చెడగొడుతున్నావన్నా... సాధించింది!

ఆడపిల్లలు అలలపై ఆటలాడకూడదన్నారు... సర్ఫింగ్‌ నేర్చుకుంటూ సంప్రదాయాన్ని కాలరాస్తున్నావని దాడులు చేశారు. ఇవేవీ ఆమె ఆశయాన్ని ఆటంకపరచలేదు. అవకాశాలు సృష్టించుకుని.. ఆర్థిక భద్రత సాధించింది.  గాజుతెరల్ని బద్దలు కొట్టి... శ్రీలంకలో మొట్టమొదటి మహిళా సర్ఫ్‌ క్లబ్‌ ఏర్పాటు చేసి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

Published : 29 Jun 2023 00:24 IST

ఆడపిల్లలు అలలపై ఆటలాడకూడదన్నారు... సర్ఫింగ్‌ నేర్చుకుంటూ సంప్రదాయాన్ని కాలరాస్తున్నావని దాడులు చేశారు. ఇవేవీ ఆమె ఆశయాన్ని ఆటంకపరచలేదు. అవకాశాలు సృష్టించుకుని.. ఆర్థిక భద్రత సాధించింది.  గాజుతెరల్ని బద్దలు కొట్టి... శ్రీలంకలో మొట్టమొదటి మహిళా సర్ఫ్‌ క్లబ్‌ ఏర్పాటు చేసి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆమే షమాలీ సంజయ.

‘అవకాశాలేవీ మనల్ని వెతుక్కుంటూ రావు... మనమే సృష్టించుకోవాలి...ఈ క్రమంలో రాళ్లనూ, ముళ్లనూ దాటుకుంటూ ముందుకెళ్లగలగాలి’ అంటోంది షమాలీ సంజయ. ఆమెది శ్రీలంక తూర్పు తీరంలో ఉన్న ఒక చిన్న మత్స్యకార గ్రామం. చిన్నతనంలో రోజూ అక్కడి బీచ్‌లో కూర్చుని సర్ఫింగ్‌ చేసేవారినీ, ఉవ్వెత్తున ఎగసి పడే అలల్ని చూసి ఆనందపడిపోయేది. తండ్రి పేరున్న సర్ఫర్‌. అన్నయ్యా ఈ విభాగంలో ఛాంపియన్‌... అయినా సరే, షమాలీ నేర్చుకుంటానంటే కాదనేశారు. ఆడపిల్లలు అలలపై ఆటలాడకూడదనీ, అది మన సంప్రదాయం కాదని అడ్డుపడ్డారు.

ఆమె పరిచయంతో...

షమాలీతో పాటే సర్ఫింగ్‌ నేర్చుకోవాలన్న తపన పెరిగి పెద్దదయ్యింది. దానికి కాలిఫోర్నియా నుంచి  శ్రీలంక వచ్చి స్థిరపడిన సర్ఫర్‌ టిఫనీ కారోథెర్స్‌ పరిచయం మరో మలుపు తిప్పింది. షమాలీ మొదట పరిస్థితులకు భయపడినా తర్వాత సర్ఫింగ్‌ నేర్చుకోవడానికే మొగ్గు చూపింది. అన్నకి తెలిస్తే కోప్పడతాడని అమ్మమ్మ సాయంతో ఎవరూ చూడకుండా తెల్లవారు జామునే లేచి సాధన చేసేది. మరికొంతమంది అమ్మాయిల్లోనూ భరోసా నింపి శిక్షణకు తెచ్చింది. వారందరికీ టిఫనీ అరుగం బే బీచ్‌లో పాఠాలు నేర్పేవారు.

దేశం నుంచే పంపేస్తామన్నారు..

ఇదంతా ఊళ్లోని మగవారికి ఏ మాత్రం నచ్చలేదు. సంప్రదాయాల్ని చెడగొట్టొద్దని షమాలీని హెచ్చరించారు. స్థానిక మహిళలూ, ఆడపిల్లలు సర్ఫ్‌ చేయరనీ, వారి కుటుంబాలకు సాయం చేయాలంటే...వారికి కుట్టు మిషన్లు ఇవ్వాలనీ, సంస్కృతిని నాశనం చేయొద్దనీ టిఫనీని బెదిరించారు. శ్రీలంక టూరిస్ట్‌ బోర్డు సైతం స్థానికులకు వ్యతిరేకంగా ఏ పని చేసినా.. ఆవిడను దేశం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. అయినా వారు తమ మనోధైర్యం పోగొట్టుకోలేదు. రహస్యంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించి మరీ తర్ఫీదు పొందేవారు. వీరి ఆసక్తిని మెచ్చి స్కిల్స్‌ ఫర్‌ ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌ అనే విదేశీ సంస్థ ఈ-మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌, జర్మన్‌ వంటి నైపుణ్యాలను నేర్పింది. దాంతో షమాలీతో పాటు ఇతర మహిళలూ, పర్యటకులకు సర్ఫింగ్‌ పాఠాలు చెబుతూ ఆర్జిస్తుండటంతో మరికొంతమందీ చేరారు. తర్వాతే ‘అరుగం బే విమెన్‌ సర్ఫ్‌ క్లబ్‌’ ఏర్పాటైంది. అంతేకాదు.. 2020లో జరిగిన జాతీయ సర్ఫింగ్‌ పోటీల్లో శ్రీలంక తొలి మహిళా సర్ఫర్‌గా పోటీ చేసింది కూడా. ఆడపిల్లలు తమ కలలు సాధించడానికి స్ఫూర్తిగా నిలవాలనుకున్నా. అవకాశం ఇస్తేనే కదా సమానత్వం సాధ్యమయ్యేది’ అంటుందీమె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్