సహజ రంగుల హోలీ... వసంతాల కేళి!

మోడువారిన శిశిరానికి వీడ్కోలు పలుకుతూ... అందాల పూలతో విరిసిన  వసంతానికి స్వాగతం చెబుతూ... ఆటపాటలతో ఆనందోత్సాహాలతో జరుపుకొనే రంగుల పండగే హోలీ...  ఆ రోజున ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ పూసుకుంటూ ఎటుచూసినా సంతోషాల వెల్లువలే.

Updated : 24 Mar 2024 04:15 IST

మోడువారిన శిశిరానికి వీడ్కోలు పలుకుతూ... అందాల పూలతో విరిసిన  వసంతానికి స్వాగతం చెబుతూ... ఆటపాటలతో ఆనందోత్సాహాలతో జరుపుకొనే రంగుల పండగే హోలీ...  ఆ రోజున ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ పూసుకుంటూ ఎటుచూసినా సంతోషాల వెల్లువలే. అంతా ఆ రంగుల మహిమే. అయితే,  ఈ సరదా సమయంలో వాడే కృత్రిమ వర్ణాలు ఆరోగ్యానికీ, అందానికీ ఎంత మాత్రం మంచిది కాదు. అందుకే ఇంట్లోనే సహజ రంగుల్ని తయారు చేసుకుందామా!

రంగుల హోలీ వెనక చాలా కథలే ఉన్నాయి. హోలిక అనే రాక్షసిని చంపినందుకనీ, శివుడి ఆగ్రహానికి గురైన మన్మథుడు మరణించిన రోజునీ(అసందర్భ కామాన్ని దహించి వేయడానికి గుర్తుగా కామదహనం) ఈ వేడుక జరుపుకొంటారు. వీటితో పాటు రాధాకృష్ణుల ప్రేమకు ప్రతీకగానూ కొన్ని ప్రాంతాల్లో హోలీ ఆడుతుంటారు.

ఇక, శాస్త్రీయ కారణాలను ప్రస్తావిస్తే వసంత కాలంలో చలి పోయి వేడి గాలులతో వాతావరణం మారిపోతుంది. దీనివల్ల వైరల్‌ జ్వరాలు, జలుబు, దగ్గు వంటివి చుట్టుముడుతుంటాయి. కాబట్టి ఈ హోలీ రోజున ఔషధ గుణాలున్న ఆకులు, పూలు, బెరడు, కాయలు, పండ్లతో తయారు చేసిన రంగులతో ఆడితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని చెబుతారు. కాలక్రమంలో కృత్రిమ రంగులొచ్చాయి. కానీ, ఆరోగ్య స్పృహ పెరగడంతో సహజ రంగుల్నే నేటితరం ఇష్టపడుతోంది.


పసుపు: దీని కోసం పసుపు కొమ్ములను, వంటలకు వాడే పసుపునీ వాడుకోవచ్చు. ఇందులోనే కాస్త లేత రంగు కావాలంటే బియ్యప్పిండికీ, ముదురు ఛాయని కోరుకుంటే సెనగపిండికీ పసుపుని కలిపితే సరి.  లేదంటే బంతి, చామంతి పూలను ఎండబెట్టి పొడి చేసుకున్నా, వాటిని నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను వాడినా ఈ రంగే వస్తుంది.

కాషాయం:  మోదుగ పూలను నీళ్లలో నానబెట్టి, ఉడికించి వాడుతుంటారు. అవి దొరక్కపోతే కమలా తొక్కల్ని ఎండబెట్టి పౌడర్‌ చేసి కాషాయ రంగుగా ఉపయోగించొచ్చు. 

ఎరుపు: దీనికోసం సహజంగా తయారు చేసుకున్న కుంకుమను వాడుకోవచ్చు. దీని పరిమాణం పెంచడానికి బియ్యప్పిండికి చేర్చండి. లేదంటే మందార పూలను ఎండబెట్టి పొడి చేయొచ్చు. గోగు పూలతోనూ ఎరుపు రంగును తేవొచ్చు.

ఆకుపచ్చ : పాలకూరను శుభ్రంగా కడిగి నీళ్లల్లో ఉడకబెట్టి రంగు తీయండి. దీన్ని వడకట్టి కాస్త బియ్యప్పిండి కలిపి ఆరబెడితే గ్రీన్‌కలర్‌గా వినియోగించొచ్చు. లేదంటే ఆ నీళ్లనే నేరుగా చల్లుకోవచ్చు కూడా. కాదంటే ఈ ఆకుకూరతో పాటు బచ్చలికూర, కొత్తిమీర, కరివేపాకు వంటివాటిని ఎండబెట్టి పొడి చేసినా మేలే.

గులాబీ: ఈ రంగుకోసం బీట్‌రూట్‌ని మించింది లేదు. దీన్ని సన్నగా తరిగి ఎండబెట్టి పొడి చేసుకుంటే నేరుగా వాడుకోవచ్చు. అలాకాకుండా మెత్తగా నూరుకుని రసాన్ని వడకట్టి వినియోగించొచ్చు. ముదురు ఛాయ కావాలనుకుంటే ఆ నీటిని మరిగించి బియ్యప్పిండిలో కలిపి ఆరబెడితే సరి. అదీ లేదంటే కార్న్‌ఫ్లోర్‌లో కాస్త రోజ్‌వాటర్‌, బీట్‌రూట్‌ రసం కలిపినా మంచి గులాబీ ఛాయలు వస్తాయి.

ఊదా రంగు: నల్ల ద్రాక్ష పళ్ల రసాన్ని బియ్యప్పిండిలో పోసి కలిపితే మీరు కోరుకున్న ఊదా వచ్చేస్తుంది.

నీలి రంగు: శంఖు పుష్పాల నుంచి ఈ కలర్‌ని తీయొచ్చు. ఈ పూలను ఎండబెట్టి పొడిలా చేసి వాడొచ్చు లేదా మరిగించి బియ్యప్పిండిలో కలిపి చల్లుకోవచ్చు. 


ఈ వర్ణాలను ఉపయోగించడం వల్ల ఒంటికి పట్టిన కలర్‌ త్వరగా వదిలిపోవడమేకాదు... జుట్టు, కళ్లు, చర్మం వంటివాటికి ఎలాంటి హానీ ఉండదు. 

జాగ్రత్తలిలా: ఎక్కువ సేపు నీళ్లల్లో తడవడం, రంగు చల్లుకోవడం వల్ల చర్మం అలర్జీలకూ, ట్యాన్‌కీ గురవ్వకుండా మాయిశ్చరైజర్‌, ఎస్‌పీఎఫ్‌ 30 ఉన్న సన్‌స్క్రీన్‌లోషన్‌ రాసుకోవాలి. ఆడుకోవడం అయ్యాక పెసరపిండి, పాలు, తేనె కలిపిన మిశ్రమంతో రంగులు వదిలించి స్నానం చేయండి. కలర్స్‌ ప్రభావానికి జుట్టు పొడిబారి, రాలిపోతుంది. ఈ పరిస్థితి రాకుండా సమపాళ్లలో ఆలివ్‌, కొబ్బరి నూనెల్ని కలిపి తలకు రాయాలి. హోలీ అయ్యాక కొన్ని రోజుల పాటు హెయిర్‌ట్రీట్‌మెంట్ల జోలికి వెళ్లకూడదు. కుంకుడు, శీకాయ మిశ్రమంతో మాత్రమే తలస్నానం చేయాలి. కళ్లకు రక్షణగా అద్దాలు, ఒంటిని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించడం మేలు.


తొలి మహిళ

హోమీ వ్యారావాలా... భారతదేశ తొలి ఫొటో జర్నలిస్టు.. ఎంతోమంది జాతీయ నాయకుల్నీ, బ్రిటిష్‌ కాలం నాటి వైభవాన్నీ తన కెమెరాతో అద్భుతంగా బంధించిన ఘనత ఆమె సొంతం. ఆమె సేవకుగానూ కేంద్రప్రభుత్వం రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది. అంతేకాదు, ‘ఫస్ట్‌ లేడీ ఆఫ్‌ ది లెన్స్‌’ అనే పేరునీ సంపాదించుకున్నారీమె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్