తమ నృత్యరీతికి ప్రపంచ ఖ్యాతి కల్పించాలని..

80 దేశాల్లో నృత్యప్రదర్శనలు.. వేలమంది విదేశీయులకు నృత్యం నేర్పిన ఘనత ఆమెది. వయసెంతో తెలుసా.. 32. సంచార తెగ అమ్మాయి.. కనీస చదువు లేదు. ఇదంతా ఎలా సాధ్యమంటే ఆశా సపేరా గురించి చదివేయాల్సిందే!

Updated : 08 Aug 2023 17:32 IST

80 దేశాల్లో నృత్యప్రదర్శనలు.. వేలమంది విదేశీయులకు నృత్యం నేర్పిన ఘనత ఆమెది. వయసెంతో తెలుసా.. 32. సంచార తెగ అమ్మాయి.. కనీస చదువు లేదు. ఇదంతా ఎలా సాధ్యమంటే ఆశా సపేరా గురించి చది వేయాల్సిందే!

ఏడుగురు తోబుట్టువుల్లో చిన్నది ఆశా. వీళ్లది రాజస్థాన్‌లోని జిప్సీ అనే సంచార తెగ. వాళ్ల సంప్రదాయ నృత్యాలు ఘామర్‌, కల్‌బెలియా చేసి, వచ్చిన మొత్తంతో పొట్టపోసుకునేవారు. సొంత బాణీలు, పాములను పట్టడానికి ఊదే బూర, డోలు, మురళి, కంజర వంటి వాళ్ల సంప్రదాయ వాయిద్యాల ఆధారంగా ఈ తెగ అమ్మాయిలు నృత్యం చేస్తారు. పాము మెలికలు తిరిగినట్టుగా వంపులు తిరగడం, వృత్తాకారంలో వేగంగా తిరుగుతూ నృత్యం చేయడం వీరి ప్రత్యేకత. దీన్ని తన అయిదో ఏటనే ఒంటబట్టించుకుంది ఆశా. అప్పట్నుంచే ప్రదర్శనలూ మొదలుపెట్టింది. 13 ఏళ్లకే అంతర్జాతీయ వేదికలపైనా ప్రదర్శనలిచ్చింది. 80 దేశాల్లో ప్రతిభ చూపి.. దేశంలో దసరా, దీపావళి, పెళ్లిళ్లు సహా ప్రధాన వేడుకలేవైనా తన ప్రదర్శన ఉండాల్సిందే అన్నంతగా పేరు తెచ్చుకుంది.

‘మా పూర్వీకులు మారుమూల ప్రాంతాల్లోనే నివసించేవారు. మగవాళ్లు ఆహారం, కలప కోసం దగ్గర్లోని అడవుల్లోకి వెళ్లేవారు. కొందరు అడవుల నుంచి పాముల్ని తీసుకొచ్చి వాద్యానికి అనుగుణంగా ఆడటం నేర్పించేవారు. ఆ కళ అంతరించే క్రమంలో పుట్టిందే కల్‌బెలియా నృత్యరూపకం. అందుకే ఇది పాముల నృత్యాన్ని పోలి ఉంటుంది. మగవారు వాద్యాలు వాయిస్తోంటే ఆడవాళ్లు నృత్యాలు చేస్తారు. తొలిరోజుల్లో నలుపు రంగులో దుస్తులు, ఒళ్లంతా నగలు, మేలి ముసుగుతో చేసేవారు. ఇప్పుడు ఇతర రంగులవీ ధరిస్తున్నాం. రాజస్థాన్‌కి విదేశీ పర్యటకులు ఎక్కువ. నా నృత్యాన్ని చూసి అవకాశాలిచ్చారు. ఒంటరిగా, బృందంగా ప్రదర్శనలిస్తున్నా. 2010లో యునెస్కో ‘ఇంటాంజిబుల్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ ఆఫ్‌ హ్యుమానిటీ’ జాబితాలో దీన్నీ చేర్చడంతో ఆదరణ బాగా పెరిగింది. దేశీయంగానే కాదు.. విదేశీయులు నేర్చుకోవడానికి నా దగ్గరికి వచ్చేవారు. కొవిడ్‌లో ఆన్‌లైన్‌లోనూ శిక్షణిచ్చా. అక్షరం రాయలేను కానీ.. ఇంగ్లిష్‌ సహా ఎన్నో భాషల్ని మాట్లాడగలను’ అనే ఆశా ఒంటరి తల్లి. అక్కడి కుటుంబాల్లో అమ్మాయిలే సంపాదిస్తారు. అయినా ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం, ఆంక్షలను తట్టుకోలేక విడాకులు తీసుకుంది. వాళ్ల తెగలో విడిపోవడం, అందులోనూ అమ్మాయి ఈ నిర్ణయం తీసుకోవడం దాదాపు లేదనే చెప్పొచ్చు. నా కాళ్లమీద నేను నిలబడగలనన్న ధైర్యమే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమంటుంది ఆశా. తన ఆరేళ్ల కూతురికి చదువుతోపాటు తమ సంప్రదాయ నృత్యం, ధైర్యంగా నిలబడటం వారసత్వంగా ఇస్తానంటోంది. కల్‌బెలియాకు అంతర్జాతీయంగా గుర్తింపు తేవడమే లక్ష్యంగా ఎన్నో ట్రూపులతోనూ పనిచేస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్