నా దృష్టిలో వాళ్లూ.. పసివాళ్లే!

భర్తకి వినపడదు.. మాట్లాడలేడు. అతనితో తన భావాలు పంచుకోవడానికి ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సిందేనా? ఇలాకాదని పట్టుదలగా సైగలభాష నేర్చుకున్నారామె! భర్తకోసం నేర్చుకున్న ఆ భాష ఇప్పుడు ఎంతోమంది బధిరులకు గొంతవుతోంది.

Updated : 05 Apr 2023 07:36 IST

భర్తకి వినపడదు.. మాట్లాడలేడు. అతనితో తన భావాలు పంచుకోవడానికి ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సిందేనా? ఇలాకాదని పట్టుదలగా సైగలభాష నేర్చుకున్నారామె! భర్తకోసం నేర్చుకున్న ఆ భాష ఇప్పుడు ఎంతోమంది బధిరులకు గొంతవుతోంది. ఉప్పలపాటి నర్మజ.. తన ప్రయాణాన్ని వసుంధరతో పంచుకున్నారిలా..


* ఇద్దరూ బధిరులే. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పక్కింటి వాళ్లకీ, వీళ్లకీ ఇంటి సరిహద్దు విషయంలో ఎప్పుడూ ఏవో గొడవలు. ఒకరోజు పక్కింటివాళ్లు గర్భిణి అని కూడా చూడకుండా ఆ అమ్మాయిపైకి ఏదో విసిరారు. నోరు లేదు కదాని తిరిగి వాళ్లపైనే కేసుపెట్టారు. వాళ్ల బాధ అర్థం చేసుకునేవారేరి? అప్పటిదాకా పోలీస్‌ స్టేషన్‌ గడప తొక్కిందే లేదు. కానీ వాళ్లనలా వదిలేయలేక పరుగున వెళ్లా. వాళ్ల తరఫున మాట్లాడా.


* ఓ అమ్మాయి.. లైంగిక వేధింపులు ఎదుర్కొంది. నోరు తెరిచి చెప్పలేదు. చెప్పేదీ వినపడదు. తనగోడును అధికారుల దృష్టికి తీసుకెళ్లా. ఎంక్వయిరీకి తనతోపాటు పోలీస్‌స్టేషన్‌కీ వెళ్లా. ఇన్నేళ్లలో ఇలాంటి సంఘటనలెన్నో!


మాటలొచ్చిన మనమే కొన్నిసార్లు భావాలను వ్యక్తపరచలేక సతమతమవుతుంటాం. వినపడని, మాట్లాడలేని వారి పరిస్థితేంటి?.. ఈ ఆలోచన నన్ను కలచివేసింది. మాది విజయవాడ. నాన్న రామారావు లారీ డ్రైవర్‌. అమ్మ దేవి టైలర్‌. పాలిటెక్నిక్‌ చదువుతున్నప్పుడే మేనమామ కొడుకు ప్రసాద్‌తో పెళ్లైంది. తను పొందూరు ప్రభుత్వాస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌. అత్తింట్లో ఏ లోటూ లేదు. సమస్యల్లా మావారితో మాట్లాడాలనుకున్నప్పుడే! ఆయన మాట్లాడలేరు, వినపడదు. ఏం చెప్పాలన్నా ఎవరోకరి సాయం అవసరమయ్యేది. చిన్న చిన్న ఆనందాలనూ నలుగురెదుట బయట పెట్టేదెలా? అందుకే పట్టుదలగా సైగల భాష నేర్చుకున్నా. మా ఆయనతో మాట్లాడటమే కాదు.. ఇతరులకీ ఏ పనిలోనైనా అవసరమైతే సాయమూ చేసేదాన్ని. 2017.. మావారితో బధిరుల సంఘం కార్యక్రమానికి వెళ్లా. అతిథులు, హాజరైనవారితో సభంతా నిండిపోయింది. కానీ వీళ్లకు అనువాదకురాలిగా చేసే ఆవిడ రాలేకపోయారు. కార్యక్రమం కొనసాగేదెలాగని అందరిలో కంగారు. అప్పుడు మావారు నన్ను సాయం చేయమన్నారు. అంతమంది ముందు మాట్లాడాలంటే కంగారొచ్చింది. అయినా వేదిక మీదకెళ్లి కార్యక్రమం పూర్తిచేశా. అందరూ మెచ్చుకుంటోంటే అదో సంతృప్తి! అప్పట్నుంచీ ఇతర సంస్థలకీ సాయం అందిస్తున్నా.

ప్రయాణాలూ చేశా..

ఉద్యోగం, పదోన్నతులు, పింఛన్లు, విద్య, వైద్యం, భూసమస్యలు వంటి విషయాల్లో వీళ్లకు జరిగే అన్యాయాలెన్నో! బధిరులు కష్టపడి ఉద్యోగాలు సాధించినా పని ఇవ్వరు. కొన్నిచోట్ల పెద్ద కేడరైనా కాఫీలు, టీలు మోయించేవారు. వీరి తరఫున పైవాళ్లకు లేఖలు రాయడం, అవసరమైతే నేరుగా వెళ్లి మాట్లాడుతుంటా. వాళ్ల సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్తుంటా. కొన్నిసార్లు బెదిరింపులు వచ్చేవి. కొన్నిచోట్ల ‘వాళ్లతో నీకేంటి సంబంధం’ అంటూ మాట్లాడనిచ్చేవారు కాదు. కుటుంబ సభ్యులైతేనే మాట్లాడమనేవారు. అప్పుడు కుటుంబంలోని వాళ్లకే ఎలా, ఏం మాట్లాడాలో చెప్పి పంపేదాన్ని.

నాకిద్దరు చిన్న పిల్లలు, మరోవైపు వీళ్లు. బాధ, అవసరం, సంతోషం.. ఏదీ నోరు తెరిచి అడగలేరు, చెప్పలేరు. అందుకే వీళ్లూ పసివాళ్లలాగే తోస్తారు నాకు. చాలావరకూ ఆన్‌లైన్‌లోనే సాయమందిస్తా. పిల్లల్ని మా వారి వద్ద వదిలెళ్లాలంటే భయం మరి. తను దగ్గరుండి చూసుకుంటే పర్లేదు. ధ్యాస పక్కకెళితేనే వాళ్ల ఏడుపూ తెలియదు. అందుకే తప్పదన్నప్పుడే పిల్లల్ని వదిలి అమరావతి, హైదరాబాద్‌, శ్రీకాకుళం.. ఇలా వేరే ఊళ్లకూ వెళ్తుంటా. ‘పోలీసు ఎంక్వయిరీ లుంటాయి. చుట్టుపక్కల వాళ్లు నానారకాలుగా అనుకుంటారు.. నీకెందుకీ పనుల’ంటూ బోలెడు సలహాలు. వేటినీ పట్టించుకోలేదు. చేస్తున్నది మంచి పనైనప్పుడు ఎవరికీ భయపడకూడదను కుంటా. త్వరలో వీరికోసం లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేయాలన్నది నా కోరిక.

   - రుప్ప రమణమూర్తి, శ్రీకాకుళం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్