ఆటకన్నా టీవీనే గుర్తింపునిచ్చింది!

జాతీయస్థాయిలో జిమ్నాస్టిక్స్‌లో పతకాలెన్ని సాధించినా పెద్దగా పేరు రాలేదామెకు. ఆమె ప్రత్యేకతను గుర్తించలేదెవ్వరూ. ఓ టీవీ షోలో ఆమె విన్యాసాలు చూసి ప్రేక్షకులందరూ నిశ్చేష్టులైపోయారు. అలా అని ఆమె ఆగిపోలేదు. తనేంటో ప్రపంచానికి చూపాలన్న పట్టుదల వీడలేదు. మనోధైర్యాన్ని పెంచుకుంది. దాంతో ఆమె అంటే అందరికీ తెలిసింది. ఆమె మరెవరో కాదు..

Published : 28 May 2022 01:24 IST

జాతీయస్థాయిలో జిమ్నాస్టిక్స్‌లో పతకాలెన్ని సాధించినా పెద్దగా పేరు రాలేదామెకు. ఆమె ప్రత్యేకతను గుర్తించలేదెవ్వరూ. ఓ టీవీ షోలో ఆమె విన్యాసాలు చూసి ప్రేక్షకులందరూ నిశ్చేష్టులైపోయారు. అలా అని ఆమె ఆగిపోలేదు. తనేంటో ప్రపంచానికి చూపాలన్న పట్టుదల వీడలేదు. మనోధైర్యాన్ని పెంచుకుంది. దాంతో ఆమె అంటే అందరికీ తెలిసింది. ఆమె మరెవరో కాదు.. షాలూ కిరర్‌.

అయిదోతరగతి నుంచే షాలూకు జిమ్నాస్టిక్స్‌ అంటే ఇష్టం. వ్యాయామ శాలకు వెళ్లి సాధన చేస్తున్న ఆమెను చూసి తల్లిదండ్రులు కోప్పడేవారు. చదువుపై ధ్యాస పెట్టమని హెచ్చరించేవారు. అయినా ఆమె ఆసక్తి కొంచెం కూడా తగ్గలేదు. హరియాణకు చెందిన వీరిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులిద్దరూ కష్టపడితేనే ఆ ఇంట్లో అయిదుగురి ఆకలి తీరేది. అందులోనూ ఆడపిల్లకు సరైన వయసులో వివాహం చేస్తే చాలు, ఆమె భవిష్యత్తు బాగుంటుందని నమ్మే సంప్రదాయం వారిది. అయితే షాలూ ఆసక్తి మాత్రం పెరుగుతూనే వచ్చింది. తనను చూసి బంధువు ఒకామె షాలూ అమ్మానాన్నకు నచ్చజెప్పింది. చివరకు వారి మద్దతుతో షాలూ పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. 

కష్టపడ్డా.. కానీ బంధువుల నుంచి తీవ్ర స్థాయిలో తిరస్కారం మొదలైంది. ఆడపిల్లకు చదువు, జిమ్నాస్టిక్స్‌ ఏంటంటూ విమర్శించేవారు. ఎవరు ఎంత విమర్శించినా షాలూ కుటుంబం మాత్రం ఆమెకు ప్రోత్సాహాన్నిచ్చింది. అలా స్కూల్‌ చదువుతున్నప్పుడే స్థానిక పోటీల్లో విజేతగా నిలిచేది. తెలిసినవారి ఆర్థిక సాయంతో రాష్ట్ర, జాతీయ స్థాయి అవకాశాలను దక్కించుకుంది. అక్కడా పతకాలు సాధించింది. దీంతో విమర్శించిన వారంతా ప్రశంసించడం మొదలుపెట్టారు. ఆడపిల్ల వంటింటికే పరిమితం అనుకునే వారంతా నెమ్మదిగా తమ కూతుర్లకీ ఇష్టమైన కెరియర్‌ ఎంచుకొనే అవకాశమివ్వాలని ఆలోచించడం మొదలుపెట్టారు. ‘ఇదంతా నీ విజయాలను చూసి వచ్చిన మార్పే అనేది అమ్మ. చాలా సంతోషమేసేది. మా ప్రాంతంలో మార్పు తీసుకు రాగలుగుతున్నా అని ఉత్సాహంగా ఉండేది. నా సాధన, అమ్మావాళ్ల ప్రోత్సాహం నన్ను జాతీయస్థాయి విజేతగా నిలిపింది. జిమ్నాస్టిక్స్‌ పరంగా శారీరకంగానే కాదు, మానసికంగానూ చాలా శక్తిని సంపాదించుకున్నా. అయితే అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను ప్రదర్శించడానికి చాలా కష్టపడ్డా. ఆ అవకాశాన్ని అందుకోవడానికి తగిన ప్రోత్సాహం అందలేదు. చాలా నిరుత్సాహానికి గురయ్యా.

అమ్మానాన్నకు ముగ్గురం పిల్లలం. కూలి పనులతోనే మమ్మల్ని పెంచి చదివించారు. దానికి మించి వారి నుంచి ఆర్థికపరంగా ఎటువంటి సాయం అందదని తెలుసు. అలా నా ఆశ కలగానే మిగిలిపోయింది. అయితే ఎలాగైనా గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యం మాత్రం నాలో ఉండిపోయింది.
మరో అవకాశం... షాలూకు ప్రతిభను నిరూపించుకోవడానికి మరో అవకాశం దక్కింది. ‘ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌ షో’ వేదికపై జిమ్నాస్టిక్స్‌ను కలిపి చేసే విన్యాసాలు ప్రదర్శించే అవకాశం దక్కింది. దిల్లీకి చెందిన స్టంట్‌ గర్ల్స్‌ ‘బాంబ్‌ ఫైర్‌’ బృందం షాలూ తమతో కలిసి పని చేయాలని కోరింది. తన ప్రతిభను అందరికీ చూపించొచ్చు, కుటుంబాన్ని ఆర్థికంగానూ ఆదుకోవచ్చు అనుకుందీమె. ఈ షోకు సీజన్‌ 9 లో ఈమె చేసిన ప్రదర్శన న్యాయ నిర్ణేతలను అబ్బురపరిచింది. బృందాన్ని ఒక తాటిపై తీసుకొచ్చి ప్రదర్శన ఇవ్వడంతో క్రమేపీ ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. మద్దతిచ్చేవారూ పెరిగారు. ఫైనల్స్‌లో షాలూ బృంద ప్రదర్శన ఆ జట్టును సెకండ్‌ రన్నరప్‌గా నిలిపింది. అప్పటి నుంచి ఎక్కడికెళ్లినా అందరూ గుర్తుపడుతున్నారు. ఈ రంగంలో ఆసక్తి ఉన్న తనలాంటి పేద పిల్లలకు ఉచితంగా నేర్పించి వారి కలను సాకారం చేసుకోవడానికి చేయూతనిస్తా అని అంటున్న షాలూ లక్ష్యం నెరవేరాలని మనమూ కోరుకుందాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్