సాంకేతికతలో విలువల కోసం...

గూగుల్‌లో ఏదో వస్తువు గురించి వెతుకుతాం. ఇక ఆ తర్వాత ఏ సైట్‌కి వెళ్లినా దానికి సంబంధించిన ప్రకటనలే పక్కన కనిపిస్తుంటాయి.. గమనించారా? అంటే మన సమాచారం వేరే వాళ్లకి వెళ్లిందనేగా! ఇలా ముఖ్యమైన సమాచారమూ చేరితే? చాలా ప్రమాదం కదా! ఆ సమస్యకి పరిష్కారాన్నీ కనిపెట్టి, యూరప్‌లో పలు పురస్కారాలనీ అందుకుంది

Updated : 23 Aug 2022 07:03 IST

గూగుల్‌లో ఏదో వస్తువు గురించి వెతుకుతాం. ఇక ఆ తర్వాత ఏ సైట్‌కి వెళ్లినా దానికి సంబంధించిన ప్రకటనలే పక్కన కనిపిస్తుంటాయి.. గమనించారా? అంటే మన సమాచారం వేరే వాళ్లకి వెళ్లిందనేగా! ఇలా ముఖ్యమైన సమాచారమూ చేరితే? చాలా ప్రమాదం కదా! ఆ సమస్యకి పరిష్కారాన్నీ కనిపెట్టి, యూరప్‌లో పలు పురస్కారాలనీ అందుకుంది శాలినీ కూరపాటి! తనని వసుంధర పలకరించగా.. ఆ ప్రయాణాన్ని చెప్పుకొచ్చిందిలా..

* ఓ అంతర్జాతీయ సంస్థకు నియామకాల సమయంలో దరఖాస్తులు లక్షల్లో వచ్చేవి. వాటిని నిర్వహించడానికి వాళ్లు ఓ ప్రోగ్రామ్‌ని రూపొందించారు. అది మార్కులు, గ్రేడ్‌లు సమానంగా ఉన్నా.. పురుషులవి పైన, మహిళల దరఖాస్తులు కింద ఉంచిందట.

* ఓ సంస్థ చేసుకున్న ప్రోగ్రాం మగవాళ్లకే ఎక్కువ క్రెడిట్‌ స్కోరు ఇచ్చేది.

ఇలా ఎందుకు అంటే.. మగవాళ్లు సంపాదించడం, ఆడవాళ్లు ఇంటి నిర్వహణ చూసుకోవడం ఒకప్పుడు ఇలా ఉండేది కదా! ఈ ప్రోగ్రామ్‌లు ప్రారంభం నుంచీ సమాచారాన్ని తీసుకున్నాయన్నమాట. దీంతో ఎంపికల విషయంలో లింగవివక్ష కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా బాగా నలుపు చర్మమున్న వారి సంఖ్య తక్కువ. టెక్నాలజీ ఉపయోగించి చేసే కొన్ని చర్మ క్యాన్సర్‌ చికిత్సలు వారిపై పనిచేసేవి కాదు. ఇలాంటి వాటికి పరిష్కారం చూపడం మాపని. మాది చిత్తూరు. నాన్న దయానంద బ్యాంకు మేనేజర్‌, అమ్మ రాధ. ఇంటర్‌ వరకూ ఇక్కడే చదివా. దిండిలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ అయ్యాక నెదర్లాండ్స్‌లో స్కాలర్‌షిప్‌తో పీజీ, పీహెచ్‌డీ, పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ చేశా. విమానఖర్చులు సహా  విద్యా సంస్థే భరించింది. చదువయ్యాక ఇటలీలో ఉద్యోగమూ వచ్చింది. గతంలో ఫేస్‌బుక్‌ వివాదం గుర్తుందా? కేంబ్రిడ్జ్‌ అనలిటికా సంస్థ అనుమతుల్లేకుండా అందరి సమాచారాన్నీ సేకరించడం అప్పట్లో సంచలనం రేపింది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమే కదా అనిపించింది. మొదట్నుంచీ సవాళ్లను స్వీకరించే మనస్తత్వం నాది. అందుకే దీనిపై పనిచేయాలనిపించింది. ఎనిమిదేళ్ల శాశ్వత ఉద్యోగాన్ని వదిలేసి, డేటా ఎథిక్స్‌పై దృష్టిపెట్టా.

సాంకేతిక నైతికత...

మనం నెట్‌లో వెదికేప్పుడు ‘కుకీస్‌’ అని కనిపిస్తుంటాయి. ఇవన్నీ మనమేమేం చేస్తున్నామో ఐపీ చిరునామాతో సహా ట్రాక్‌ చేస్తాయి. డేటా బ్రోకర్స్‌ ఈ సమాచారాన్ని ఇతరులకు అమ్ముకుంటారు. ఇది ప్రమాదం. అలాగని సాంకేతికతకు నేనేమీ వ్యతిరేకం కాదు. అది జీవితాన్ని సులభతరం చేస్తుంది. నిజమే.. అయితే దానిలోనూ నీతి, విలువలకు చోటివ్వాలనేది నా ఉద్దేశం. ఏ సమాచారం ఇవ్వాలనేది వినియోగదారుడి చేతిలో ఉండాలి. అదే ఉద్దేశంతో నా భర్త, మరో ఇద్దరితో కలిసి ఇటలీలో కన్సల్టెన్సీ ప్రారంభించా. సంస్థల సమాచారాన్ని విశ్లేషించి వారికి సాయపడేలా కృత్రిమ మేధతో (ఏఐ) మోడల్‌ చేసిస్తాం. తర్వాత 2019లో ‘క్లియర్‌ బాక్స్‌’ సంస్థను ప్రారంభించాం. బ్యాంకు, ఇన్సూరెన్స్‌, ఎనర్జీ.. తదితర  రంగాల సంస్థలు మా ఖాతాదారులు. వాళ్ల దగ్గరున్న సమాచార నాణ్యతను పరిశీలించి నాణ్యమైన డేటా రూపొందించటంతోపాటు మా ఏఐ టూల్‌తో డేటా ప్రైవసీ కల్పిస్తాం. దీనికి పేటెంట్‌నీ తీసుకున్నాం. సంస్థ ప్రారంభించిన ఏడాదే ‘మోస్ట్‌ ఇన్నొవేటివ్‌ స్టార్టప్‌ ఆఫ్‌ ఇటలీ’ అవార్డు అందుకున్నా. గత ఏడాది యూరప్‌ కమిషన్‌.. ‘టాప్‌ 50 విమెన్‌ రన్‌ టెక్‌ బిజినెస్‌’ జాబితాలో నన్నూ ఎంపిక చేసింది.

ఆనందాలే కాదు.. సవాళ్లూ...

వ్యాపారంలో కొత్త. దానికి తోడు నూతన సాంకేతికత! ప్రాజెక్టు ఇవ్వాలంటే అనుభవం, సంస్థ చరిత్ర వంటివి అడిగేవారు. ప్రతిదాన్నీ ఓపికగా దాటుకుంటూ వచ్చాం. యూరప్‌లో డేటా ప్రైవసీకి ప్రత్యేక నిబంధనలున్నాయి. ఏ సమాచారం తీసుకుంటున్నారో, ఎవరికి ఇస్తున్నారో స్పష్టంగా చెప్పాలి. దానికి ‘ఏఐ’ ద్వారా సాయం చేస్తాం. మా ఆలోచన, సమయమే పెట్టుబడి. ఆలోచన నచ్చి ఇన్వెస్టర్లే ముందుకొచ్చారు. ప్రస్తుతం యూరప్‌లో రెండు అతి పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. మరికొన్నింటితో చర్చలు జరుగుతున్నాయి. డేటా ప్రైవసీ బిల్‌పై అమెరికా కూడా యూరప్‌ను అనుసరిస్తోంది. మనదేశంలోనూ వచ్చే ఏడాది ఆ బిల్‌ పాస్‌ అవుతుందని అంచనా. అప్పటికి ఈ మార్కెట్‌లలోకి ప్రవేశించాలన్నది లక్ష్యం. చిన్నప్పటి నుంచి అమ్మానాన్నలు నేనేది చేస్తానన్నా ప్రోత్సహించే వారు. మావారు లూకా. మెషిన్‌ లర్నింగ్‌ రిసెర్చర్‌. తను మా సంస్థ కోఫౌండరే. తనూ నాకు ప్రతిదశలో తోడున్నారు. నాకు డచ్‌ భాష వచ్చు. ఇటాలియన్‌ అయితే చక్కగా మాట్లాడేస్తా. సమావేశాల్లో దీనిలోనే మాట్లాడుతుంటా. అది చూసి చాలామంది ప్రశంసిస్తుంటారు కూడా. సులువుగా ఉండేవేవీ నాకు నచ్చవు. సవాళ్లకు ఎదురెళ్లడం అలవాటు. అదే నన్ను వ్యాపారంలోకి వెళ్లేలా, సీఈఓగా రాణించేలా చేసింది. దీనికి కుటుంబ ప్రోత్సాహమూ తోడైంది.


అమ్మాయికి ఇంట్లో సపోర్ట్‌ ఉండాలి. అదే తనను ధైర్యంగా నిలబెడుతుంది. తనూ పోటీకి, అపజయాలకు ముందే సిద్ధమై ఉండాలి. దేనికీ భయపడ  కూడదు. చేయలేవు, కుదరదు అని నిరాశపరిచేవారు ప్రతిదశలోనూ ఎదురవుతారు. మీమీద నమ్మకం ఉంటే ఎవరి గురించీ పట్టించుకోవద్దు. ధైర్యంగా ముందుకు   వెళ్లగలిగితేనే.. విజయం సాధ్యం’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్