ఆరువేల పాములు పట్టింది..!
అప్పుడే పుట్టిన ఎలుక పిల్ల.. పక్కన దాని తల్లి లేదు. పాపం అమ్మ లేదనుకొని దాని ఆలనాపాలనా చూసుకుందా అమ్మాయి. అప్పటికామెకి మూడేళ్లే! కానీ అలా మొదలైన ప్రేమ ఆమెతోపాటే పెద్దయ్యి.. మూగజీవులను కాపాడటమే లక్ష్యంగా మారింది.
అవంటే ఆమెకు ప్రాణం..
అప్పుడే పుట్టిన ఎలుక పిల్ల.. పక్కన దాని తల్లి లేదు. పాపం అమ్మ లేదనుకొని దాని ఆలనాపాలనా చూసుకుందా అమ్మాయి. అప్పటికామెకి మూడేళ్లే! కానీ అలా మొదలైన ప్రేమ ఆమెతోపాటే పెద్దయ్యి.. మూగజీవులను కాపాడటమే లక్ష్యంగా మారింది. ఇప్పుడామె తమిళనాడులో తొలి మహిళా ప్రొఫెషనల్ పాముల సంరక్షకురాలు. వేద ప్రియ.. ఆమెను మీరూ కలుసుకోండి...
‘అంగన్వాడీ నుంచి నన్ను తీసుకెళ్లడానికొచ్చే అమ్మకి ఆరోజు ఆలస్యమైంది. చుట్టూ చూస్తోంటే అప్పుడే పుట్టిన ఎలుక పిల్ల కనిపించింది. వాళ్లమ్మ లేకపోయేసరికి ఇంటికి తీసుకొచ్చేశా. దర్జీ దగ్గర కొన్ని వస్త్రాలు తెచ్చి ఊయల కట్టా. విత్తనాలు, పండ్లు పెట్టడం, ఆ ఊయల్లో పడుకోబెట్టి ఊపడం.. అది కనిపించకుండా పోయేవరకూ ఇదే నా దినచర్య. మూడేళ్లప్పుడు మొదలైన ఆ ప్రేమ ఇప్పటికీ కొనసాగుతోం’దనే వేదప్రియది చెన్నై. అప్పటివరకూ కుక్కలు, పిల్లులు లాంటి వాటితోనే ఆమె సావాసం. ఓసారి స్కూలు ట్రిప్‌లో భాగంగా స్నేక్ పార్క్‌కి తీసుకెళ్లారు. అక్కడ రకరకాల పాములను చూసి అందరూ భయపడితే వేదప్రియకు మాత్రం ఆసక్తి కలిగింది. సెలవులొస్తే ఆ స్నేక్‌పార్క్, జూలకు వెళ్లిపోయేది.
అప్పట్నుంచీ..
‘16 ఏళ్లుంటాయేమో! ఇంటి ముందు పెద్దగా అరుపులు. బయటికెళితే చాలామంది చేతిలో కర్రలతో కనిపించారు. పాముని చంపడానికి వెళుతున్నామన్నారు. నేనేమో రెస్క్యూవర్లను పిలుద్దామన్నా. వాళ్లొచ్చేసరికి ఎవరినైనా కాటేస్తుందని చంపేస్తామన్నారు. ఏమీ ఆలోచించకుండా వెళ్లి దాన్ని పట్టుకొని పరుగెత్తా. దగ్గర్లోని చెట్లలో వదిలేశా. అది పారిపోతుందనుకుంటే ఆగి, నా దగ్గరగా వచ్చి వెళ్లిపోయింది. అప్పుడు నాకది ధన్యవాదాలు చెప్పినట్లు ఆనందమేసింది. కానీ తాచుపాము..కాటేసుంటే ఏం చేసేదానివని అడిగారెవరో. నిజమే అనిపించిం’దనే ఈ 24 ఏళ్లమ్మాయి.. పాములను పట్టడంలో నైపుణ్యమున్న ‘ఇరులస్’ అనే తెగ వద్ద ప్రొఫెషనల్ ట్రైనింగ్‌నీ తీసుకుంది. 500 రకాల పాములను పట్టగలదు. చదువుతూనే సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా, బ్లూక్రాస్, వెస్ట్రన్‌ఘాట్ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్ (డబ్ల్యూజీడబ్ల్యూసీటీ) వంటి ఎన్నో జంతు సంరక్షణ కేంద్రాలకు వాలంటీర్‌గా చేసింది. ఇప్పుడు డబ్ల్యూజీడబ్ల్యూసీటీతోపాటు తమిళనాడు ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్‌కి ఛీఫ్ కోఆర్డినేటర్. తొలి ప్రొఫెషనల్ మహిళా సంరక్షకురాలిగా గుర్తింపు పొందిన తను వైల్డ్‌లైఫ్ రెస్క్యూవర్ కూడా.
క్షణం ఆలోచించదు..
ఎంతటి విషపూరిత పామునైనా వేగంగా పట్టేయగలదు. వీటితోపాటు తప్పిపోయిన, మనుషుల దాడిలో గాయపడిన క్రూరమృగాలను సంరక్షించి, వాటికి ప్రథమచికిత్స, కౌన్సెలింగ్ ఇచ్చి, అడవుల్లో వదిలిపెడుతుంది. అంతేకాదు చుట్టుపక్కల గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలనీ చేపడుతోంది. ‘ఈ భూమ్మీద మనతోపాటు మూగజీవులకీ సమానహక్కు ఉంది. కనిపించగానే కొట్టడం, దాడి చేయడం వల్లే అవి తిరగబడతాయి. కాబట్టి, వాటిని చూసినపుడు ఏం చేయాలి, పాము కాటుకి గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మృగాలనుంచి తప్పించుకోవడం వగైరా విషయాలను బోధిస్తున్నానంటోంది వేదప్రియ. 4వేలకుపైగా అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. ఎనిమిదేళ్లలో ఆరువేల పాములతోపాటు వేల జీవులనూ కాపాడింది. ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న ఈమె వృత్తిరీత్యా పెట్ స్టైలిస్ట్. జంతువులు ప్రమాదంలో ఉన్నాయంటే క్షణం ఆలోచించకుండా వెళుతుందనే పేరుందామెకు. వర్షాకాలంలో అయితే రోజుకు కనీసం 50 కాల్స్ వస్తుంటాయి. ‘మూగజీవులు నాకు పసిపిల్లలతో సమానం. పాములంటే ప్రేమెక్కువ. అందరూ భయపడినా వాటిల్లో నాకు అందం, అమాయకత్వం కనిపిస్తాయి. అందుకే చేత్తో పట్టుకోవడానికీ తడుముతూ భయం పోగొట్టడానికీ వెనకాడన’నే వేదప్రియను మొదట్లో ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నావని ఆపినవారే ఇప్పుడు ఊరికే గర్వకారణమని ప్రశంసిస్తున్నారు.
‘పాములన్నీ హాని చేయవు. నల్లతాచు, కట్లపాము, రక్తపింజర, ఇసుక పింజర వంటివే అత్యంత ప్రమాదం. గ్రామాల వాళ్లు.. రాత్రుళ్లు ఎక్కువగా వీటి బారిన పడతారు. మనలాగే అవీ భయపడతాయి అందుకే కాటేస్తాయి. కనిపించగానే కొట్టకుండా తలుపులు, కిటికీలు తెరిస్తే చాలు.. వాటంతటవే వెళ్లిపోతాయి’
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.