మాకు ఆ డాక్టరమ్మే కావాలి!

పెద్ద డాక్టరు అవ్వాలని కల. కానీ యాక్సిడెంట్‌ ఆమె జీవితాన్నే మార్చేసింది. బతకదు.. బతికినా మంచానికే పరిమితమవ్వాలన్నారంతా. కానీ ఆమె మాత్రం తనను తాను నిరూపించుకోవాలనుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు 30 ఏళ్ల డాక్టర్‌ అనూష.

Published : 07 Aug 2023 00:01 IST

పెద్ద డాక్టరు అవ్వాలని కల. కానీ యాక్సిడెంట్‌ ఆమె జీవితాన్నే మార్చేసింది. బతకదు.. బతికినా మంచానికే పరిమితమవ్వాలన్నారంతా. కానీ ఆమె మాత్రం తనను తాను నిరూపించుకోవాలనుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు 30 ఏళ్ల డాక్టర్‌ అనూష.  తన సేవలతో ఆమె పనిచేస్తోన్న పట్టణ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి జాతీయ పురస్కారం లభించేలా చేశారు.

పుట్టినప్పటి నుంచీ అంగవైకల్యం ఉండటం వేరు. కానీ అప్పటిదాకా బాగుండి.. ఒక్కసారిగా నిలబడలేరు, నడవలేరన్న వాస్తవాన్ని ఎవరూ తట్టుకోలేరు. ఆ పరిస్థితే ఎదురైంది అనూషకు. అమ్మానాన్న ఛాయారాణి, నరసింహమూర్తి. ఈమెది గుంటూరు. ఎంబీబీఎస్‌ పూర్తయ్యక హైదరాబాద్‌లో ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. పెళ్లిచూపులని 2021 జులైలో ఊరొచ్చి, అనుకోకుండా ప్రమాదానికి గురయ్యారు. కాలికి తీవ్ర గాయమైంది. ఆసుపత్రిలో చేరిస్తే.. రక్తప్రసరణ నిలిచిపోయి, రక్తం గడ్డలు కట్టింది. వెంటనే శస్త్రచికిత్స చేసి కాలు తీసేయకపోతే ప్రాణానికే ముప్పన్నారు. దీనికితోడు హిమోగ్లోబిన్‌ శాతం పడిపోయింది. వెంటిలేటర్‌పై ఉంచాల్సిన పరిస్థితి. బతకడం కష్టమే అనుకున్నారంతా. ఎలాగోలా బతికినా కాలు కోల్పోయానని తెలిసి తట్టుకోలేకపోయారు. ‘నాలుగు సర్జరీలయ్యాయి. రోజూ గాయానికి డ్రెస్సింగ్‌, నొప్పి.. పాపం మంచానికే పరిమితమవ్వాలన్న మాటలు విని కుంగిపోయా. కానీ అక్క, అమ్మ ధైర్యమిచ్చారు. వాళ్ల ప్రోత్సాహంతోనే ప్రభుత్వ పీహెచ్‌సీలు, ఆసుపత్రుల్లో పోస్టులకు నోటిఫికేషన్‌ పడితే ప్రయత్నించా. ఆసుపత్రి బెడ్‌ మీద నుంచే ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూకి హాజరయ్యా. ఏడాదిగా మంగళగిరి పట్టణ ప్రాథమిక వైద్యఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ)లో మెడికల్‌ ఆఫీసర్‌గా సేవలందిస్తున్నా’నంటారు అనూష.

అన్ని మార్కులు..

ఏదైనా జబ్బు వస్తే ప్రైవేటు ఆసుపత్రులవైపే మొగ్గు చూపిస్తారు చాలామంది. శుభ్రత, డబ్బులు పోయినా కచ్చితమైన సేవలు అందుతాయని నమ్మకం. అలాంటి ప్రమాణాలను ప్రభుత్వ ఆసుపత్రిలో అందించేలా చూశారు అనూష. హాస్పిటల్‌ శుభ్రత దగ్గర్నుంచి, రోగులకు కావాల్సిన సదుపాయాలు కల్పించడం, ఓపీకి నంబర్‌ సిస్టమ్‌, సూచీ బోర్డులు, వెయిటింగ్‌ రూమ్‌ వంటివెన్నో ప్రవేశపెట్టి.. ప్రభుత్వాసుపత్రికి కార్పొరేట్‌ కళను తీసుకొచ్చారు. ‘విసుగే ఉండదు. ఓపిగ్గా వ్యవహరిస్తార’ంటారామె పేషెంట్లు. ‘మాకు ఈ డాక్టరమ్మే కావా’లని వివిధ ప్రాంతాల నుంచి వెతుక్కుంటూ వచ్చిమరీ వైద్యం చేయించుకుంటున్నారు. నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌ (ఎన్‌కాజ్‌) బృందం తాజాగా వీళ్ల యూపీహెచ్‌సీని సందర్శించింది. వివిధ విభాగాల పనితీరును పరిశీలించింది. రోగుల ఫీడ్‌బ్యాక్‌ తీసుకొని 96.2 మార్కులిచ్చింది. ఇన్ని ఎక్కువ మార్కులు గతంలో పీహెచ్‌సీలకి కూడా రాలేదు. దీంతో ప్రభుత్వ ప్రశంసలతోపాటు యూపీహెచ్‌సీకి కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ పురస్కారమూ దక్కింది.

రాత్రి పది వరకూ..

‘ఈ అమ్మాయి చేయలేదు అనికాదు.. ఏదైనా చేయగలదన్న పేరు తెచ్చుకో. ఇతరులతో పోల్చుకొని లేనిదాన్ని చూసుకొని బాధపడటం కాదు. లోపమున్నా సాధించడమే గొప్ప. కాబట్టి, ఎప్పుడూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దనేది అమ్మ. ఆమెచ్చిన స్ఫూర్తితోనే ధైర్యంగా ముందుకు సాగా. అనారోగ్యమనో, ఎక్కువ సేపు నిల్చోలేననో ఎప్పుడూ చెప్పేదాన్ని కాదు. మీటింగ్‌, శిక్షణ ఏదున్నా తప్పనిసరిగా హాజరయ్యేదాన్ని. మొదట్లో ఎక్కడికివెళ్లాలన్నా అమ్మ తోడుండేది. కానీ ఆమె కూడా ఈమధ్యే దూరమైంది. నిజానికి నాకది పెద్ద దెబ్బే. ఆమె గర్వపడేలా చేయాలనుకునే నాకు ఈ పురస్కారం చాలా ఆనందాన్నిచ్చింది. ముందుండి నడిపింది నేనే అయినా ఏఎన్‌ఎంలు, సహచర సిబ్బంది ఉమ్మడి శ్రమతోనే ఇది సాధ్యమైంది. రాత్రి 10 వరకూ ఆసుపత్రిలోనే ఉన్న రోజులున్నాయి. నేను పీజీ చేయాలన్నది అమ్మ కల. దాన్ని పూర్తిచేయాలి. ఎవరిమీదా ఆధారపడకూడదని డ్రైవింగ్‌ కూడా నేర్చుకున్నా. మీ కాళ్లమీద మీరు నిలబడండి. ఏదైనా చేయగలమన్న ధైర్యం వస్తుంది.. నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న మాటిది. తోటివారికీ ఇదే సలహానిస్తుంటా’నంటారు అనూష.

కాకర్ల వాసుదేవరావు, అమరావతి


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని