చరిత్ర పాఠాలు చెప్పేస్తున్నారు!
చరిత్ర అంటే ‘యుద్ధాలు, దాడులు.. వాటి సంవత్సరాలు, తేదీలు బట్టీకొట్టి పరీక్షల్లో రాయడమే’ అనే భావన కొందరు పిల్లలది. దానికి తగ్గట్టు వాళ్లని కాసేపు దగ్గర కూర్చోపెట్టుకుని మన దేశ చరిత్ర, గొప్పతనం, స్వాతంత్య్ర సమరయోధుల జీవితాల గురించి చెప్పే బామ్మలు, తాతయ్యలూ కూడా తగ్గుతున్నారు.
చరిత్ర అంటే ‘యుద్ధాలు, దాడులు.. వాటి సంవత్సరాలు, తేదీలు బట్టీకొట్టి పరీక్షల్లో రాయడమే’ అనే భావన కొందరు పిల్లలది. దానికి తగ్గట్టు వాళ్లని కాసేపు దగ్గర కూర్చోపెట్టుకుని మన దేశ చరిత్ర, గొప్పతనం, స్వాతంత్య్ర సమరయోధుల జీవితాల గురించి చెప్పే బామ్మలు, తాతయ్యలూ కూడా తగ్గుతున్నారు. వీళ్లు.. ఆ లోటుని పూడుస్తూ బోర్ అన్న చరిత్రనే ఆసక్తిగా వివరిస్తూ, లక్షలకొద్దీ ఫాలోయర్లని సంపాదించుకున్నారు...
వాట్సప్ యూనివర్సిటీ అంటారు..
కీర్తి
అరనిమిషం వ్యవధిలోనూ చరిత్ర పాఠాలని ఆసక్తిగా వివరించే గొప్పతనం కీర్తిది. కాబట్టే యూట్యూబ్‌లో ఆమెకు 13 లక్షలమంది ఫాలోయర్లు ఉన్నారు. తమిళనాడుకు చెందిన కీర్తి హిస్టరీ విద్యార్థిని. కానీ తాను విన్న చరిత్ర పాఠాలన్నీ షుగర్ కోటింగ్ పిల్స్‌లా మాయ చేసేవే.. అందులో నిజాలని బయట పెట్టాలనే సామాజిక మాధ్యమాల్లో అడుగుపెట్టానంటోందీ అమ్మాయి. ‘ఆర్కియాలజిస్ట్ కావాలనుకున్నా. వీలుపడలేదు. మెడికల్ సీట్ వచ్చినా.. చరిత్ర మీద ఇష్టంతో వదులుకున్నా. కానీ చాలా ప్రశ్నలకు సంబంధించి సమగ్రమైన సమాచారం దొరికేది కాదు. ఓ సెమిస్టర్‌లో.. చెన్నైలోని కూవం నది గురించి రాయమని ప్రశ్న వచ్చింది. ఏం రాయాలి? ఎందుకంటే అది డ్రైనేజీనో, నదో సగం మందికి తెలియదు. అందరూ దాన్ని మురికి కాలువ అనుకుంటారు. ఈ చిన్న విషయంలోనే మనకి వాస్తవం తెలియకపోతే చరిత్రలో మనం చదువుకున్న దాంట్లో నిజమెంత అనిపించింది. తక్కిన దేశాల విజయాలని గొప్పగా చెప్పుకొనే మనం, మన భారతీయులు ఏం సాధించినా దాన్ని ‘వాట్సప్ యూనివర్సిటీ పరిజ్ఞానం’ అని ఎగతాళి చేస్తాం. అందుకే మన సంస్కృతి గొప్పతనాన్ని అందరికీ చెప్పాలని ప్రయత్నిస్తున్నా. అమ్మానాన్నలు కూడా నేను కార్పొరేట్ ఉద్యోగంలో స్థిరపడటం కన్నా, నచ్చిన పని చేయడాన్నే ప్రోత్సహించార’నే కీర్తికి ఇన్‌స్టాలోనూ నాలుగున్నర లక్షలమంది అభిమానులున్నారు. ఆసక్తి ఉన్నవారికి కొన్ని హిస్టరీ కోర్సులనీ అందిస్తోందీమె.
ఆట కాదు.. అనుభవసారం
కుద్రత్ సింగ్
‘చరిత్రంటే పేర్లు, సంవత్సరాలు, ప్రదేశాలను గుర్తుంచుకునే మెమరీ గేమ్ అనడం చాలాసార్లు విన్నా. ఇంకొన్నిసార్లు బోర్.. పేజీలు పేజీలు చదవాలి. ఏదైనా పొరపాటున మర్చిపోయామో మార్కులు గల్లంతే అంటారు. నేను పుట్టకముందు వాళ్ల కథలు, చేసిన పనులు, కట్టడాల సంగతి మనకెందుకు అని ప్రశ్నిస్తారు. అసలు మనల్ని నడిపే మార్గమదన్న విషయాన్నే మర్చిపోతున్నారు. ఫ్యాషన్ దగ్గర్నుంచి, కొత్త చట్టాల రూపకల్పన వరకూ ప్రతిదీ చరిత్ర ఆధారంగానే జరుగుతాయి. మన పూర్వీకుల నిర్ణయాలు, తప్పిదాలు ప్రతిదీ మనకు పాఠాలే. అందుకే దీన్ని ఓ ఆటగా, సబ్జెక్టుగా మాత్రమే చూడటం నచ్చలేదు. దీనిపై ఆసక్తి కలిగించాలనే స్నేహితుడితో కలిసి 2019లో ఇన్‌స్టాలో ‘ఇతిహాసాలజీ’ ప్రారంభించా’మంటుంది 25 ఏళ్ల కుద్రత్. ఈమెది హరియాణ. దిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ ఆనర్స్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో మాస్టర్స్ చేసింది. 350 పదాల్లోపు తేలిగ్గా అర్థమయ్యేలా బొమ్మలు, ఫొటోలు, సంభాషణల రూపంలో ఆంగ్లంలో చరిత్ర పాఠాలను బోధించడం వీళ్ల ప్రత్యేకత. పాడ్‌కాస్ట్, వీడియో సిరీస్‌లనూ పెడుతుంటారు. ప్రతినెలా హెరిటేజ్, మ్యూజియం వాక్‌లు, వర్క్‌షాప్‌లూ నిర్వహిస్తుంటారు. విద్యార్థులకు సహకరించేలా ‘ద ఇతిహాసాలజీ జర్నల్’ పేరుతో డిజిటల్ మ్యాగజీన్‌నీ ప్రచురిస్తున్నారు. దీన్ని దాదాపు 70 వేలమంది అనుసరిస్తున్నారు.
సంస్కృతిని మర్చిపోవద్దనీ..
అనౌష్క జైన్
‘సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా పెరిగిన టొమాటో ధరపై చర్చలు, ఇంకా మీమ్సే కదూ! ఇది మన దేశానికి పోర్చుగీసు నుంచి వచ్చిందని తెలుసా? మొగలులు దీన్ని ‘విదేశీ బేంగన్’ అంటే విదేశీ వంకాయ అనేవారట. అకస్మాత్తుగా యమున ఇలా ఎందుకు ఉప్పొంగుతోంది? దిల్లీలో ఒకటికి మించి కుతుబ్‌మినార్‌లు ఉన్నాయని తెలుసా? మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా మైసూర్ శాండల్ సబ్బు తయారైంది..’ ఇలా తాజా అంశాలను ముడిపెట్టి చరిత్రను చెప్పడం అనౌష్క ప్రత్యేకత. ఈమెది దిల్లీ. చర్రితలో పీజీ చేసిన తను 2019లో ‘ఎన్‌రూట్ ఇండియన్ హిస్టరీ’ సంస్థను ప్రారంభించింది. దీని ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో దిల్లీలో పురాతన కట్టడాలు, వాటి చరిత్రను చెబుతుంది. దీన్ని దాదాపు లక్షమంది అనుసరిస్తున్నారు. అలాగే వాటిని సందర్శించాలన్న ఆసక్తి ఉన్నవారికి వాక్స్, టూర్స్‌నీ నిర్వహిస్తోంది. నైట్‌వాక్స్, లేడీస్ నైట్‌వాక్స్ వంటివి సంస్థ ప్రత్యేకత. దూరం ప్రయాణించలేని వారికోసం డిజిటల్ వాక్‌లనీ నిర్వహిస్తోంది. ‘దూరంగా ఉన్న ప్రదేశాల చరిత్ర తెలియలేదంటే సరే! కానీ ఉంటోన్న నగరాలు, వాటి విశేషాలూ తెలుసుకోకపోవడం గమనించా. అందుకే ఈ దారిని ఎంచుకున్నా. కేవలం మాటలతో అందాన్ని ఎంత వర్ణించినా సరిపోదు. అందుకే ఇలాంటి చిన్న చిన్న పర్యటనలు ప్లాన్ చేస్తున్నా’ అంటోందీమె.
ఆహ్వానం
వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.