10 లక్షల కేజీల ఎరువు చేశాం!

ఒక చాక్లెట్‌ తిన్నా సరే.. ఆ రేపర్‌ని ఎక్కడపడితే అక్కడ పారేయకపోవడమనే చిన్న అలవాటే ఆమెని వ్యాపారవేత్తని చేసింది. కాయగూరల మార్కెట్‌లో వచ్చే టన్నుల కొద్దీ వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మారుస్తూ రైతుల జీవితాల్లో వెలుగు పూయిస్తోంది హైదరాబాద్‌ అమ్మాయి పావని లొల్ల..

Published : 10 Aug 2023 00:01 IST

ఒక చాక్లెట్‌ తిన్నా సరే.. ఆ రేపర్‌ని ఎక్కడపడితే అక్కడ పారేయకపోవడమనే చిన్న అలవాటే ఆమెని వ్యాపారవేత్తని చేసింది. కాయగూరల మార్కెట్‌లో వచ్చే టన్నుల కొద్దీ వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మారుస్తూ రైతుల జీవితాల్లో వెలుగు పూయిస్తోంది హైదరాబాద్‌ అమ్మాయి పావని లొల్ల..

స్కూల్‌ రోజుల నుంచీ నాకో అలవాటు. చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయను. చాక్లెట్‌ తిన్నాసరే ఆ రేపర్‌ని బ్యాగులో దాచి, ఇంటికెళ్లి చెత్తకుండీలో వేసేదాన్ని. పర్యావరణానికి మంచిది కాదని చిన్నప్పుడే టపాకాయలు కాల్చడం మానుకున్నా. నా పద్ధతి చూసి ఫ్రెండ్స్‌ నవ్వేవారు. కానీ ఆ అలవాట్లే నా కెరియర్‌ని మలుపు తిప్పాయి. మాది హైదరాబాద్‌. నాన్న బాబ్జీ బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేసేవారు. అమ్మ లక్ష్మి. పేరుకే గృహిణి కానీ మెషిన్‌ కుట్టేది, పచ్చళ్లు పెట్టి అమ్మేది. ఆమె ప్రభావం నాపై ఎక్కువ. చిన్నతనం నుంచీ సాంస్కృతిక కార్యక్రమాలంటే చాలా ఇష్టం. పాటలు పాడేదాన్ని. చిన్నచిన్న స్కిట్‌లు వేసేదాన్ని. ఆ ఆసక్తితోనే వీబీఐటీ కాలేజీలో బీటెక్‌ చదువుతున్నప్పుడు ఈకో క్లబ్‌ని ప్రారంభించా. ఈ కార్యక్రమాల్లో భాగంగా చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లి తడిచెత్త, పొడిచెత్త వేరు చేయమని ఉచితంగా డస్ట్‌బిన్‌లు ఇచ్చేవాళ్లం. వాళ్లు మాత్రం ‘ఆ తర్వాతైనా వాటిని కలిపేస్తారు కదా! ఏం ఉపయోగం’ అనేవారు. అప్పటికి నాకు ఆ ప్రశ్నలపై స్పష్టత లేదు. అదే సమయంలో ఐఎస్‌బీ వాళ్లు బీటెక్‌ విద్యార్థులకు వ్యాపార నైపుణ్యాలు తెలియాలని ఒక కోర్సుని మొదలుపెట్టారు. దానికి నేను ఎంపికయ్యా. తడిచెత్తను వేరుచేసి దానిని ఉపయోగపడేలా చేయాలన్నది నా ఆలోచన. ఐఎస్‌బీ సాయంతో... 2016 నుంచే తడిచెత్తను సేంద్రియ ఎరువుగా మార్చే ప్రొటోటైప్‌ మెషిన్‌ కోసం పనిచేయడం మొదలుపెట్టా. బీటెక్‌ అయ్యాక.. ఎంబీఏ చదివా. రెండో సంవత్సరంలో ఉండగా.. నాలానే ఆలోచించే సిద్దేష్‌ కూడా తోడవ్వడంతో 2020 నాటికి మా మెషిన్‌ తుదిరూపు దాల్చింది.

ఏడు రోజుల్లో ఎరువు..

మేం తయారు చేసిన యంత్రం.. తడి చెత్తని ఏడు రోజుల్లో ఎరువుగా మారుస్తుంది. ఏరోబిక్‌ పద్ధతిలో.. హానికారక మిథేన్‌ గ్యాస్‌ని వెలువరించకుండా ఎరువుని తయారుచేయడం దీని ప్రత్యేకత. సరిగ్గా ఈ యంత్రం మార్కెట్‌లోకి తీసుకొచ్చే సమయానికి కొవిడ్‌ తీవ్రత ఎక్కువ అయ్యింది. ఇండస్ట్రియల్‌ ఆక్సిజన్‌ కొరత ఉండటంతో మా పని కాస్త కుంటుపడింది. వప్రా పేరుతో 2022 నుంచీ మెషిన్ల తయారీ ఊపందుకుంది. మొదట్లో ఇంటి అవసరాలకు సరిపోయేలా, తర్వాత పారిశ్రామిక అవసరాలకు సరిపడేట్టు పెద్ద కంపోస్టర్లు తయారుచేశాం. కంపోస్టింగ్‌ తయారీకి అవసరమైన కల్చర్‌ పొడినీ అమ్ముతాం. మా ఐడియా నచ్చడంతో.. స్టార్టప్‌ ఇండియా, ఆర్‌కేవీవై రాఫ్తార్‌, వీహబ్‌లు అండగా నిలిచాయి. రూ.22 లక్షల ఫండింగ్‌ని అందించి ప్రోత్సహించాయి. తాజాగా ‘నేను సూపర్‌ ఉమెన్‌’ కార్యక్రమం నుంచీ రూ. పాతిక లక్షల పెట్టుబడులు అందాయి. ఇంతవరకూ 22 రాష్ట్రాల్లో.. 1500 యూనిట్లని అమ్మాం. చిన్న కంపోస్టర్ల ధర రూ.3,500, పెద్దవి రూ.లక్షన్నర వరకూ ఉంటాయి. ఉప్పల్‌లో ప్లాంట్‌ని మొదలుపెట్టాం. అక్కడి వెజిటబుల్‌ మార్కెట్‌ వ్యర్థాలను సేకరించి ఎరువుగా మారుస్తున్నాం. రోజుకి మూడు నుంచి ఐదు టన్నుల వ్యర్థాలను సేకరిస్తాం. ఏడాదిలో 1000 టన్నుల ఎరువుని తయారుచేసి దాన్ని రైతులకు, మిద్దె తోట పెంపకందారులకీ విక్రయించాం. హైదరాబాద్‌ పరిధిలోని మున్సిపాలిటీల నుంచి వచ్చే వ్యర్థాలనూ ఎరువుగా మార్చాలన్నది మా లక్ష్యం. కాలేజీలూ, ఇన్‌స్టిట్యూట్‌లలో కూడా కంపోస్టింగ్‌ని ప్రోత్సహిస్తూ... కమ్యూనిటీ కంపోస్టర్లని తయారుచేస్తున్నాం. త్వరలో నారాయణ కాలేజీలో ఏర్పాటు చేస్తున్నాం. ఇంతకు ముందు నేనే స్వయంగా కాలేజీలకు వెళ్లి సేంద్రియ ఎరువుల తయారీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేదాన్ని. కాలేజీల్లోనూ ఈ విషయంపై అవగాహన పెరగడంతో.. వాళ్లే స్వయంగా నన్ను పిలుస్తున్నారు. ఇది సంతోషమే కదా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని