జీరో వేస్ట్‌ దుకాణం నడిపేస్తూ...

సూపర్‌ మార్కెట్‌ నుంచి నాలుగు సరకులు తెచ్చినా ఇల్లంతా ప్లాస్టిక్‌ కవర్లతో నిండిపోతుంది. ఈ వ్యర్థాలకు చెక్‌ పెట్టి, పర్యావరణానికి మేలు చేయాలని జీరోవేస్ట్‌ పద్ధతిలో సేంద్రియ పదార్థాల దుకాణాన్ని నిర్వహిస్తూ స్ఫూర్తిగా నిలుస్తోంది వరంగల్‌ అమ్మాయి నంబూరి స్వాతి.

Updated : 11 Aug 2023 13:02 IST

సూపర్‌ మార్కెట్‌ నుంచి నాలుగు సరకులు తెచ్చినా ఇల్లంతా ప్లాస్టిక్‌ కవర్లతో నిండిపోతుంది. ఈ వ్యర్థాలకు చెక్‌ పెట్టి, పర్యావరణానికి మేలు చేయాలని జీరోవేస్ట్‌ పద్ధతిలో సేంద్రియ పదార్థాల దుకాణాన్ని నిర్వహిస్తూ స్ఫూర్తిగా నిలుస్తోంది వరంగల్‌ అమ్మాయి నంబూరి స్వాతి..

ఆ దుకాణంలోకి వెళ్తే పాస్తా, నూడుల్స్‌, క్యాండీ ఇలా పిల్లలు ఇష్టపడే.. ఆధునిక చిరుతిళ్లన్నీ దొరుకుతాయి. ‘అమ్మో అవన్నీ మైదాతో చేసినవి కదా అంటారా? వాటిల్లో మైదా కానీ, నిల్వకారకాలు కానీ ఉండవు. పైగా రసాయనాలు వాడకుండా, సేంద్రియ పద్ధతిలో పండించినవి. స్వచ్ఛమైన చిరుధాన్యాలతో చేసిన పదార్థాలు. అంతేకాదు ఆ దుకాణంలో ప్లాస్టిక్‌ మచ్చుకు కూడా కనిపించదు. మట్టిపాత్రలు, గాజు, స్టీలు పాత్రలు మాత్రమే ఉంటాయి.

మసాలా దినుసుల నుంచి పప్పులు, ఉప్పులు ఏం కొనాలన్నా ప్లాస్టిక్‌ కవర్లలో ప్యాక్‌ చేయరు. కాగితపు సంచుల్లో లేదా సీసాల్లో రీఫిల్లింగ్‌ చేసి ఇస్తారు. ఈ దుకాణం నిర్వాహకురాలు స్వాతి వినియోగదారులకు సేంద్రియ పంటలతో కలిగే ప్రయోజనాలు, ప్లాస్టిక్‌తో వచ్చే కీడు గురించి వివరించి వస్త్రంతో చేసిన సంచులు తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. చదివింది బీఆర్క్‌ అయినా పర్యావరణంపై మక్కువతో ఈ దుకాణాన్ని ప్రారంభించి ‘జీరో వేస్ట్‌’ నినాదంతో వ్యాపారం సాగిస్తున్నారు. స్వాతి సోదరుడు సిద్ధార్థ బిట్స్‌లో ఇంజినీరింగ్‌ చదివి వ్యవసాయంపై మక్కువతో సేంద్రియ సాగు మొదలుపెట్టారు. స్వాతి కూడా ఆ బాటే పట్టి.. హనుమకొండ జిల్లా ఐనవోలు వద్ద 15 ఎకరాల్లో క్రిమి సంహారక మందులు వాడని సేంద్రియ సాగు మొదలుపెట్టింది. ఇక్కడ పండించిన ఆహార పదార్థాల్ని తన స్టోర్‌లోనే విక్రయిస్తున్నారు. అలాగే మహారాష్ట్ర కొల్హాపూర్‌ ప్రాంతంలో మహిళలు పండించిన సేంద్రియ పంటలనీ ఇక్కడ విక్రయిస్తోంది. ఇక్కడ 400 రకాల సేంద్రియ పదార్థాలు దొరుకుతాయి.నెలకు ఎనిమిది లక్షల రూపాయల వరకూ అమ్మకాలు జరుగుతాయి అంటోంది స్వాతి.

- గుంటూరు ప్రియాంక, ఈజేఎస్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని