నీటితోనే పెంచేయొచ్చు!

ఇంటికి అందం, మనసుకి హాయినిస్తాయి మొక్కలు. కానీ పెంచడమే చాలామందికి తలనొప్పి. అందుకే ఎంత కోరిక ఉన్నా.. వెనకడుగేస్తుంటారు.

Published : 20 May 2022 00:46 IST

ఇంటికి అందం, మనసుకి హాయినిస్తాయి మొక్కలు. కానీ పెంచడమే చాలామందికి తలనొప్పి. అందుకే ఎంత కోరిక ఉన్నా.. వెనకడుగేస్తుంటారు. నీళ్లు, తక్కువ నిర్వహణతో పెంచే వీలుంటే? అలాంటి మొక్కల్ని చూసేయండి.

* మనీప్లాంట్‌.. ఫిలోడెండ్రాన్‌గానూ పిలిచే ఇది అందరికీ సుపరిచితమే. చిన్న కొమ్మను తెచ్చి నీళ్లలో పెట్టినా వేర్లు సులువుగా వచ్చేస్తాయి. వారానికోసారి నీరు మారిస్తే సరిపోతుంది. ఆకులు తెల్లగా అవుతున్నాయి అనిపిస్తే నెలకోసారి నీటిలో కరిగే క్యాల్షియం, మెగ్నీషియంను వేస్తే చాలు. పురుగులు, కీటకాల బెడద తక్కువే. ఒకవేళ కనిపించినా నిమ్మ నూనె లేదా డిష్‌వాష్‌ లిక్విడ్‌ను నీటితో కలిపి స్ప్రే చేస్తే చాలు.


* వాండరింగ్‌ జ్యూ.. ఆకులు వంగపూవు రంగులో.. కొన్నిసార్లు ఆకుపచ్చ లేదా తెలుపు గీతలతో అందంగా ఉంటుందీ మొక్క. కణుపుల దగ్గర ఆకుల్ని తీసేసి నీటిలో ఉంచితే చాలు వారం రోజుల్లో వేర్లు వచ్చేస్తాయి. కాకపోతే 2-3 రోజులకోసారి నీటిని మార్చాలి. ఈ మొక్కలకు ఎక్కువ తేమ ఉంటే ఆరోగ్యంగా పెరుగుతాయి. రోజూ కొంచెంసేపు ఎండలో ఉంచి ఆపై ఇంట్లో పెడితే సరిపోతుంది. నెలకోసారి లిక్విడ్‌ ఫెర్టిలైజర్‌ని చాలా తక్కువ మోతాదులో అందిస్తే సరిపోతుంది.


* ఇంగ్లిష్‌ ఐవీ.. నక్షత్రాకారపు ఆకులు దీని ప్రత్యేకత. ఎక్కువ వెలుతురు, ఎండ నేరుగా ఉండని ప్రదేశాల్లో ఉంచితే చక్కగా పెరుగుతుంది. రెండు వారాలకోసారి నీటిని మారిస్తే చాలు. ఎయిర్‌ ప్యూరిఫయింగ్‌ ప్లాంట్‌ గానూ దీనికి పేరు.


* వెదురు.. లక్కీ ప్లాంట్‌, లక్కీ బ్యాంబూ అనీ పిలుచుకుంటాం. వేర్లు మునిగేంత నీరు ఉన్న పాత్రలో మొక్కను ఉంచి వారానికోసారి నీటిని మారిస్తే చాలు. క్లోరిన్‌ లేని నీరు అంటే... ఫిల్టర్‌ చేసినవే వాడాలి. లేదూ 24 గంటలపాటు ట్యాప్‌ నీటిని ఆరుబయట ఉంచి అయినా పోయొచ్చు. నెలకోసారి తక్కువ గాఢత గల లిక్విడ్‌ ఫెర్టిలైజర్‌ని ఒకటి లేదా రెండు చుక్కలు వేస్తే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. వీటి కోసం ప్రత్యేకంగా దొరుకుతాయి కూడా! రెండు వారాలకోసారి ఎండ నేరుగా తగలని ప్రదేశంలో బయట ఉంచడం మేలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్