లక్ష్యంతోపాటు ఆర్థిక ప్రణాళిక..

సుమతి ఉద్యోగంలో చేరి ఆరునెలలైంది. వచ్చిన జీతంలో కొంతైనా పొదుపు చేయలేకపోయింది. కెరియర్‌లో ఉన్నతస్థాయికి చేరాలనే కాదు.. ఆర్థికంగా బలంగా ఉండాలనే లక్ష్యాన్ని కూడా పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. విద్యార్థినిగా ఉత్తీర్ణత సాధించాలనేది ప్రతి ఒక్కరికీ ఉండే లక్ష్యమే. విద్యార్థి దశ నుంచి ఉద్యోగినిగా మారిన తర్వాత బాధ్యతలు మొదలవుతాయి....

Published : 06 Aug 2022 00:52 IST

సుమతి ఉద్యోగంలో చేరి ఆరునెలలైంది. వచ్చిన జీతంలో కొంతైనా పొదుపు చేయలేకపోయింది. కెరియర్‌లో ఉన్నతస్థాయికి చేరాలనే కాదు.. ఆర్థికంగా బలంగా ఉండాలనే లక్ష్యాన్ని కూడా పెట్టుకోవాలంటున్నారు నిపుణులు.

విద్యార్థినిగా ఉత్తీర్ణత సాధించాలనేది ప్రతి ఒక్కరికీ ఉండే లక్ష్యమే. విద్యార్థి దశ నుంచి ఉద్యోగినిగా మారిన తర్వాత బాధ్యతలు మొదలవుతాయి. వాటిని సమన్వయం చేసి ముందడుగు వేయాలంటే ఆర్థికప్రణాళిక తప్పని సరి. దీనికి ముందు నుంచే నిర్దిష్టమైన ఆలోచనలు, లక్ష్యాలుండాలి. వీటిని సాధించడం కోసం ప్రయత్నించాలి. ఆర్థికంగా ఎలా నిలబడాలనే అంశంపై అవగాహన పెంచుకోవాలి. వచ్చే జీతంతోనే ఎంతవరకు పొదుపు చేయగలం లేదా చేయాలనేదానిపై నిర్థిష్టమైన స్పష్టత తెచ్చుకోవాలి. వీటన్నింటినీ తెలుసుకోవడానికి పుస్తకాలు చదవాలి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చదివే అవకాశాలెన్నో ఉన్నాయి. కొద్దిగా కష్టపడితే వీటి నుంచి కావాల్సిన నైపుణ్యాలను పొందొచ్చు.

బడ్జెట్‌ వేయండి..

ప్రతి నెలా పొదుపు ప్రణాళిక వేసుకోవాలి. ఎంత పొదుపు చేయాలనుకుంటున్నారో ఒక పక్క రాయాలి. ప్రతి నెలకీ బడ్జెట్‌ ఉండాలి. ఒక పుస్తకంలో ఆదాయం, వ్యయం విడివిడిగా రాయాలి. ఏయే అవసరాలకు ఎక్కువ ఖర్చు అవుతుందో నోట్‌ చేయాలి. వాటిలో ఏది అత్యవసరం, నిత్యావసరం అనే వాటిని విడదీయాలి. ఇవి కాకుండా అనవసరంగా ఖర్చు పెడుతున్న వాటిని విడిగా రాసి, వీటికి దూరంగా ఉండాలనుకోవాలి. అనవసరపు షాపింగ్‌లు లేదా పార్టీలు వంటివి తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. నెల తర్వాత అనుకున్న దాన్ని పాటిస్తున్నామా లేదా పరిశీలించుకోవాలి. అనుకున్న బడ్జెట్‌ కన్నా ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండటానికి కృషి చేయాలి. ఇలా క్రమంగా రెండు మూడు నెలలకు ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. ఇది పొదుపు చేసేలా ప్రోత్సాహాన్ని అందిస్తుంది.  

పొదుపు..

జీతం నుంచి ఎంతో కొంత పొదుపు చేయాలనుకోవడంకన్నా, దేని కోసం ఎంత చేయాలన్న విషయంలో స్పష్టత ఉండాలి. ఇల్లు, స్థలం కొనడం లేదా ఇంటి అవసరాల్లో ఏదో ఒకదాన్ని తీర్చడం కోసం... ఇలా ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి. చిన్న, పెద్ద లక్ష్యాలను విడదీసుకోవాలి. వీటికి కావాల్సిన నగదు, ప్రతి నెలా ఎంత పొదుపు చేస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చు అనేదానిపై అవగాహన ఉండాలి. ఆ ప్రకారం పొదుపు చేయడానికి అనవసర ఖర్చులు క్రమేపీ తగ్గించుకోవాలి. అప్పుడే లక్ష్యాలను చేరుకోవచ్చు. ఆర్థిక ప్రణాళికలో అభిరుచికీ స్థానమివ్వాలి. హాబీలు, పర్యాటకం, ఇతరులకు సాయం వంటి వాటి కోసమూ బడ్జెట్‌లో కేటాయిస్తే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని