కూలి చేసి... బంగారు పతకాలు అందుకుని!

రోజు గడవడం కోసం కూలితో సహా అన్ని పనులూ చేసిందా అమ్మాయి. ఆ కష్టాలకు వెనకడుగువేయలేదు.  చదువుకోవాలన్న లక్ష్యం ముందు అవన్నీ చిన్న విషయాలే అనుకుంది.  

Updated : 08 Aug 2023 17:29 IST

రోజు గడవడం కోసం కూలితో సహా అన్ని పనులూ చేసిందా అమ్మాయి. ఆ కష్టాలకు వెనకడుగువేయలేదు.  చదువుకోవాలన్న లక్ష్యం ముందు అవన్నీ చిన్న విషయాలే అనుకుంది.  పరాయినేలపై ఉంటూ తల్లిభాషపై మమకారాన్ని పెంచుకుని బంగారు పతకాన్ని అందుకున్న తెలుగమ్మాయి గంధం రోజమ్మ కథ ఇది.. 

రోజమ్మ సొంతూరు ప్రకాశం జిల్లా పామూరు మండలం దగ్గరున్న గమ్మలంపాడు. పేద కుటుంబం. నాన్న ఇసాక్‌, అమ్మ సుశీల.. ఇద్దరూ రోజు కూలీలే. పనికెళ్తే తప్ప రోజు గడవని పరిస్థితి. ఇంటర్‌లో చేరాక ఈ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు మరీ ఎక్కువయ్యాయి. దీనికి తోడు తల్లి అనారోగ్యం పాలవ్వడంతో ఆమెకు దగ్గరుండి సేవలు చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కాలేజీకి సరిగా వెళ్లలేకపోయింది రోజమ్మ. ఇంట్లో కష్టాల నుంచి బయటపడాలని పొలాల్లో కూలీ పనిచేయడానికి వెళ్లింది. కొన్నాళ్లు ఆదివారం పూట పిల్లలకు పాఠాలు చెప్పింది. ఇంకొన్నాళ్లు ఆసుపత్రిలో హెల్పర్‌గా, పామూరులోని ఓ నగల దుకాణంలో హెల్పర్‌గానూ పనిచేసింది. ఓ పక్క అమ్మ అనారోగ్యం.. మరోపక్క బతుకుతెరువు కోసం ఏదో ఒక పని.. ఇవే లోకంగా ఉండేది రోజమ్మ. చదువు గురించి ఆలోచించే తీరికే ఉండేది కాదు. దీంతో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 3 సబ్జెక్టులు ఫెయిలయ్యింది. ఆ తర్వాతా.. మూడేళ్లపాటు కూలిపనికి వెళ్లే కుటుంబాన్ని పోషించింది. తండ్రి కూడా తన శక్తిమేరకు ఏ పని దొరికితే అది చేస్తూ కుటుంబానికి అండగా నిలిచారు. రోజమ్మ పరిస్థితి బంధువుల ద్వారా మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీ తెలుగుశాఖ అధ్యక్షులు డాక్టర్‌ శ్రీపురం యజ్ఞశేఖర్‌ చెవినపడింది. ఆయన రోజమ్మ తల్లిదండ్రుల్ని ఒప్పించి.. నెల్లూరులోని ఓ కాలేజీలో చేర్పించి ఇంటర్‌ పూర్తయ్యేలా చేశారు. ఆ తర్వాత చెన్నైలోని క్యూన్‌ మేరీస్‌ కాలేజీలో బీఏ తెలుగులో చేర్పించారు.

సేల్స్‌గర్ల్‌గా చేస్తూనే..

చెన్నైలో ఓ పక్క కాలేజీకి వెళ్తూ మరోపక్క ఓ నగల దుకాణంలో సేల్స్‌గర్ల్‌గా చేరింది రోజమ్మ. ‘నా చదువు సజావుగా జరగాలంటే.. పార్ట్‌టైమ్‌ ఉద్యోగం తప్ప మరో దారి కనిపించలేదు. మధ్యాహ్నానికి కాలేజీ పూర్తిచేసుకుని 3గంటల నుంచి రాత్రి 9వరకూ సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తూ చదువుకున్నా. ఇప్పుడూ అదే పనిచేస్తున్నా’ అనే రోజమ్మ బీఏ తెలుగులో బంగారు పతకం సాధించారు. ఈ పతకాన్ని 2022లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ నుంచి అందుకున్నారు. తాజాగా మద్రాస్‌ యూనివర్సిటీ నుంచి ఎంఏ తెలుగులో 80శాతం మార్కులతో మరో బంగారు పతకాన్ని సాధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పతకాన్ని అందుకున్నారు. రాష్ట్రపతితో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌, అక్కడి గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి నుంచి అభినందనలు అందుకున్నారు. ‘ఎన్నో కష్టాలను అధిగమిస్తే దక్కిన పతకాలివి. నాలా చదువుకునే ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలవాలనుకుంటున్నా. తెలుగులో పీహెచ్‌డీ చేసి ప్రొఫెసర్‌ అవ్వాలన్నది  నా లక్ష్యం. ఆడపిల్లలకు చదువెందుకని మా ఊళ్లో అనేవారు. చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసేవారు. ఆడపిల్లలకు చదువు ఎంత అవసరమో ప్రపంచానికి చాటాలన్నది నా ఆకాంక్ష’ అని అంటారామె. ఇప్పుడు తన తల్లిదండ్రుల్ని చెన్నైకే పిలిపించుకున్నారు. తల్లికి మంచి చికిత్స అందించి, సంతోషంగా చూసుకుంటున్నారు.

- నేలటూరి డేనియల్‌, చెన్నై

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని