లోనూ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇప్పటివరకూ 5000కుపైగా అమ్మాయిలు సంస్థలో శిక్షణ పొందారు. నెలకు కనీసం రూ.20,000 వరకూ సంపాదించుకుంటున్నారు. ఏదైనా కారణం తర్వాత ఉద్యోగం మాని, తిరిగి చేరాలనుకునేవారికీ అవకాశమిస్తున్నారు. ‘ఇక్కడ ఎవరికో పోటీగా నిలపడం మా ఉద్దేశం కాదు.. రంగమేదైనా సమాన పని అవకాశాలు అమ్మాయిల హక్కు అని చెప్పడమే మా ఉద్దేశం’ అంటుంది కరీనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్