విత్తన యాత్రలు చేస్తోంది!
అయిదంకెల జీతాన్ని కాదనుకొని పల్లె బాట పట్టారామె. వందలరకాల సేంద్రియ విత్తనాలను రైతుల నుంచి సేకరించి, దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. మహిళా సాధికారతను కల్పించడంతో పాటు ‘అందరికీ పోషకాహార’మనే పిలుపు నిస్తున్న సౌమ్య బాలసుబ్రమణ్యం స్ఫూర్తి కథనమిది.
అయిదంకెల జీతాన్ని కాదనుకొని పల్లె బాట పట్టారామె. వందలరకాల సేంద్రియ విత్తనాలను రైతుల నుంచి సేకరించి, దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. మహిళా సాధికారతను కల్పించడంతో పాటు ‘అందరికీ పోషకాహార’మనే పిలుపు నిస్తున్న సౌమ్య బాలసుబ్రమణ్యం స్ఫూర్తి కథనమిది.
పొలంగట్లపై నాన్న వేలు పట్టుకొని నడిచిన సౌమ్యకు వ్యవసాయమంటే ఎంతో ప్రేమ. తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన వ్యవసాయ కుటుంబంలో పుట్టారీమె. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ చేసి, టీసీఎస్‌లో కొలువు సాధించారు. ఉద్యోగరీత్యా రాష్ట్రేతర ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు మనసుకిష్టమైనది చేయాలని పించిందీమెకు.
ఆశ్చర్యంగా..
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్)లో కోర్సు చేయాలనుకున్నా అంటారీమె.‘టీసీఎస్‌లో 2017లో రాజీనామా చేసి, ముంబయిలో రెండేళ్ల కోర్సు మాస్టర్స్ ఇన్ సోషల్‌వర్క్‌లో చేరా. దీంతో మహారాష్ట్రలోని గిరిజన గ్రామీణ మహిళలపై అధ్యయనం చేసే అవకాశం దొరికింది. ఉత్తరాఖండ్‌లోని హిమాలయన్ ఎన్విరాన్‌మెంటల్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా స్థానిక మహిళా రైతుల వ్యవసాయ విధానాల్ని, గ్రామీణ సంఘాల పనితీరును పరిశీలించేదాన్ని. మగవాళ్లంతా ఉపాధి కోసం పట్టణాలకు వెళితే, ఇల్లు, వ్యవసాయాన్ని మహిళలే చూస్తారు. సేద్యంలో వారి నైపుణ్యాలు ఆశ్చర్యపరిచేవి. 58 రకాల కిడ్నీ బీన్స్ సహా ఎన్నో కూరగాయలను పండించేవారు. అప్పుడే అమెరికాలో నిర్వహించిన ‘ఆర్గానిక్ సీడ్ గ్రోవర్స్’ సదస్సులో ప్రసంగించే అవకాశం దొరికింది’ అంటారు సౌమ్య.
సొంతంగా..
ప్రయోగాత్మకంగా ఓసారి సౌమ్య నాటిన పింటో రకం బీన్స్ విత్తనాలు ఆరోగ్యంగా పెరిగి కాయలు కాశాయి. ‘సేంద్రియ పద్ధతిలో పండించిన ఆ కాయల నుంచి తీసిన విత్తనాలు నాణ్యమైనవి. చాలామంది నకిలీవాటినే ఎందుకు తెస్తున్నారని ఆలోచించా. రైతుల ప్రాణాలకే ముప్పు తెస్తున్న ఈ విధానాన్ని మార్చాలనిపించింది. దాంతో అక్కడ నాణ్యమైన విత్తనాల సేకరణ చేపట్టి, ఏడాదిలోపే ఈరోడ్‌కెళ్లి ‘హెల్పింగ్ ఆఫ్ అప్రెస్స్‌డ్ జనరేషన్ ఆఫ్ అగ్రికల్చరిస్ట్స్’ (హూగా) సీడ్ కీపర్స్’ ప్రారంభించా. జన్యుపరంగా విత్తనాల మార్పిడి చేస్తే, పంట తర్వాత వాటిని తిరిగి వినియోగించడం కుదరదు. ఇదే నాణ్యమైన విత్తనాలను కనుమరుగు చేస్తోంది. రైతులకు మంచి విత్తనాలు అందితేనే, వారు పండించే కూరగాయలు అందరికీ ఆరోగ్యాన్నిస్తాయి. ఈ ఆలోచనతో నాణ్యమైన విత్తనాల సేకరణ, వాటి సంరక్షణ లక్ష్యంగా పెట్టుకొన్నా. రైతులందరినీ హూగాతో కలిసేలా చేశా’ అని వివరించారు.
దేశవ్యాప్తంగా..
సౌమ్య రెండేళ్లపాటు దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలన్నీ పర్యటించి విత్తనాలు సేకరించారు. అరుదుగా పండించే కూరగాయలు, చిరుధాన్యాలు సహా స్వదేశీ రకాలెన్నింటినో గుర్తించారు. ‘విత్తన యాత్ర’ పేరుతో ఇప్పటివరకు 200 రకాలకు పైగా వంకాయ, ఆనప, టొమాటో, ఆకుకూరలు, బెల్‌పెప్పర్ సహా చిరుధాన్యాలు, వరిలో 42 రకాలను సేకరించి భద్రపరిచారు. ‘ఈ యాత్రలో విత్తనాల గురించి రైతుల వద్ద తెలుసు కొంటున్నా. ఇలా సేకరించిన వాటిని రెట్టింపు చేయడంలో సీడ్ కీపర్స్ పాత్రే ప్రధానం. వీరిలో స్వయం సహాయక బృందాలున్నాయి. విత్తనాలిచ్చి పంట వేయించి, తిరిగి వారి నుంచి విత్తనాలను సేకరిస్తున్నాం. మరోవైపు వీరంతా కూరగాయలు, ఆకుకూరల పెంపకంతో ఉపాధి పొందుతున్నారు. 50కిపైగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్థానిక విత్తనాల సంరక్షణపై అవగాహన కలిగించి విత్తనాల బ్యాంకులు ఏర్పాటు చేశాం. తోటపెంపకంలో శిక్షణనిచ్చి, ఇళ్లవద్ద కూరగాయలు పండించి, వాటి విత్తనాలను తిరిగి బ్యాంకుకు అందించేలా చేస్తున్నాం. ఆన్‌లైన్ ద్వారా కూడా పంపిణీ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా నాణ్యమైన విత్తనాలతో మాత్రమే సేద్యం చేసేలా మార్చాలన్నదే నా లక్ష్యం’ అని వివరిస్తున్న సౌమ్య త్వరలో ఈ విత్తనాలను విదేశాలకూ అందించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.