చిన్నారి పెళ్లి కూతురు.. దేశానికి పేరు తెస్తానంటోంది!

అమ్మాయిలను బయటకు రానివ్వని ప్రాంతం ఆమెది. దీనికితోడు పదేళ్లు నిండకుండానే పెళ్లి. అయినా పట్టుబట్టి చదివి, ఉద్యోగంలో చేరింది. అక్కడ బాడీబిల్డింగ్‌పై ఆసక్తి కలిగింది. ఈసారి చంపుతానన్న బెదిరింపులు. ఇంట్లోంచీ గెంటేశారు. అయినా వెనకంజ వేయలేదు. పట్టుదలతో గుర్తింపు తెచ్చుకుని ముందుకు సాగుతోంది... ప్రియా సింగ్‌....

Published : 04 Jun 2022 01:05 IST

అమ్మాయిలను బయటకు రానివ్వని ప్రాంతం ఆమెది. దీనికితోడు పదేళ్లు నిండకుండానే పెళ్లి. అయినా పట్టుబట్టి చదివి, ఉద్యోగంలో చేరింది. అక్కడ బాడీబిల్డింగ్‌పై ఆసక్తి కలిగింది. ఈసారి చంపుతానన్న బెదిరింపులు. ఇంట్లోంచీ గెంటేశారు. అయినా వెనకంజ వేయలేదు. పట్టుదలతో గుర్తింపు తెచ్చుకుని ముందుకు సాగుతోంది... ప్రియా సింగ్‌.

యిదుగురు తోబుట్టువుల్లో ప్రియ ఒకరు. నాన్న అటవీ శాఖలో డ్రైవరు. వాళ్లది రాజస్థాన్‌లోని బికనీర్‌. అమ్మాయిలు కాలు బయట పెట్టడానికే ఒప్పుకొనే వారు కాదు. అయినా పట్టుబట్టి అన్నతోపాటు బడికి వెళ్లింది. అబ్బాయిలతోపాటు కబడ్డీ ఆడేది. కానీ ఇంట్లో ఆర్థిక కష్టాలు తట్టుకోలేక తనకు ఎనిమిదో ఏటే బలవంతంగా పెళ్లి చేశారు. కానీ తను అత్తారింటికి వెళ్లలేదు. చదువు ఆపలేదు. దూరవిద్య ద్వారా డిగ్రీ కూడా పూర్తి చేసింది.

చేయి విరిగినా..!

కుటుంబానికి అండగా నిలవడానికి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంటే తెలిసిన వాళ్లు ఒక జిమ్‌లో సహాయకురాలిగా చేర్చారు. అక్కడేమో ట్రైనర్ల నుంచి శిక్షణ పొందే వారి వరకూ అందరూ మగ వారే. వాళ్లేమో తను అక్కడ పని చేస్తోంటే మేం రామనే వారు. జిమ్‌ యజమాని మాత్రం ప్రియకు అండగా నిలిచాడు. ఓసారి బరువైన వస్తువులు జరుపుతూ చేయి విరగ్గొట్టుకుంది. అయినా ఆమె ఉద్యోగాన్ని మాత్రం వదల్లేదు. పైగా కష్టపడి వ్యాయామాలతోపాటు పర్సనల్‌ ట్రైనర్‌ శిక్షణనీ పూర్తి చేసింది. ఆమె తత్వాన్ని చూసి మిగతా వాళ్లూ క్రమంగా కలవడం ప్రారంభించారు. ఓసారి జాతీయ బాడీ బిల్డింగ్‌ పోటీలు జరుగుతున్నాయని తెలుసుకుంది ప్రియ. తననీ రమ్మంటే వెళ్లింది.

చంపుతానన్నారు..

‘అమ్మాయిలూ బాడీబిల్డింగ్‌ చేయడం మొదటి సారి చూశా. పైగా వాళ్లున్నది స్పోర్ట్స్‌ బ్రా, చిన్న నిక్కరులో! చుట్టూ ఉన్నవాళ్ల నుంచి అభ్యంతరకరమైన మాటలు వినాల్సొస్తుందనుకున్నా. కానీ అక్కడ అలాంటివేమీ లేవు. అప్పుడే రాజస్థాన్‌ నుంచి మహిళా బాడీబిల్డరే లేరని తెలిసింది. చిన్నప్పటి నుంచీ ఆటలంటే పిచ్చి. ఆ కల ఇలా నెరవేర్చుకుందామనుకున్నా’ అంటుంది ప్రియ. తన నిర్ణయం విని ఊళ్లోవాళ్లు వెలేస్తామన్నారు. అన్న ఏకంగా చంపుతానన్నాడు. అమ్మా వాళ్లు ఇంట్లోంచి గెంటేశారు కూడా. తను పని చేసే జిమ్‌ యజమాని శిక్షణనివ్వడానికి ముందుకొచ్చారు. అందరూ తను మధ్యలోనే వదిలేస్తుందనుకున్నారు. ప్రియ మాత్రం తన సాధన సీరియస్‌గా కొనసాగించింది. అది చూసి తనకయ్యే ఖర్చునీ జిమ్‌ యజమానే భరించారు.
మొదటిసారి చెన్నైలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని వంద మందిలో 20వ స్థానంలో నిలిచింది. తర్వాత సాధన మరింత పెంచింది. 2018లో మూడు సార్లు వరుసగా మిస్‌ రాజస్థాన్‌ బాడీ బిల్డర్‌గా నిలిచింది. గుజరాత్‌లో 150 దేశాలు పాల్గొన్న పోటీలో రాజస్థాన్‌ తరఫున ప్రాతినిధ్యం వహించింది. 2021, 22 పోటీల్లో వరల్డ్‌ విమెన్‌ లీడర్‌షిప్‌ అవార్డులను గెలుచుకుంది. అంతర్జాతీయ బాడీ బిల్డింగ్‌ పోటీల్లో పాల్గొనడానికి అర్హత సాధించే పనిలో ఉంది. ‘ఇవన్నీ వదిలేయమని అమ్మానాన్న ఎన్నోసార్లు బతిమాలారు. ఇప్పుడు అందరూ నన్ను పొగుడుతుంటే వాళ్లూ గర్వంగా భావిస్తున్నారు. అయిదేళ్ల తర్వాత నన్ను ఇంటికీ తీసుకెళ్లారు’ అని ఆనందంగా చెబుతోంది. ఎన్ని ఒడుదొడుకులెదురైనా పట్టుదలగా ప్రయత్నించిన ఆమె ఆదర్శప్రాయురాలు కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్