ప్రకృతిపై ప్రేమతో...

అయిదు అంకెల జీతం. విలాసవంతమైన జీవితం. ఇవేవీ ఆమెకు సంతృప్తినివ్వలేదు. తనకంటూ ఒక గుర్తింపును కోరుకుంది.

Published : 30 Jul 2023 00:05 IST

అయిదు అంకెల జీతం. విలాసవంతమైన జీవితం. ఇవేవీ ఆమెకు సంతృప్తినివ్వలేదు. తనకంటూ ఒక గుర్తింపును కోరుకుంది. వ్యాపారం చేయాలనుకుంది. అయితే అది పర్యావరణ హితమై ఉండాలనుకుంది నమృతా రామనాథన్‌. అనుకున్నట్లుగానే ‘అప్‌సైక్లీ’తో ఆంత్రప్రెన్యూర్‌గా మారింది. ఆమె ప్రయాణమిది...

క్క బెంగళూరులోనే రోజుకు 251 కిలోల వస్త్ర వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయంటే నమ్ముతారా? ఇది 2016 లెక్క. అప్పటి నుంచి ఏటా 8శాతం పెరుగుతూనే ఉందట. కాటన్‌ మినహా మిగతా వస్త్రాలు పాలిస్టర్‌, సిల్క్‌ లాంటి మిగతా వస్త్రాలన్నీ ప్లాస్టిక్‌ వర్గానికి చెందినవే. వీటిని డంప్‌ చేసినా, కాల్చేసినా పర్యావరణానికి ముప్పే. వీటిని ఉపయోగించి ఏం చేయగలం? నాకున్న అవకాశాలేంటి అని అన్వేషించా. ఆ ప్రయత్నాల నుంచి పుట్టిందే అప్‌సైక్లీ. మాది చెన్నై. మార్కెటింగ్‌లో పీజీ డిప్లొమో చేశా. టాటా హెల్త్‌లో రిలేషన్స్‌ మేనేజర్‌గా చేసేదాన్ని. వ్యాపారవేత్త కావాలనేది నా కల. మధ్యతరగతి కుటుంబం కావడం వల్ల సాధ్యపడలేదు. 9 ఏళ్లు కార్పొరేట్‌ రంగంలో పనిచేశాను. వ్యాపార ఆలోచన ఎప్పుడు వచ్చినా సమయం ఉంది ఇంకా అనుకునేదాన్ని. కరోనా నా ఆలోచన మార్చింది. ఈ రోజు ఈ సెకను మాత్రమే మనది. మరణం మన చేతుల్లో లేదనే చేదు నిజాన్ని నాకు పరిచయం చేసింది. అప్పటి నుంచి ఉద్యోగం మానేసి, నా కలల సాకారానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను.

అందరూ టైలర్లే

అమ్మమ్మ, అమ్మ, ఇరుగు పొరుగు వాళ్లంతా టైలర్లే. దుస్తులు కుట్టగా వచ్చిన వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేసేవారు. లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉన్న నాకు వీటిని ఉపయోగించి బ్యాగులు తయారు చేస్తే బాగుంటుంది అనిపించింది. అయితే నేనేం డిజైనర్‌ని కాదు. అయినా పట్టుదలతో మూడు నెలల్లో బ్యాగులు తయారీ, మెలకువలు నేర్చుకున్నా. చుట్టుపక్కల టైలర్ల దగ్గర వస్త్ర వ్యర్థాలను సేకరించేదాన్ని. మొదట్లో అందరూ పిచ్చిదానిలా చూశారు. అయినా కొనసాగించి ఇద్దరు మహిళల్ని నియమించుకున్నాను. వారి సాయంతో సేకరణ, రంగు, రూపు, నాణ్యత బట్టి వ్యర్థాలను వేరు చేసి బ్యాగులు కుట్టడం మొదలుపెట్టాను.

వారానికి 60 కేజీలు

మా ఉత్పత్తులు సామాజిక మాధ్యమాల్లో ఉంచాం. అలా మార్కెటింగ్‌ మొదలైంది. ట్రావెల్‌, కాలేజీ, స్కూల్‌, ల్యాప్‌టాప్‌ బ్యాగులు, అన్ని రకాల పర్సులను తయారు చేస్తున్నాం. కొందరు మహిళలను చేర్చుకుని, నేనే శిక్షణ ఇస్తున్నా. స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహిస్తున్నా. మొదట్లో మహిళల కుటుంబ సభ్యుల నుంచే ఫిర్యాదులు వచ్చేవి. ‘కుట్టు మెషిన్ల శబ్దం వల్ల నిద్ర ఉండటం లేదు. మీరిచ్చే పనికో నమస్కారం’ అంటూ తిట్టేవారు. కానీ వారికి మహిళలు పనిచేయడం వల్ల వచ్చే లాభాల్ని వివరించి, ఆ డబ్బులు పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడతాయో చెప్పేదాన్ని. ఇన్ని అవాంతరాలను ఎదుర్కొని ఇప్పటి వరకు దాదాపు 600 కేజీల వస్త్రవ్యర్థాలకు అందమైన రూపానివ్వగలిగాను.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్