Updated : 16/03/2021 18:48 IST

‘పొదుపు’ గెలిచింది!

అయితే కూలిపని... లేకపోతే బీడీలు చుట్టడం ఇవి మాత్రమే తెలిసిన వారి జీవితాల్లో వెలుగుపూలు పూయించింది పొదుపు మంత్రం. కామారెడ్డి జిల్లాలోని ఉగ్రవాయి గ్రామానికి చెందిన ఓ చిన్న పొదుపు సంఘం సాధించిన విజయం దేశవ్యాప్తంగా ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతోంది. ఆ గెలుపు కథ ఏంటో మనమూ తెలుసుకుందాం..
ఏదైనా కూలీ పని దొరికితే ఆ రోజు వాళ్లకి పండగే. ఎందుకంటే ఆ రోజుకి పస్తులు ఉండాల్సిన అవసరం లేదు మరి. కానీ సాగునీటి వసతుల లేమి కారణంగా ఆ కూలీ దొరకడం కూడా గగనమయ్యేది వాళ్లకి. అలా వరసగా పనిలేని రోజుల్లో బీడీలు చుట్టే పని చేసి పిల్లల కడుపు నింపేవాళ్లు. ఏ రోజు గురించి ఆ రోజు ఆలోచించేవాళ్లు   రేపటి గురించి ఎలా ఆలోచించగలుగుతారు? అలాంటి గడ్డు పరిస్థితుల్లో పొదుపు వాళ్లకు చక్కని దారి చూపించింది. భవిష్యత్తు గురించి ఆలోచించే శక్తినిచ్చింది. ఇరవై ఏళ్ల క్రితం కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి గ్రామంలో 40 స్వశక్తి సంఘాలు ఏర్పడితే అందులో బాలాజీ మహిళా పొదుపు సంఘం కూడా ఒకటి. మొత్తం పదిమంది సభ్యులు. నెలకి రూ.10 దాచుకొనేవారు. ఆ కొద్దిపాటి డబ్బుని దాచడం కూడా వాళ్లకు మొదట్లో కష్టమయ్యేది. నెమ్మదిగా పొదుపు సొమ్ముని పెంచుకుంటూ వచ్చారు. బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడంతో ఆ స్త్రీల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. తీసుకున్న రుణాలని క్రమం తప్పకుండా తీర్చేవారు. ఆ ఆర్థిక క్రమశిక్షణ వారికి చక్కని ఉపాధి మార్గాలని చూపించింది. బృందంలో ప్రతి ఒక్క సభ్యురాలు ఏదో ఒక ఉపాధి మార్గాన్ని ఎంచుకుని తోటి స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆదర్శంగా నిలిచారు. ఈ బృందంలోని పద్మ కిరాణ దుకాణం పెట్టుకుని కుటుంబానికి అండగా నిలబడింది. రెండేళ్ల క్రితం సొంత ఇంటిని కూడా నిర్మించుకుంది. మరో సభ్యురాలు శారద కోళ్ల పెంపకాన్ని మొదలుపెట్టి లాభాలబాట పట్టింది. సత్తవ్వ అయితే ఏకంగా భూమి కొని కూరగాయలు పండిస్తోంది. మరో సభ్యురాలు... ట్రాక్టర్‌ కొనుగోలు చేసి వ్యవసాయ పనుల కోసం వినియోగిస్తుంది. వీళ్ల క్రమశిక్షణ, శ్రమా వృధా పోలేదు. దేశవ్యాప్తంగా ఉత్తమ పనితీరు కనబరచిన 30 స్వయం సహాయక సంఘాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఎంపిక చేస్తే అందులో తెలంగాణ నుంచి ఎంపికైన సంఘాల్లో ఈ బాలాజీ పొదుపు సంఘం కూడా ఉండటం విశేషం.

                        -అనిల్‌కుమార్‌, కామారెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని