ఆ వాసనలతో జాగ్రత్త!

పాపకి ఆస్థమా, బాబుకి స్కిన్‌ అలర్జీ... ఇలాంటి మాటలు ఇప్పుడు దాదాపు ప్రతి ఇంటా వినిపిస్తున్నాయి. వీటికి కారణం కాలుష్యమని తెలుసా? అది కూడా ఇంట్లో ఉండే కాలుష్యమే. నమ్మలేకపోతున్నారా? అయితే వివరాల్లోకి వెళ్దాం పదండి.

Published : 31 Jul 2022 02:10 IST

పాపకి ఆస్థమా, బాబుకి స్కిన్‌ అలర్జీ... ఇలాంటి మాటలు ఇప్పుడు దాదాపు ప్రతి ఇంటా వినిపిస్తున్నాయి. వీటికి కారణం కాలుష్యమని తెలుసా? అది కూడా ఇంట్లో ఉండే కాలుష్యమే. నమ్మలేకపోతున్నారా? అయితే వివరాల్లోకి వెళ్దాం పదండి.

దుమ్మూధూళీ, మట్టి, పలు రకాల వాయువులు, రసాయనాలు, కర్బన పదార్థాలు గాల్లో కలవడమూ; వంట, పరిశుభ్రత, అలంకరణ కోసం వాడే పరికరాలూ.. ఇంట్లో కాలుష్యానికి కారణం. వీటి దుష్ప్రభావం పిల్లల మీద ఎక్కువ. ఎందుకంటే వారిలో ఊపిరితిత్తులు అభివృద్ధి దశలో ఉంటాయి. ప్రధానంగా ‘వోలటైల్‌ ఆర్గానిక్‌ కంపౌండ్స్‌’ లేదా ‘వీఓఎస్‌’లే ఈ కాలుష్యానికి కారణం. సింథటిక్‌ పెయింట్లు, సిగరెట్‌ పొగ, కొత్త ఫర్నిచర్‌, నిర్మాణ పరికరాలు, ఎయిర్‌ ఫ్రెష్‌నర్లు, ఇంకా బూజులాంటి వాటి కారణంగా ఇవి ఇంట్లోకి వచ్చి తలనొప్పి వంటివే కాక క్యాన్సర్లకు దారితీసే అనేక అలర్జీలకు కారణమవుతాయి. డిటర్జెంట్లు, కార్పెట్‌, అవెన్‌ క్లీనర్లు, కృత్రిమ జిగుర్లు, పురుగు మందుల్లోనూ వీఓఎస్‌లు ఉంటాయి. వీటిని వాడినపుడు అవి గాల్లో సులభంగా కలుస్తాయి.

తగ్గించుకోవడం ఎలా?

* ఇంట్లో పొగతాగడాన్ని నిషేధించండి.

* సువాసనల కోసం వాడే రసాయన ఉత్పత్తులకు చెక్‌ పెట్టండి.

* సహజ రంగులకే ప్రాధాన్యం ఇవ్వండి.

* చెక్కతో చేయని ఫర్నిచర్‌ తెచ్చినపుడు కొన్ని వారాలు వాటికి గాలీ వెలుతురూ ధారాళంగా తగిలేలా చూసుకోండి.

* కార్పెట్లు, ఫర్నిచర్‌, ఫ్లోరింగ్‌ శుభ్ర పరిచేందుకు రసాయనాలను వాడొద్దు.

* శుభ్రత కోసం అలర్జీ ఫ్రీ ఉత్పత్తులు తీసుకోండి. స్ప్రేలకంటే లిక్విడ్‌లు కొంత నయం. శుభ్రతకు సంబంధించిన ఉత్పత్తులకు పిల్లల్ని దూరంగా ఉంచండి.

* కొవ్వొత్తులూ, అగరొత్తుల నుంచీ వీఓఎస్‌లు విడుదలవుతాయి. అందుకే వీటి వాడకం తగ్గించాలి. తప్పనిసరై వాడినా చిన్నగదిలో ఎక్కువ మొత్తంలో పొరపాటున కూడా పెట్టొద్దు.

కుక్కర్లు, స్టవ్‌లూ, హీటర్ల నుంచి కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రోజెన్‌ ఆక్సైడ్‌, సల్ఫర్‌ డయాక్సైడ్‌ వెలువడతాయి. వీటితో తలనొప్పితో పాటు జలుబు లాంటివీ వస్తుంటాయి. ఈ పరికరాలు ఉన్నచోట ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లను కచ్చితంగా పెట్టడంతోపాటు వాటిని సకాలంలో సర్వీస్‌ చేయించండి. మృత చర్మం, ధూళి కణాలూ.. శ్వాస సమస్యలూ, ఆస్థమాకు కారణాలు. తలగడలూ, పరుపులూ, కార్పెట్లూ, సోఫాలూ, కుర్చీలపైనుండే మెత్తని క్లాత్‌.. వీటిపైన ఇవి ఎక్కువగా పేరుకు పోతాయి. వీటిని వాక్యూమ్‌ క్లీనర్లతో శుభ్రం చేయాలి. పెంపుడు జంతువుల్ని వీటిపైకి వెళ్లకుండా చూడాలి. ఇంట్లో గాలీ వెలుతురూ బాగా ఉండేట్టు చూసుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని