సైన్స్ పాఠాలు.. శాస్త్రవేత్తలే చెబుతారు!
కొవిడ్‌లో అందరూ వైరస్‌లూ, వ్యాక్సిన్‌లూ, ప్రొటీన్‌లూ, విటమిన్ల గురించి చర్చించినవాళ్లే. వారిలో కొందరు సరైన అవగాహన లేకుండానే మాట్లాడటం గమనించారు స్నేహల్, కరిష్మా. అప్పుడే సైన్స్ గురించి పిల్లల్లో అవగాహన తేవాలనుకున్నారు. ఆపైన విద్యార్థుల్ని సైంటిస్టులతో మాట్లాడించే..
కొవిడ్‌లో అందరూ వైరస్‌లూ, వ్యాక్సిన్‌లూ, ప్రొటీన్‌లూ, విటమిన్ల గురించి చర్చించినవాళ్లే. వారిలో కొందరు సరైన అవగాహన లేకుండానే మాట్లాడటం గమనించారు స్నేహల్, కరిష్మా. అప్పుడే సైన్స్ గురించి పిల్లల్లో అవగాహన తేవాలనుకున్నారు. ఆపైన విద్యార్థుల్ని సైంటిస్టులతో మాట్లాడించే..
‘టాక్ టు ఏ సైంటిస్ట్’ వేదికను ప్రారంభించారు. టాక్ టు ఏ సైంటిస్ట్.. వ్యవస్థాపకులు స్నేహల్ కదమ్, కరిష్మా ఎస్.కౌశిక్ కూడా సైంటిస్టులే. స్నేహల్.. హల్ యార్క్ మెడికల్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ హల్ యూకేలో పీహెచ్‌డీ చేస్తోంది. వైద్యవిద్యను అభ్యసించిన కరిష్మా.. పుణెలోని సావిత్రిబాయి ఫులే యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్.
‘మొదటి లాక్‌డౌన్ ప్రకటించాక.. కరోనా వ్యాప్తి గురించి రకరకాల వార్తలు వినిపిస్తుండేవి. వాటిలో వాస్తవమెంతో తెలిసేదే కాదు. పెద్దవాళ్ల సంగతే అలా ఉంటే పిల్లలకెలా తెలుస్తుంది. అందుకే కొవిడ్ వెనక సైన్స్, వాస్తవాల్ని నిపుణుల చేత చెప్పించే వెబినార్‌ని మార్చి 30న ఏర్పాటుచేశాం’ అని సంస్థ ప్రారంభ నేపథ్యాన్ని వివరిస్తారు స్నేహల్. ఆ తర్వాత నుంచి 6-16 ఏళ్ల విద్యార్థులకి సైన్స్ అంశాల్లో లోతైన విషయాలు తేలిగ్గా వివరించే వేదికగా దీన్ని కొనసాగిస్తున్నారు. సైంటిస్టులు తమ పరిశోధన అంశాల్ని వివరించడంతోపాటు వెబినార్‌లో విద్యార్థులు అడిగే సందేహాలకూ బదులిస్తారు. ‘పిల్లల వ్యక్తిగత గోప్యత పట్ల ఎంతో జాగ్రత్తగా ఉంటాం. దృశ్యాలూ, గ్రాఫిక్స్ ద్వారా వివరించడం వల్ల పిల్లలు వెబినార్‌ని ఆస్వాదిస్తుంటారు’ అంటారు కరిష్మా.
సైంటిస్టులూ ముందుకొచ్చి..
పిల్లలు సైన్స్‌ని పాఠాలుగా నేర్చుకోవడం తప్ప సైంటిస్టుల్ని ఎప్పుడూ చూసుండరు. అందుకే వారికి శాస్త్త్ర్రవేత్తల్ని పరిచయం చేసి వారి పరిశోధనల గురించి వాళ్ల చేతే చెప్పిస్తూ, సందేహాల్నీ అడగమని ప్రోత్సహిస్తారు. దీనివల్ల పిల్లల్లో సైన్స్ పట్ల శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. జీవ, రసాయన, భౌతిక శాస్త్రాలే కాదు విశ్వం, సముద్రగర్భం... ఇలా ఎన్నో రంగాల పరిశోధకులతో పిల్లల్ని మాట్లాడిస్తారు. వారికి ప్రశ్నించే స్వభావాన్ని నేర్పిస్తూనే.. లోతుగా తెలుసుకోవాలనే కుతూహలాన్ని కలిగిస్తారు. ‘మా ఆలోచన పంచుకోగానే చాలామంది శాస్త్రవేత్తలు ముందుకొచ్చారు. యువ సైంటిస్టులతోపాటు ప్రఖ్యాత వైరాలజిస్ట్ డాక్టర్ గగన్‌దీప్ కంగ్ కూడా ఈ వేదిక మీద మాట్లాడారు. మా సేవలు ఉచితమే. కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ, సైన్స్ ప్రచార సంస్థల నుంచీ విరాళాల్ని తీసుకోవాలను కుంటున్నాం. వెబినార్ సమాచారాన్ని మా వెబ్‌సైట్‌లో, వీడియోల్ని యూట్యూబ్‌లోనూ ఉంచుతున్నాం’ అని చెబుతారు స్నేహల్, కరిష్మా. ఇండియా బయోసైన్స్ ఔట్‌రీచ్, అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ వీరికి ఇప్పటికే ఆర్థిక సాయం చేశాయి. ప్రస్తుతం నెలలో రెండు వెబినార్లు నిర్వహిస్తున్నారు. ఇవి దాదాపు గంటసేపు సాగుతాయి. వైద్య పరిశోధనలు, మొక్కల్లో కమ్యూనికేషన్స్, ప్రొటీన్ల పనితీరు, క్యాన్సర్ కణాల పెరుగుదల... ఇలా అనేక అంశాలపై ఇప్పటివరకూ 40 మంది శాస్త్రవేత్తలు మాట్లాడారు. వెబినార్‌లో పాల్గొనాలనుకునే వాళ్లు ‘టాక్‌టుఏసైంటిస్ట్.కామ్’లో వివరాలు నమోదు చేసుకోవాలి. భవిష్యత్తులో టీచర్ల సాయంతో కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ లేని పట్టణ, గ్రామీణ విద్యార్థులకూ చేరువయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు వీరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.