బాధ్యతలన్నీ నావే!

సరిహద్దుల్లో సైన్యం అంటే... మగవారే అనుకునే రోజులు కావివి... అసాధారణ వాతావరణ పరిస్థితుల్లో, శారీరక ప్రతికూలతల్ని తట్టుకుని మరీ దేశ భద్రతలో మేము సైతం అంటున్నారు ఈ తరం మగువలు.

Published : 17 May 2023 00:25 IST

సరిహద్దుల్లో సైన్యం అంటే... మగవారే అనుకునే రోజులు కావివి... అసాధారణ వాతావరణ పరిస్థితుల్లో, శారీరక ప్రతికూలతల్ని తట్టుకుని మరీ దేశ భద్రతలో మేము సైతం అంటున్నారు ఈ తరం మగువలు. మంచు కొండల మధ్య... సరిహద్దు కాపాడటంలో తమ శక్తిని చాటు తున్నారు. ఆ వీర నారీమణుల కథలివి.

దేశ రక్షణలో అత్యంత కీలకమైన శ్రీనగర్‌లో గస్తీ అంటే మాటలేం కాదు... ఒళ్లంతా కళ్లు చేసుకుని పహరా కాయాలి. అలాంటి చోట రాత్రింబవళ్లూ సైనిక స్థావరాల రక్షణ చూస్తున్నారు కొందరు మహిళా కమాండోలు. వారిలో శ్రీనగర్‌కే చెందిన 29 ఏళ్ల షాష ఒకరు. ‘ఇంటినీ, దేశాన్నీ పసిపాపలా కాచుకోవడాన్ని బాధ్యతగా భావిస్తున్నా. అందుకే, ఉదయమే ఇంట్లో అందరికీ వంట సిద్ధం చేసి మరీ విధులకు వెళ్తా. పాపిట సింధూరం, నుదుటిన బొట్టు, భుజానికి మూడు కేజీల ఏకే-47లే నా ఆభరణాలు’ అని గర్వంగా చెబుతారామె.

మేమేం తక్కువ కాదు...

ఈశాన్య ప్రాంతంలోని సీఆర్పీఎఫ్‌ క్యాంపులో అసోంకు చెందిన బాసుమతి... ‘30 బుల్లెట్ల లోడ్‌తోపాటు 3 కేజీల బరువుండే రైఫిల్‌ రోజంతా నా భుజానికే ఉంటుంది. అయినా ఆరడుగుల ఎత్తు గోడపైకి అవలీలగా ఎక్కి అవతలకు అంతే వేగంగా దూకగలను’... శత్రుబలగాల రాకను అడ్డుకోవడానికి నా శక్తి సామర్థ్యాలన్నీ వినియోగించగలను అంటారామె. మిజోరం రాష్ట్రానికి చెందిన 23 ఏళ్ల నోవ్‌ ‘పరీక్షకు హాజరయ్యేటప్పటికి నాకు పాలు తాగే ఆరునెలల కూతురుంది. ఆ సమయంలో రొమ్ములు పాలతో నిండి, కారుతూనే ఉన్నాయి. అయినా సరే, తువ్వాలు కట్టుకొని మరీ పరీక్షకు హాజరయ్యా. దేశసేవలో పాలు పంచుకోవాలనే లక్ష్యమే ఇందుకు కారణం’ అంటారామె.

తీవ్ర వాదుల్ని మట్టుబెడతారు..

కశ్మీరులో ఆయుధాల పరిశీలన, అల్లర్ల నియంత్రణ మహిళా సీఆర్పీఎఫ్‌ దళం బాధ్యతలు. ప్రత్యేకంగా ఇక్కడ ఉమెన్‌ వ్యాలీ క్విక్‌ యాక్షన్‌ టీం (వ్యాలీ క్వాట్‌)ని ఏర్పాటు చేసింది. వీరంతా గడ్డకట్టిన మంచులో, దాల్‌లేక్‌ మధ్య బోట్‌లో పహరా కాస్తారు. తీవ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్స్‌లో పాలుపంచుకుంటారు. ‘మోకాళ్లలోతు మంచులో, వణికించే చలిలో గంటలతరబడి నిలబడినా ఏ రోజూ అలసిపోలేదు.’ అంటారు ఈ బృందంలోని గౌరి. ఇక, జమ్ము, కశ్మీరు సరిహద్దుల్లో కొత్తగా ‘ఉమెన్‌ ఇన్‌ ఖాకీ’ బృందం జమ్ములోకి ప్రవేశించే, బయటకెళ్లే మార్గాల్లో తనిఖీలతో మాదకద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతంలో ఎప్పుడే ఉపద్రవం ఎదురవుతుందో ఊహించలేమంటారు ఎస్సై రాగిణి. ‘మా బృందం అటవీ మార్గాన్ని పరిశీలిస్తుంది. దంతెవాడ, బీజాపుర్‌, సుక్మావంటి ప్రాంతాల్లో మేం రైఫిల్స్‌, పేలుడు పదార్థాల డిటెక్టర్స్‌, మంచినీళ్ల సీసాలతో మైళ్ల దూరం నడుస్తాం’ అని గుర్తుచేసుకుంటారామె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్