ఆమె సారథ్యంలోఐఐటీ!
ఇంజినీరింగ్ అనగానే చాలామంది ఎంపిక ఐఐటీలే! దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ విద్యాసంస్థలకు ఇప్పటివరకూ మహిళా సారథి లేరు.
ఇంజినీరింగ్ అనగానే చాలామంది ఎంపిక ఐఐటీలే! దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ విద్యాసంస్థలకు ఇప్పటివరకూ మహిళా సారథి లేరు. దాన్ని మారుస్తూ తొలిసారిగా డైరెక్టర్ బాధ్యతలు అందుకున్నారు ప్రీతి. ఇంతకీ ఎవరీమె?
ప్రీతి అగలాయం.. చెన్నైకి చెందిన ఈవిడ ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థిని. 1995లో ఇక్కడ కెమికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ఆపై మసాచుసెట్స్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసి, ఎంఐటీలో పోస్ట్ డాక్టొరల్ రిసెర్చర్‌గా చేశారు. ఐఐటీ బాంబేలో లెక్చరర్‌గా పనిచేస్తూనే భూగర్భ బొగ్గు, వాహనాల నుంచి వెలువడే వాయువుల తగ్గింపు.. వంటి పలు అంశాలపై పరిశోధనలు చేశారు. 2010లో ఐఐటీ మద్రాస్‌కి మారిన ప్రీతి కెమికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. ఐఐటీ మద్రాస్ టాంజానియాలోని జంజిబార్‌లో అంతర్జాతీయ క్యాంపస్‌ను ప్రారంభించనుంది. ఈ ఏడాది అక్టోబరు నుంచి తరగతులు మొదలవుతాయి. ఇందుకోసం తాత్కాలిక క్యాంపస్‌ను ఏర్పాటు చేసుకుంది. 2026 నాటికి జంజిబార్ ద్వీపంలో 200 ఎకరాల్లో శాశ్వత క్యాంపస్‌నూ నిర్మించనున్నారు. దీనికి డైరెక్టర్ ఇన్‌ఛార్జిగా ప్రొఫెసర్ ప్రీతి నియమితులయ్యారు. ఆవిడ సేవలకు గుర్తింపుగా.. ఐఐటీల్లో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రీతిని ఎంపిక చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఐఐటీ మద్రాస్ జంజిబార్ క్యాంపస్‌కే కాదు.. ఐఐటీ చరిత్రలోనే తొలి మహిళా డైరెక్టర్‌గా నిలిచారీమె. అకడమిక్ అడ్మినిస్ట్రేషన్, అంతర్జాతీయ విద్యార్థులు, రిసెర్చ్ పార్ట్‌నర్స్‌తో కలిసి పనిచేయనున్నారామె. అన్నట్టూ ప్రొఫెసర్, పరిశోధకురాలిగానే కాదు.. మారథాన్ రన్నర్, బ్లాగర్‌గానూ ఈమె సుపరిచితురాలే! ఈ ఏడాది ‘ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్స్ కార్యాలయం’ దేశవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణిస్తోన్న 75 మంది మహిళల్ని గుర్తించింది. వారిలో ప్రీతి ఒకరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.