వ్యక్తి శక్తిగా మారింది

ఇప్పటికీ మనచుట్టూ ఎందరో మహిళలకి చదువుకునే అవకాశం లేదు. దాంతో ఉద్యోగం చేసే పరిజ్ఞానం లేక, కూలీ పనులకు వెళ్లలేక ఆర్థిక ఇబ్బందులతో నానా అగచాట్లు పడుతున్నారు.

Published : 05 Nov 2022 00:12 IST


ఇప్పటికీ మనచుట్టూ ఎందరో మహిళలకి చదువుకునే అవకాశం లేదు. దాంతో ఉద్యోగం చేసే పరిజ్ఞానం లేక, కూలీ పనులకు వెళ్లలేక ఆర్థిక ఇబ్బందులతో నానా అగచాట్లు పడుతున్నారు. అలాంటి వాళ్లని ఆదుకోవడమే లక్ష్యంగా ఒక సాధారణ యువతి సాగించిన కృషి లక్షన్నర మందికి లబ్ధి కలిగిస్తోందంటే ఎంతగొప్ప విషయం కదా...

జయపురాలో ఒక సాధారణ డ్రైవర్‌ కూతురైన మోనికాగుప్తా చదువైపోగానే బ్యాంక్‌లో ఉద్యోగం సంపాదించింది. హమ్మయ్య జీవితం కుదుటపడింది అనుకోలేదా అమ్మాయి. తల్లి కళ్లముందు మెదిలింది. డబ్బు సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలన్నది అమ్మ అందమైన కల. కానీ ఇంటాబయటా ఎలాంటి సహకారమూ అందక ఆవిడ జీవితం వంటింటికే పరిమితమైంది. అమ్మ లాంటి స్త్రీలు ఇంకెందరో కదాని ఎప్పుడూ మథనపడేది మోనిక. అందుకే తను కాస్త స్థిరపడ్డాక... చదువు లేకున్నా డబ్బు గడించేలా మహిళలకు తర్ఫీదివ్వాలనుకుంది. చుట్టుపక్కల మహిళలను కూర్చోబెట్టి వారికి అవగాహన కలిగించేది. అవసరమైన శిక్షణ ఇప్పించేది. అలా తను భర్తతో కలిసి 150 మంది మహిళలతో 12 స్వయం ఉపాధి సంఘాలను ఆరంభించింది. అక్కడితో ఆగలేదు. ఈ చైతన్యం విస్తరించేలా చేసింది. తన కృషి ఫలితంగా ఆ సంఘాల సంఖ్య 7 వేలకు చేరింది. వాటిలో లక్షన్నర మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. వీళ్లు అలంకరణ సామగ్రి, ఇంటికి ఉపయోగపడే వస్తువులూ రూపొందిస్తారు. వృత్తి విద్యలు, మార్కెటింగ్‌, అమ్మకాలు, పొదుపు... ఇలా అన్ని నైపుణ్యాలూ నేర్పించి ఆత్మవిశ్వాసంతో కుటుంబాన్ని నడిపించే సామర్థ్యాన్ని కల్పిస్తోంది.

ఉన్నవన్నీ తాకట్టు పెట్టి...

శిక్షణ దగ్గర్నుంచి రుణాలు ఇప్పించడం వరకూ అన్నింటా తానై అందర్నీ ఒక తాటి మీద నడిపిస్తోంది. ఈ మహిళలు రూపొందించే ప్రమిదల్లో పాలు, పెరుగు, చెట్ల మూలికలు ఉపయోగించడాన దేశ వ్యాప్తంగా వీటికెంతో గిరాకీ ఉంది. కుండలు, రాఖీలు, గాజులు, నగలు, బొమ్మలు, పచ్చళ్లు.. అన్నింటి తయారీలోనూ వీళ్లు దిట్టలే. ఆ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో ఆఫ్‌లైన్లో అమ్మకాలు సాగించడమే కాదు, ఎగ్జిబిషన్లు నిర్వహించుకునే స్థాయికి ఎదిగారు.

మోనిక ప్రయాణం అంత సులువుగా ఏమీ సాగలేదు. లక్ష్య సాధన కోసం తనకున్న కొద్దిపాటి ఆస్తినీ, నగలను తాకట్టు పెట్టింది. స్కూటర్‌ కూడా అమ్మేసింది. తొలి రోజులను గుర్తు చేసుకుంటూ ‘నేను నియమించుకున్న ఉద్యోగులకు జీతం ఇవ్వడానికి డబ్బు లేదు. అయినా వాళ్ల వస్తువులు కుదువ పెట్టుకునే పరిస్థితి రానివ్వలేదు. మొత్తానికి ధైర్యంగా నిలబడ్డారు. వేరొకరికి సాయం చేసే స్థాయికి ఎదిగారు’ అంటుందామె. జయపుర రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న వెయ్యి ‘ఇందిరా రసోయీ’ల బాధ్యత ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్‌లాట్‌ మోనిక నెలకొల్పిన ఎస్‌హెచ్‌జిలకు అప్పగించారంటే ఆమె కృషి ఎంతటిదో అర్థమవుతుంది. ఇటీవల భార్యతో వచ్చిన ముఖ్యమంత్రి అక్కడ భోజనం చేయడమే కాక తనతో ముప్పావు గంట మాట్లాడారని, వంటకాలను ప్రశంసించి మరి కొన్ని రసోయీలను తమకు కేటాయించారని సంతోషంగా చెప్పిందామె. తాజాగా జయపుర మార్గంలో మహిళల కోసం 40 శాతం ఆవుపేడతో పెద్ద భవంతిని నిర్మించారు. అక్కడ ఆవుపేడతో నగలను రూపొందించేందుకు రంగం సిద్ధం చేస్తోందామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్