అలుపు లేదు... గెలుపే!
వీళ్లలో డాక్టర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ప్రొఫెసర్... ఇలా వేర్వేరు రంగాల వాళ్లున్నారు. కానీ వారి ప్రయాణాన్ని అక్కడితో ఆపలేదు. ప్రభుత్వ అధికారి అవ్వాలి, ప్రజలకు సేవ చేయాలని తపించారు. ఉద్యోగం, పెళ్లి, పిల్లలు.. ఎన్ని బాధ్యతలూ, బంధనాలున్నా అలుపెరగని కృషితో గెలుపందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ఫలితాల్లో టాప్-10లో ఏడుగురు మహిళలే! డిప్యూటీ కలెక్టర్లు కాబోతున్న వీళ్లు.. ఇంత శ్రమ ఎందుకు చేశారో, ఎలా చేశారో వారి మాటల్లోనే...
వీళ్లలో డాక్టర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ప్రొఫెసర్... ఇలా వేర్వేరు రంగాల వాళ్లున్నారు. కానీ వారి ప్రయాణాన్ని అక్కడితో ఆపలేదు. ప్రభుత్వ అధికారి అవ్వాలి, ప్రజలకు సేవ చేయాలని తపించారు. ఉద్యోగం, పెళ్లి, పిల్లలు.. ఎన్ని బాధ్యతలూ, బంధనాలున్నా అలుపెరగని కృషితో గెలుపందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ఫలితాల్లో టాప్-10లో ఏడుగురు మహిళలే! డిప్యూటీ కలెక్టర్లు కాబోతున్న వీళ్లు.. ఇంత శ్రమ ఎందుకు చేశారో, ఎలా చేశారో వారి మాటల్లోనే...
అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి...
మాది పిఠాపురం. బీఎస్సీ (బయో టెక్నాలజీ), ఎంబీఏ (హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్) చేశా. హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్‌లోనే పీహెచ్‌డీ చేసి ఓ బిజినెస్ స్కూల్‌కు డీన్‌గానూ ఉన్నా. గత వారమే హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరా. హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్‌పై రాసిన 15 పరిశోధనా పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. దీనిపై ఓ పుస్తకమూ రాశా. మరి, ఇటు ఎందుకు వచ్చాననేగా మీ సందేహం! ప్రభుత్వాధికారిగా ఎక్కువ మందికి సేవలు అందించవచ్చని. డిప్యూటీ కలెక్టర్‌గా పేదలకు సేవ చేయాలన్నది నా లక్ష్యం. శిక్షణ తీసుకోకుండా మూడుసార్లు సివిల్స్‌కి ప్రయత్నించా. ఆ సంసిద్ధత గ్రూపు-1లో విజయానికి దోహదపడింది. మావారు రవికాంత్ ప్రొఫెసర్. మాకో అబ్బాయి సురవ్ కాశ్యప్.
- రాణి సుస్మిత(33), మొదటి ర్యాంకర్
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే!
మాది విజయవాడ. బెంగళూరులో పదేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నా. మావారు కొండలరావు కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. బాబు సిదార్థ్ ఆరో తరగతి. 2017లో సివిల్స్ రాశాను. తర్వాత ఎలాగైనా గ్రూపు-1 ఉద్యోగాన్ని దక్కించుకోవాలని పట్టుదలగా సన్నద్ధమయ్యా. ఉద్యోగం, కుటుంబం.. రెండూ చూసుకుంటూ సిద్ధమవడం మొదట కష్టంగా అనిపించేది. తెల్లవారుఝాము ఐదు నుంచి పది గంటల వరకూ సిద్ధమయ్యేదాన్ని. తర్వాత ఉద్యోగం. మళ్లీ రాత్రి కొంత సమయం చదివేదాన్ని. ఇదేమీ చెప్పినంత సులభంగా జరగలేదు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నెగ్గుకొచ్చా. ఒకటి మాత్రం చెప్పగలను.. పక్కా ప్రణాళిక ఉంటే సాధించొచ్చు. 2016లో టాపర్లుగా నిలిచిన నిషాంత్‌రెడ్డి, జగిత్యాల ఆర్డీఓ మాధురిల మార్గనిర్దేశం తీసుకుంటూ రెండేళ్లపాటు సన్నద్ధమయ్యా.
- నీలాపు రామలక్ష్మి (35), 4వ ర్యాంకర్
గర్భిణిగానే పరీక్షలు రాశా..!
బీఎస్సీ నర్సింగ్ చేశా. పరిపాలనా విభాగంలో పనిచేయాలని నా కల. 2012లో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యా. శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా చేస్తున్నా. 2018 డిసెంబరులో గ్రూపు-1 నోటిఫికేషన్ వచ్చింది. 2020 సెప్టెంబరులో మెయిన్స్ జరిగాయి. అప్పుడు రెండోసారి గర్భం దాల్చా. ఆరు నెలల గర్భిణిని. 2016 గ్రూపు-1 సమయంలో ఇంటర్వ్యూ వరకూ వెళ్లా. అప్పుడు గణితం అడ్డంకి అయ్యింది. ఈసారి ప్రధాన పరీక్షల్లో గణితం లేకపోవడంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నా. 2016 నోటిఫికేషన్ జారీ సమయంలోనే పెళ్లైంది. కోచింగ్ తీసుకోలేదు. ఆన్‌లైన్‌లో మాదిరి పరీక్షలు రాశా. మెయిన్స్ సమయంలో మెటర్నిటీ లీవులో ఉన్నా. దాన్ని అవకాశంగా తీసుకొని ఆరోగ్యం సంరక్షించుకుంటూనే పుస్తకాలతో కుస్తీపట్టా. మావారు సాయికుమార్ ప్రైవేట్ ఉద్యోగి.
- కె.మధులత(32) 7వ ర్యాంకు
సన్నద్ధత ఆగలేదు..
మాది అనకాపల్లి జిల్లా రాజునగరం. అమ్మానాన్న నిర్మల, జగన్నాథరాజు ప్రభుత్వ ఉపాధ్యాయులే. నేనూ 2008 డీఎస్సీ ద్వారా స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యా. ఆపైన గ్రూప్-1 రాసి 2018లో విజయనగరం జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టా. మొదట్నుంచీ ఆర్డీఓ కావాలనేది నా లక్ష్యం. అలా ఐ.ఎ.ఎస్. కూడా కావొచ్చు. పరీక్షలకి ప్రత్యేకంగా శిక్షణ తీసుకోకపోయినా.. సిలబస్‌కు అనుగుణంగా పుస్తకాలు సంపాదించి సన్నద్ధమయ్యా. పత్రికల్లోని సంపాదకీయాలూ, వ్యాసాలూ చదువుతూ వర్తమాన అంశాలపైన పట్టుసాధించా. తెలుగులోనే ప్రధాన పరీక్షలు రాశా. టీచర్‌గా ఉన్నప్పుడే వివాహమైంది. బాబు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. పెళ్లి తర్వాత కూడా ఉన్నతోద్యోగాలు సాధించానంటే.. కారణం కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే. మావారు ప్రదీప్. నిర్మాణ రంగంలో ఉన్నారు. ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే. తగిన ప్లానింగ్‌తో చదివా. నోటిఫికేషన్ల మధ్య విరామం ఉన్నప్పటికీ.. ఒక్క రోజు కూడా సన్నద్ధత ఆపలేదు.
- డి.కీర్తి 8వ ర్యాంకు
మొన్న సివిల్స్... ఇప్పుడు గ్రూప్స్!
మాది తాడిపత్రి. ఎంబీబీఎస్ చేశా. మొదట్నుంచీ సివిల్స్ వైపు వెళ్లాలని ఉండేది. మెడిసిన్ తర్వాతా ఆలోచన మారలేదు. 2021 సివిల్స్‌లో 427వ ర్యాంకు సాధించా. ఐపీఎస్ లేదా ఐఆర్‌ఎస్ రావొచ్చు. ఆరో ప్రయత్నంలో ఈ అవకాశం వచ్చింది. హైదరాబాద్, దిల్లీల్లో శిక్షణ తీసుకున్నా. తోటి అభ్యర్థులతో చర్చిస్తూ సిద్ధమయ్యేదాన్ని. గ్రూపు-1కి ఇది నా తొలి ప్రయత్నం. సర్వీస్ రాకపోతే అన్న ఆందోళనా ఉండేది. అందుకని అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వీలున్నప్పుడల్లా ప్రాక్టీస్‌కు వెళ్లేదాన్ని. మాది రైతు కుటుంబం. నలుగురు పిల్లల్లో నేనే పెద్ద. సివిల్స్‌లో విజయం సాధించేందుకు ఏడేళ్లకుపైగా తపించా. అన్నాళ్లూ అమ్మానాన్నల ప్రోత్సాహం ఉండేది. మంచి భవిష్యత్తు ఉంటుంది కష్టపడమని చెప్పేవారు తప్ప, పెళ్లి చేస్తామని కానీ, డాక్టర్‌గానే స్థిరపడమనిగానీ ఒత్తిడి చేయలేదు.
- డాక్టర్ పోలూరు శ్రీలేఖ(31), 5వ ర్యాంకర్
కేంద్ర సర్వీసులో ఉంటూనే
నాన్న ఆదిమూలం మోహన్, కాకినాడ జిల్లా రవాణా శాఖ డీటీసీ. ఆయనే నాకు స్ఫూర్తి. 2015 బీఏ(ఓయూ)లో గోల్డ్‌మెడల్ సాధించా. ఎంఏ(హెచ్‌సీయూ)లో టాపర్‌ని. 2018లో సివిల్స్ రాశా కానీ, మెయిన్స్‌కి అర్హత సాధించలేకపోయా. ఇదే సమయంలో గ్రూపు-1 నోటిఫికేషన్ వచ్చింది. దీంతోపాటు అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్(కేంద్ర హోంశాఖ)కూ అప్లైచేశాను. అందులో ఎంపికై తమిళనాడులోని వేలూరులో పనిచేస్తున్నా. గ్రూపు-1 ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ప్రణాళిక బద్ధంగా సన్నద్ధమయ్యా. కొంతకాలం అనాథపిల్లల సంరక్షణ సంస్థలో వాలంటీరుగానూ పనిచేశా. దీని గురించి ఇంటర్వ్యూలో ప్రశ్నలు వచ్చాయి. సివిల్స్‌కు చేసిన సన్నద్ధత ఇక్కడా బాగా ఉపయోగపడింది. డ్యూటీ నుంచి రాగానే పుస్తకాలు పట్టుకునేదాన్ని. ఆర్ట్స్ నేపథ్యం పనికొచ్చింది.
- సాయిశ్రీ (26) 10వ ర్యాంకు
- ఇట్టా సాంబశివరావు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.