మెరుపుల జలతారులు...
గది గుమ్మాలకు కర్టెన్ల స్థానంలో ఇప్పుడు పూసల జలతారులొచ్చాయి. వర్ణభరితంగా మెరిసిపోతూ ఇంటికి కొత్త కళను తెచ్చిపెడుతున్న వీటి ఎంపిక చూద్దాం.
గది గుమ్మాలకు కర్టెన్ల స్థానంలో ఇప్పుడు పూసల జలతారులొచ్చాయి. వర్ణభరితంగా మెరిసిపోతూ ఇంటికి కొత్త కళను తెచ్చిపెడుతున్న వీటి ఎంపిక చూద్దాం.
ప్రకృతి దృశ్యాలు, వెదురుపొదలు, కిలకిలా రావాలు చేస్తున్నట్లుండే రంగు రంగుల పక్షులు, గులాబీ గుత్తులు వంటి డిజైన్లు ఉన్న బ్యాంబూ సీడ్ కర్టెన్స్ గుమ్మాలకు చక్కటి ఎంపిక అవుతాయి. వీటిని బాల్కనీ మార్గంలో కూడా కట్టుకోవచ్చు. ఇవి ముచ్చటగా ఉండటమే కాదు, అక్కడి మొక్కలు ఈ పూసల తెర మధ్య నుంచి అస్పష్టంగా కనిపిస్తూ హాల్‌కు కొత్తదనాన్నిస్తాయి. అలాగే ఇంటీరియర్ మొక్కలు లేని గదులకు ప్రకృతి దృశ్యాలున్న తెరలను ఎంచుకుంటే గదంతా పచ్చదనాన్ని నిండినట్లు కనినిస్తాయి. పడకగదికి పూలున్నవి తీసుకుంటే ఆహ్లాదాన్నీ పంచుతాయి.
వర్ణభరితంగా..
రంగురంగుల్లో చిన్నాపెద్ద గాజుబీడ్స్ తెరలు బాల్కనీకి సరిపోతాయి. వెలుతురు పడినప్పుడల్లా సప్తవర్ణాల్లో మెరుస్తూ గాలికి ఊగుతూ చూడటానికి బాగుంటాయి. మధ్యాహ్న సమయాల్లో వీటిని పక్కకు జరుపుకొనేలా వేలాడదీస్తే ఎండ ప్రభావం వాటిపై పడదు. అలాగే ఈ గాజు బీడ్స్ తెరలిప్పుడు ఆర్చ్ ఆకారంలోనూ దొరుకుతున్నాయి. బాల్కనీ మార్గంలో లేదా హాల్ గుమ్మానికి బయటివైపు వేలాడదీస్తే కొత్త కళ వస్తుంది.
బంగారంలా..
ఇంటీరియర్ డిజైనర్లు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే గోల్డ్ ప్లేటెడ్ బీడ్స్ కర్టెన్లు ఇంటికంతటికీ ప్రత్యేకతను తెస్తాయి. పడకగది, హాల్‌కు మధ్య లేదా గదుల విభజన కోసం వీటిని అమర్చుకోవచ్చు. బంగారు వర్ణం బీడ్స్‌తో ముదురు, లేత వర్ణం గాజు పూసల కలయిక పగలూ, రాత్రి మెరుపులీనుతూ.. కంటికింపుగా ఉంటాయి. పెద్దగా ఫర్నిచర్‌లేని హాల్‌ను నిండుగా కనిపించేలా చేయాలంటే కిటికీలకు వీటిని తగిలిస్తే చాలు... నిండుదనాన్నిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.