రైతన్నలు లాభపడాలనుకున్నా..
వ్యవసాయ కుటుంబంలో పుట్టినందుకు.. నేలతల్లి రుణం తీర్చుకోవాలనుకుంది గుంటూరు అమ్మాయి పావనీసంధ్య. రైతులు పండించిన ఉత్పత్తులకు సరైన ధర అందేట్టు చేసి.. సేంద్రియ వ్యవసాయంపై నవతరంలో నమ్మకాన్ని పెంచుతోంది. ఈ ఏడాది ఉత్తమ వ్యవసాయ వ్యాపారవేత్తగా అవార్డుని అందుకున్న పావని ‘మట్టి కథ’ ఇది..
వ్యవసాయ కుటుంబంలో పుట్టినందుకు.. నేలతల్లి రుణం తీర్చుకోవాలనుకుంది గుంటూరు అమ్మాయి పావనీసంధ్య. రైతులు పండించిన ఉత్పత్తులకు సరైన ధర అందేట్టు చేసి.. సేంద్రియ వ్యవసాయంపై నవతరంలో నమ్మకాన్ని పెంచుతోంది. ఈ ఏడాది ఉత్తమ వ్యవసాయ వ్యాపారవేత్తగా అవార్డుని అందుకున్న పావని ‘మట్టి కథ’ ఇది..
తెల్లారిలేస్తే అమ్మానాన్నలు వ్యవసాయ పనుల్లో మునిగితేలేవారు. వాళ్లే కాదు... పావనికి తెలిసిన చాలామంది సాగుని నమ్ముకున్నవాళ్లే. కానీ ఆదాయం అంతంతమాత్రమే కావడంతో వాళ్లంతా ఈ రంగానికి దూరమవుతూ వస్తున్నారు. ఆ అసంతృప్తే ఆమెను వ్యవసాయ వ్యాపారవేత్తని చేసింది. ‘రైతులే దేశానికి వెన్నెముక అంటాం. అలాంటి వాళ్ల కోసం ఏదైనా చేయాలనుకున్నా. వాళ్లు పండించే పంటను మధ్యవర్తుల్లేకుండా, నేరుగా వినియోగదారులకే అమ్ముకొనేలా చేస్తే వాళ్లు లాభపడతారనిపించింది. అందుకే ఈ ప్రయత్నం’ అనే కళ్లం పావనిది గుంటూరు జిల్లా కొత్తపాలెం మండలంలోని నూతక్కి గ్రామం. సాగుపై ఆసక్తితో బీఎస్సీ అయ్యాక, వ్యవసాయంలో డిప్లొమా చేసింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ నుంచి ఆంత్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్(సీఈడీ)లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. అగ్రిక్లినిక్, అగ్రి బిజినెస్ సెంటర్స్(ఏసీ అండ్ ఏబీసీ)విభాగాల్లోనూ శిక్షణ పొందింది.
మొదట్లో వద్దన్నవాళ్లే..
శిక్షణ తర్వాత రసాయనాలు వాడని సేంద్రియ వ్యవసాయంవైపు దృష్టి సారించింది పావని. తోటి రైతులనీ ఆ దిశగా ప్రోత్సహించింది. ‘2020లో సేంద్రియ వ్యవసాయం గురించి రైతులకు చెప్పినప్పుడు ఎవరూ ఆసక్తి చూపించలేదు. దిగుబడులు రావన్నారు. అలాంటి సమయంలో ఆ మార్పుని మా ఇంటి నుంచే తీసుకువస్తే వాళ్లకు నమ్మకం కలుగుతుందని అనిపించింది. మా మావయ్య కళ్లం సాంబిరెడ్డికి 50 ఏళ్ల వ్యవసాయ అనుభవం ఉంది. సేంద్రియ విధానాలూ పాటిస్తారు. దాంతో ఆయనతోనే చెప్పించా. రైతన్నలు నెమ్మదిగా రసాయనాలు వాడని పర్యావరణహిత సాగువైపు ముందడుగు వేశారు. మా ప్రాంతంలో ఎక్కువగా పసుపు పండిస్తారు. కానీ మార్కెట్‌లో సరైన మద్దతు ధర లేక ఇబ్బంది పడేవారు. ఈ పంటని ఎరువుల ఖర్చు లేకుండా సంప్రదాయ పద్ధతిలో పండించాం. ఈ రకంగా పండించిన సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండడంతో.. వాటిని అమ్మడానికి ఓ సంస్థను ప్రారంభించా. మా ఇంటి పేరు, మండలం పేరు కలిసి వచ్చేలా ‘కళ్లం కొత్తపాలెం రైతుల ఉత్పత్తి సంస్థ’ అనే పేరు పెట్టా. మా బృందంలో ఆరుగురు సభ్యులున్నాం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, రైతులకు ఎక్కువ లాభాలు వచ్చేట్టు చేయడం మా లక్ష్యం. చాలామందికి సేంద్రియ ఎరువులను సొంతంగా తయారుచేసుకొనే తీరిక, ఓపిక ఉండవు. అందుకని ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ ఆధ్వర్యంలో శిక్షణ అందిపుచ్చుకుని మేమే వాటిని తయారుచేస్తున్నాం. ప్రస్తుతం 450మందికి పైగా రైతులు ఈ ఎరువులని మా దగ్గర కొనుగోలు చేస్తున్నారు. ఓ పెద్ద గోదాము ఏర్పాటు చేసుకుని.. రైతులు తెచ్చిన పంటల్ని, సేంద్రియ ఎరువులను ఇక్కడే ఉంచి అవసరమైన వారికి అందిస్తున్నా. అతి తక్కువ కాలంలోనే మా ఉత్పత్తులకు మంచి ఆదరణ వచ్చింది. నెలకు ఐదు టన్నుల ఎరువును రైతులకు అందిస్తున్నాం. నెలకు మూడు టన్నుల పసుపు పంటను మా సంస్థ ద్వారా విక్రయిస్తున్నాం. పసుపుతోపాటు కారం, పప్పులు, మందులు వేయని పండ్లు విక్రయిస్తూ రూ.16 లక్షల టర్నోవర్ సాధిస్తున్నాం. లాభాలే ప్రధాన లక్ష్యంగా కాకుండా.. రైతులకూ, ప్రజలకూ మేలు జరగాలనుకుంటున్నా’ అంటోంది పావని. ‘కళ్లం కొత్తపాలెం ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ’.. పేరుతో ఓ ప్రాజెక్టు రిపోర్టుని తయారు చేసిందీమె. ఇందులో సహజ ఎరువుల తయారీ, వాటితో పండించే పంటలు, మార్కెటింగ్, రైతులకు సలహాలు, సూచనలు వంటివి ఉన్నాయి. ఈ నివేదికకు మెచ్చిన కేంద్రప్రభుత్వం.. జాతీయ ఉత్తమ అగ్రిపెన్యూర్ 2022 అవార్డుతో పావనిని సత్కరించింది. ఈ ఏడాది దిల్లీలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి చేతులమీదుగా అవార్డును అందుకుందీమె. భవిష్యత్తులోనూ కొన్నివేలమంది రైతులకు మేలు చేయాలన్నది తన లక్ష్యం అంటోంది పావని.
-సమత పల్లెర్ల, ఈనాడు పాత్రికేయ పాఠశాల
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.