ఆమె సేవల్ని గూగుల్‌ మెచ్చింది!

చదువుల్లో, ఉద్యోగాల్లో... కొన్ని వర్గాలదే ముందంజ. దీనివల్ల సమాజంలో రెండు భిన్న ప్రపంచాలు ఉండటాన్ని గమనించారు అనన్య. ఈ పరిస్థితిని మార్చడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని గూగుల్‌

Published : 22 Apr 2022 00:33 IST

చదువుల్లో, ఉద్యోగాల్లో... కొన్ని వర్గాలదే ముందంజ. దీనివల్ల సమాజంలో రెండు భిన్న ప్రపంచాలు ఉండటాన్ని గమనించారు అనన్య. ఈ పరిస్థితిని మార్చడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని గూగుల్‌ కూడా ప్రశంసించింది. రూ.5 కోట్ల నిధుల్నీ అందించింది. ఇంతకీ ఆమె ఏం చేస్తున్నారంటే...

అనన్య త్రిపాఠి పుట్టిపెరిగింది కాన్పూర్‌లో. దిల్లీ స్టీఫెన్స్‌ కాలేజీ నుంచి బిఎస్సీ, కాన్పూర్‌లో ఎం.ఏ. సైకాలజీ పూర్తిచేసింది. కేంబ్రిడ్జిలో న్యూరోసైన్సెస్‌పైన డిప్లొమా చేసి స్వీడన్‌లో కొన్నాళ్లు ఉంది. ఇండియాకి వచ్చినప్పుడు చిన్ననాటి స్నేహితురాల్ని కలిసేది. ఒకేచోట పుట్టి పెరిగినా... తాము భిన్న ప్రపంచాల్లో బతుకుతున్నట్టుగా తోచేదామెకు. చదువులు మధ్యలోనే ఆపేసి చిన్నచిన్న ఉద్యోగాల్లో చేరిపోయారంతా. ఈ పరిస్థితిలో మార్పు మంచి చదువుల ద్వారానే సాధ్యమనుకుంది. అప్పుడే తనకో లక్ష్యం ఏర్పడింది. దాని కోసం మన దేశానికి తిరిగొచ్చింది. బిహార్‌లోని ఓ మారుమూల ప్రాంతానికి వెళ్లి ఏడాదిన్నర స్కూల్‌ టీచర్‌గా పనిచేస్తూ అమ్మాయిలు చదువుకోవడానికి పడే ఇబ్బందుల్ని చూసింది. మరింత అధ్యయనం, అవగాహన కోసం దిల్లీ అశోకా యూనివర్సిటీ నుంచి లిబరల్‌ స్టడీస్‌లో పీజీ చేసింది. తర్వాత అమెరికాలోని ఇలినాయి యూనివర్సిటీ నుంచి ఎడ్యుకేషనల్‌ సైకాలజీలో మాస్టర్స్‌, పీహెచ్‌డీ పూర్తిచేసింది.

అమెరికా వెళ్లేముందు అశోకాలో తనతోపాటు చదువుకున్న వైభవ్‌ కుమార్‌తో కలసి 2018లో ‘స్వ తాలీమ్‌’ స్వచ్ఛంద సంస్థని మొదలుపెట్టింది. స్వ(సొంత), తాలీమ్‌(అరబిక్‌లో విద్య) పదాల కలయిక ఇది. బాలికా విద్య మీద దృష్టిపెట్టిన ‘స్వ తాలీమ్‌’ కార్యకర్తలు ప్రస్తుతం హరియాణా రాష్ట్రం పానీపత్‌, మేవాత్‌ జిల్లాల్లోని ఆరు కస్తూర్బా స్కూళ్లలో పనిచేస్తున్నారు. గురుకుల బాలికల పాఠశాలలు కావడం, గ్రామీణ, వెనకబడిన, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థినులు అక్కడ ఎక్కువ మంది ఉండటమే దీనికి కారణం. ‘స్వ తాలీమ్‌’ సిబ్బంది ఇక్కడి విద్యార్థులకు ఆత్మవిశ్వాసం, ఆంగ్ల భాషా నైపుణ్యాలూ, నాయకత్వ లక్షణాలు పెంపొందేలా శిక్షణ ఇస్తారు. టీచర్లకూ బోధనా నైపుణ్యాలపై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. తద్వారా అమ్మాయిలు చదువుల్ని మధ్యలో ఆపేయకుండా యూనివర్సిటీ స్థాయికి పంపాలనేది వీరి ప్రయత్నం. మొత్తం 60 మంది టీచర్లూ, 900 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తూ నాలుగేళ్లలో ఎంతో మార్పు తెచ్చారు.

ఐవీఆర్‌ఎస్‌ పాఠాలు.. కొవిడ్‌లో పాఠశాలలు మూతపడినపుడు ‘ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌’ ద్వారా పాఠాల్ని వినిపించారు. గణితం, సైన్స్‌, సోషల్‌, ఆంగ్లం, హిందీ పాఠాల్ని ఆడియో క్లిప్‌లుగా రూపొందించి టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా వినిపించారు. ఇంటర్నెట్‌ లేకున్నా వినగలగడంతో ఈ పాఠాలు ఎంతో ఉపయోగపడ్డాయి. ‘గూగుల్‌డాట్‌ఆర్గ్‌’ అనన్యని ప్రపంచంలో ‘స్వచ్ఛంద సేవా విభాగం’లో ఏడుగురు అత్యుత్తమ వ్యక్తుల్లో ఒకరిగా గుర్తించింది. ‘గూగుల్‌ ఇంపాక్ట్‌ ఛాలెంజ్‌ ఫర్‌ వుమెన్‌ అండ్‌ గర్ల్స్‌’ పురస్కారానికీ ఎంపికచేసి రూ.5కోట్లు నిధులు ఇచ్చింది. నిపుణుల మార్గనిర్దేశమూ అందిస్తానంది. ‘గ్రామీణులూ సులభంగా ఉపయోగించగలిగే సాంకేతికతని అభివృద్ధిచేసి విద్యార్థినులతోపాటు మహిళలకూ వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం. ఇందుకు గూగుల్‌ సహకారం అక్కరకు వస్తుంది. విద్యార్థినుల తల్లిదండ్రుల్నీ భాగస్వాముల్ని చేసి జాతీయ స్థాయిలో పనిచేయడమే లక్ష్యం’ అంటుంది 33 ఏళ్ల అనన్య.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్