పది ఫెయిల్.. వ్యాపారం హిట్!
కష్టపడి కట్టుకున్న సొంతిల్లు, ఇష్టపడి కొనుకున్న ఫ్లాట్ ఎవరికైనా అపురూపమైన జ్ఞాపకమే కదా! వాటికి వన్నెలద్దడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. బాల్కనీ, వరండాలను మాత్రం ఖాళీగా వదిలేస్తుంటాం.
కష్టపడి కట్టుకున్న సొంతిల్లు, ఇష్టపడి కొనుకున్న ఫ్లాట్ ఎవరికైనా అపురూపమైన జ్ఞాపకమే కదా! వాటికి వన్నెలద్దడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. బాల్కనీ, వరండాలను మాత్రం ఖాళీగా వదిలేస్తుంటాం. వాటినెందుకు అందంగా తయారు చేయకూడదు? ఈ ఆలోచననే వ్యాపారంగా మలచుకున్నారు రామా హేమలత. ఈ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడుదొడుకులు ఆమె మాటల్లోనే...
ఒంటరితనం మనిషికి చాలా అనుభవాలను పరిచయం చేస్తుంది. నాకేమో వ్యాపార పాఠాలను నేర్పింది. పుట్టి పెరిగిందంతా వరంగల్‌లో. పది ఫెయిల్. రెండేళ్లు పట్టింది పాస్ అవ్వడానికి. తర్వాత పెళ్లైంది. మావారు లక్ష్మీనారాయణ. 19 ఏళ్లకే పాప. మంచి భర్త.. కూతురు కన్నా ఎక్కువగా చూసుకునే అత్తమామలు. గీసుకొండలో ఇన్సులేటర్స్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది మాకు. ఏ లోటూ లేదు కాబట్టి ఏదైనా పనిచేయాలన్న ఆలోచన ఎప్పుడూ రాలేదు. వంటిల్లే ప్రపంచం. కానీ ఏడేళ్ల క్రితం ఆయన చనిపోయారు. ఆ తర్వాత అమ్మానాన్నల్నీ కోల్పోయా. తట్టుకోవడం కష్టమైంది. మా అమ్మాయి చదువుకోసం హైదరాబాద్ వచ్చేశాం. ఇక్కడికి వచ్చాక ఏదైనా వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఒక వ్యాపకంగా ఉంటుందనుకున్నా. అప్పుడే తెలిసినవాళ్ల సలహాతో స్కూల్ ఫ్రాంచైజీ తీసుకున్నా. చేయగలననే నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నా. కానీ నిర్వహణలో చాలా సవాళ్లు ఎదురయ్యాయి. ఒక్కొక్కటిగా అవి తెలుసుకున్నా. ఒక గాడిన పడుతుందన్న సమయానికి కొవిడ్ వచ్చి అతలాకుతలం చేసింది. 2020లో బీటెక్ పూర్తయ్యాక పేస్ట్రీ బేకింగ్, మేకింగ్‌లో శిక్షణ తీసుకోవడానికి యూఎస్ వెళ్తా అంది మా అమ్మాయి. అందరినీ పోగొట్టుకుని ఆమే ప్రపంచంగా బతుకుతున్న నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అలాగని నా స్వార్థం కోసం తన ఎదుగుదలను ఆపేయడం తప్పనిపించి సరే అన్నా.
యూట్యూబ్ చూసి..
ఒక్కదాన్నే ఇంట్లో ఏమీ తోచేది కాదు. అప్పుడే మొక్కల పెంపకం మీదకు ధ్యాస మళ్లింది. యూట్యూబ్‌లో వీడియోలు చూసి నా బాల్కనీని అలానే తీర్చిదిద్దాలనుకున్నా. మేకోవర్స్‌కు సంబంధించిన ప్రతిదీ తెలుసుకున్నాను. మూడు నెలల తర్వాత మా బాల్కనీ స్వర్గంలా ముస్తాబైంది. ఒక్కరు బాగుందన్నా చాలనుకున్నా. ఇరుగు, పొరుగు చూసి ఫిదా అయ్యారు. దీన్నే వ్యాపారంగా మలచాలనుకున్నా. ఇంట్లోవాళ్లతో చెబితే ‘ఎందుకమ్మా ఇవన్నీ హాయిగా ఉండక’ అన్నారు. కొందరైతే బాల్కనీ మేకోవర్సా... ఏం వాళ్ల మొక్కలు వాళ్లు తెచ్చుకోలేరా? కుండీల్లో మట్టి పోసి ఇవ్వడానికి నిన్ను వేరేగా నియమించుకుంటారా అంటూ హేళన చేశారు. 2021లో ‘స్వర్గ బాల్కనీ మేకోవర్స్’ను ప్రారంభించా. మరిది పిల్లల సాయంతో ఇన్‌స్టాలో వీడియోలు చేయడం నేర్చుకున్నా. రెండేళ్లలో రెండున్నర లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకోగలిగా.
తారలు మెచ్చి..
రూ.50 వేలు నా మొదటి పెట్టుబడి. ఇప్పుడు నెలకు లక్షల ఆదాయం వస్తోంది. బాల్కనీ మేకోవర్సే కాకుండా ఇంటీరియర్ డిజైనింగ్, పార్లర్స్, విల్లాలు, స్టూడియో వర్క్స్ కూడా చేస్తున్నా. 20మంది దాకా సంస్థలో పనిచేస్తున్నారు. ఇన్‌స్టాలో వీడియోలు చూసి నటి దివి తన స్టూడియోను డెకరేట్ చేసిమ్మని కోరింది. దాంతో నిహారిక కొణిదెల, శ్రీముఖి, మెహబూబ్‌ల స్టూడియోలు, ఇళ్లూ డిజైన్ చేశా. నేను సొంతంగా నేర్చుకున్న దాన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వేదికగా ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వాలన్న ఆశయంతో అడుగులు వేస్తున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.